చెప్పారంటే.. చేయరంతే! | Chandrababu Nara Lokesh Fake Promises To unemployed with job calendar | Sakshi
Sakshi News home page

చెప్పారంటే.. చేయరంతే!

Published Fri, Jan 31 2025 4:52 AM | Last Updated on Fri, Jan 31 2025 2:19 PM

Chandrababu Nara Lokesh Fake Promises To unemployed with job calendar

ఇదీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నైజం

ఏటా జనవరి ఫస్ట్‌న జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తామని హామీ

ఇదే విషయం రాసిపెట్టుకోమన్న మంత్రి నారా లోకేశ్‌

జనవరి పోయె.. ఫిబ్రవరి వచ్చె.. జాబ్‌ కేలండర్‌ ఏది?

గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాఫ్ట్‌ జాబ్‌ కేలండర్‌గా ప్రచారం.. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొత్త గ్రూప్‌–1 పోస్టులంటూ ఆర్భాటం

ఇది తమను మోసం చేయడమేనని నిరుద్యోగుల ఆగ్రహం.. అప్పులు చేసి కొందరు.. చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరికొందరు సతమతం

శిక్షణ కొనసాగించాలో.. ఆపేయాలో తెలియక ఆందోళన

సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్‌ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్‌.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్‌ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్‌నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. 

జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్‌ కేలండర్‌ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్‌ కేలండర్‌ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్‌ మాత్రమే కాదు.. నారా చంద్ర­బాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్‌–1, 2 మెయిన్స్‌ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్‌–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్‌ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్‌–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.

10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన 
కూటమి ప్రభుత్వంలో గ్రూప్‌–2, గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్‌–2, మే నెలలో గ్రూప్‌–1 మెయిన్స్‌కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమా­నం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభు­త్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. 

ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫి­కేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగా­ర్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విర­మించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదన­పడుతున్నారు. 

ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్‌ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్‌–2, గ్రూప్‌–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్‌–2, గ్రూప్‌–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్‌ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌–2 మెయిన్స్‌ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. 

సెప్టెంబర్‌లో జరగాల్సిన గ్రూప్‌–1 మెయిన్స్‌ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్‌ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకా­లిక సెలవులు పెట్టి మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్‌ 30న ‘ఎక్స్‌’లో పోస్టు చేసిన లోకేశ్‌   

మభ్య పెట్టడమే సర్కారు విధానం
రాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు 37, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు 70, బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 175, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ 375, తానాదార్‌ 10, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 12, జూనియర్‌ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సర్వీస్‌ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్‌–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనడం గమనార్హం. 



వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభు­త్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్‌–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్య­పెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫి­కేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్‌ జాబ్‌ కేలండర్‌–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

యువత సంక్షేమం పేరుతో జ్యాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం  

గత ప్రభుత్వంలో షెడ్యూల్‌ ప్రకారమే భర్తీ
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో సర్వీస్‌ కమిషన్‌ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్‌ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికే­షన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యా­యం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివా­లయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 

ఏ ఒక్క నోటిఫికేషన్‌ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. 

చ‌ద‌వండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు

2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్‌లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్‌కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరు­ద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement