సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్‌ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్‌సింగ్‌వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్‌ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్ తెలిపారు.
ఎంఎస్‌ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్‌ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్రమే మూతపడ్డాయని వివరించారు.
కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment