ఏపీ  జాబ్స్‌: ఇలా చేస్తే.. కొలువు ఖాయం | Andhra Pradesh Jobs Calendar 2021: APPSC Jobs, Preparation Tips, Syllabus | Sakshi
Sakshi News home page

ఏపీ  జాబ్స్‌: ఇలా చేస్తే.. కొలువు ఖాయం

Published Mon, Aug 2 2021 7:32 PM | Last Updated on Mon, Aug 2 2021 7:48 PM

Andhra Pradesh Jobs Calendar 2021: APPSC Jobs, Preparation Tips, Syllabus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే.. ఎండమావే! ఎదురుచూసి చూసి నిరుద్యోగుల కళ్లు కాయలు కాసేవి!! ఒకవేళ అరకొరగా ఏదైనా ఒక నోటిఫికేషన్‌ వచ్చినా.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు గడిచిపోయేవి!! అలాంటి పరిస్థితులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయా జాబ్‌ నోటిఫికేషన్లు వెలువడే నెలను సైతం ప్రకటించడం.. ఉద్యోగార్థులకు అత్యంత శుభ పరిణామం! ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం... 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లు వెలువడే నెలను కూడా నిర్దిష్టంగా ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్‌ వచ్చే రోజు వరకు వేచి చూడకుండా.. తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలను గుర్తించి.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని సలహా ఇస్తున్నారు.  

గ్రూప్స్, పోలీస్, మెడికల్‌.. ఇంకా ఎన్నో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం–గ్రూప్‌–1,2 సర్వీసులు మొదలుకొని మరెన్నో శాఖల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. గ్రూప్స్‌ తర్వాత ఎంతో క్రేజ్‌ ఉండే పోలీస్‌ రిక్రూట్‌మెంట్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకులు, ప్రొఫెసర్లు; వైద్య రంగంలో ఎంతో కీలకమైన డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సులు, పారా మెడికల్‌ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. 

ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్‌టీ బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఇలా మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 10,143 పోస్ట్‌లకు ఇటీవల జాబ్‌ క్యాలెండర్‌ విడుదలైంది. వీటితోపాటు తాజా మరో 1180 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండటం నిరుద్యోగులకు మరో తీపికబురుగా చెప్పొచ్చు. 


ప్రతి ఒక్కరికీ అవకాశం

► జ్యాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు మెడికల్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభించనుంది. ఉదాహరణకు.. గ్రూప్‌–1,2 సర్వీసులకు బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. అదే విధంగా డిగ్రీతో ఎస్‌ఐ స్థాయి ఉద్యోగాలకు, ఇంటర్మీడియెట్‌ అర్హతతో కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

► పారా మెడికల్‌ సిబ్బంది విషయానికొస్తే.. ఆయా విభాగాల్లో పారా మెడికల్‌ కోర్సుల్లో డిప్లొమా తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అర్హత లభించనుంది.

► వైద్య శాఖలో పేర్కొన్న డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్‌ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులు వైద్య శాఖలో నర్స్‌ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.

► విద్యా శాఖలో లెక్చరర్ల పోస్టులకు ఆయా సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్‌ లేదా సెట్‌ స్కోర్‌ సాధించిన వారికి దరఖాస్తుకు అర్హత లభించనుంది.


సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి

గతంలో వివిధ పోస్టులకు మూడంచెలు, రెండంచెల విధానంలో.. నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగేది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అన్ని నియామకాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌/ప్రిలిమినరీ టెస్ట్‌ విధానానికి స్వస్తి పలికింది. ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి.. అందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. గ్రూప్స్‌ మొదలు అన్ని రకాల నియామక ప్రక్రియల్లో ప్రిలిమ్స్‌ విధానం నుంచి విముక్తి లభించనుంది. దీనివల్ల ఉద్యోగార్థులకు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో తమకు అర్హత ఉన్న పలు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది.

సిలబస్‌ను పరిశీలించి
ప్రస్తుతం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం–ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా తమ అర్హతకు సరితూగే పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ అంశాలను పరిశీలించాలి. పరీక్ష విధానం, సిలబస్‌పై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సిలబస్‌లో వెయిటేజీ ఆధారితంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి సంబంధించి అకడమిక్‌ పుస్తకాలతోపాటు.. ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. 


జనరల్‌ స్టడీస్‌

ఏ ఉద్యోగ పరీక్ష అయినా.. జనరల్‌ స్టడీస్‌ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ అంశాలుగా పేర్కొనే ఏపీ, ఇండియన్‌ హిస్టరీ; జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి కోర్‌ అంశాలతోపాటు..సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్‌ సాగించాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలను.. జనరల్‌ స్టడీస్‌లోని కోర్‌ టాపిక్స్‌తో అనుసంధానిస్తూ చదవాలి. అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. 

రాష్ట్ర స్థాయి అంశాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సహజ వనరులు, కళలు–సంస్కృతి, రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలను అవపోసన పట్టాలి. సహజ వనరులు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలు, సదరు సహజ వనరులు అభివృద్ధికి దోహదపడుతున్న తీరును తెలుసుకోవాలి.

ప్రభుత్వ పథకాలు
జనరల్‌ స్టడీస్‌తోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నవ రత్నాలు.. ఉద్దేశాలు, లక్షిత వర్గాలు, వాటికి బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య వంటి అంశాలపై గణాంక సహిత వివరాలతో సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల(ఉదా: ఐటీ పాలసీ, పారిశ్రామిక ప్రణాళిక, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు) గురించి తెలుసుకోవాలి. 

అకడమిక్స్‌ + సమకాలీన
జాబ్‌ క్యాలెండర్‌లో పలు స్పెషలైజ్డ్‌ పోస్ట్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్లు వంటివి. వీటి నియామక ప్రక్రియలో జనరల్‌ స్టడీస్‌తోపాటు ఆయా సబ్జెక్ట్‌ నైపుణ్యాలను పరిశీలించే సబ్జెక్ట్‌ పేపర్లు కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్‌ పేపర్లలో రాణించాలంటే.. అభ్యర్థులు అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్‌ నైపుణ్యాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటికి సంబంధించి తాజాగా పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి. 


డిస్క్రిప్టివ్‌ ప్రిపరేషన్‌

ఉద్యోగ నియామక పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మాత్రం డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదవడం ద్వారా విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇవ్వగలిగే సంసిద్ధత లభిస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు వేగంగా పునశ్చరణకు ఉపయోగపడుతుంది. 

స్వీయ విశ్లేషణ
అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం ద్వారా తమ ప్రిపరేషన్‌ స్థాయిపై ఒక అంచనాకు రావాలి. దీనివల్ల ఇంకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష సిలబస్, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రతి రోజు ఆయా అంశాలకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. టైమ్‌ టేబుల్‌ ప్రకారం చదవడం పూర్తిచేయాలి.


ఒకే అర్హతతో పలు పరీక్షలు

ఒకే అర్హతతో ఒకటి కంటే ఎక్కువ శాఖల్లోని పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా నిర్వహించే గ్రూప్స్, పోలీస్‌–ఎస్‌ఐ పోస్ట్‌లను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్న సిలబస్‌ అంశాల ప్రిపరేషన్‌ను ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాత వేర్వేరుగా ఉన్న టాపిక్స్‌పై పట్టు సాధించేలా ముందుకు సాగాలి. ముందుగా ఏ పరీక్ష జరగనుందో.. ఆ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సదరు పరీక్ష సన్నద్ధతకే పూర్తి సమయం కేటాయించాలి. ఇలా.. ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ముందస్తు ప్రణాళికే ముఖ్యం
ఏపీ జ్యాబ్‌ క్యాలెండర్‌లో.. ఆయా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడే నెలను కూడా ముందుగానే ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఆ టైమ్‌ లైన్‌కు అనుగుణంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించొచ్చు. తాము లక్ష్యంగా ఎంచుకున్న పోస్టులకు సంబంధించి సిలబస్‌ పరిశీలన, ప్రీవియస్‌ పేపర్ల అధ్యయనంతో ముందుగా పరీక్ష స్థాయిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించి.. టాపిక్‌వారీగా వెయిటేజీని అనుసరించి అధ్యయనం చేయాలి. ఏ పరీక్ష అయినా ప్రణాళిక, సమయ పాలన ఎంతో ముఖ్యం. ఈ రెండూ ప్రిపరేషన్‌లో ముందంజలో నిలిచేలా చేస్తాయి. 
– జి.బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement