ఓ ప్రయత్నం పది మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపథానికి దారిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే... ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్... నెల్లూరు జిల్లా పొదలకూరులో బయో మాస్ బ్రికెట్స్... బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో మారుతి గ్రానైట్స్... ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే. ఇప్పుడు వందలాదిమందికి ఉపాధి కల్పిస్తూ... పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్‌ఎంఈలే సాక్ష్యం.
♦ కరోనా విలయం నుంచి.. విజయపథానికి
♦ గ్రానైట్ ఫ్యాక్టరీతో పది మందికి ఉపాధి.. వ్యవసాయం వదిలి పారిశ్రామిక పయనం
బల్లికురవ: వారిది వ్యవసాయం కుటుంబం. భర్త డిగ్రీవరకూ చదువుకోగా... భార్య పాలిటెక్నిక్ పాసయ్యారు. వారికి వ్యవసాయం ద్వారా తగిన ఆదాయం సమకూరకపోవడంతో పదిమందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. తొలుత పౌల్ట్రీ పరిశ్రమతో ప్రస్థానం మొదలైంది. దంపతులు ఇద్దరూ అక్కడే పనిచేసి కొందరికి ఉపాధి చూపారు. అయితే బంధువులు గ్రానైట్ వ్యాపారాలు చేసి లాభాలు పొందడాన్ని చూశాక వీరికీ ఓ ఆలోచన వచ్చింది.
బాపట్ల జిల్లా ఈర్లకొండ మల్లాయపాలెం గ్రామాల్లో ముడిరాయి దొరుకుతుండడంతో గ్రానైట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. అయితే సాయమందించే ప్రభుత్వం అప్పుడు లేదు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయితీతో రుణం అందించి ఊతం అందించడంతో మారుతి గ్రానైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి కల సాకారమైంది. ఇప్పుడు విజయవంతంగా ఆ సంస్థ నడుస్తోంది. ఇదీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి నీరజ, హనుమంతరావు దంపతుల విజయప్రస్థానం.
అధికారుల నుంచి సానుకూల స్పందన
పరిశ్రమ స్థాపిస్తామని చెప్పగానే పరిశ్రమల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.1.5 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఎస్‌ఐడీబీఐ(సిబీ)గా గుర్తించి బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేశారు. అందులో రూ.90 లక్షలు ప్రభుత్వ రాయితీ కింద వచ్చింది. మొత్తం మూడు కోట్లతో ఫ్యాక్టరీ పెట్టారు. ముడిరాయిని పలకలు కోస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన రాళ్లను అద్దంకి, మార్టూరు, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ పట్టణాలకు తరలిస్తున్నారు.
మాకు ఉపాధి దొరికింది
నాకు ఏపనీ దొరక్క తిరుగుతున్న సమయంలో గ్రానైట్ అధినేత పిలిచి ఉపాధి కల్పించాడు. గతంలో క్వారీల్లో చేసిన అనుభవం ఉండడంతో ఇక్కడ లైన్ పాలిష్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. నెలా నెలా జీతాలు బాగా ఇస్తున్నారు. – డేవిడ్, గ్రానైట్ ఆపరేటర్
కోవిడ్ కష్టకాలంలోనూ చేయూత..
రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ వణికించింది. గ్రానైట్‌పైనా ప్రభావం చూపింది. ఫ్యాక్టరీ మూత పడింది. కరోనాతో వందల మంది మృతి చెందడంతో అన్నీ రెడ్ జోన్‌లే. వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మాకు మరో రూ.28 లక్షల లోన్ ఇచ్చారు. నెలానెలా కంతుల వారీగా రుణం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. పిల్లలను బాగానే చదివించుకుంటున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానే తృప్తి మిగిలింది. సంవత్సరానికి రూ. 1 కోటి వరకు టర్నోవర్ చేస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాకు బాగా అండగా నిలిచింది. – లేమాటి నీరజ, ఫ్యాక్టరీ యజమాని
కర్షకుడి నుంచి కర్మాగార స్థాపన వరకూ..
♦ నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపన
♦ మొక్కవోని దీక్షతో విజయంవైపు అడుగులు
పొదలకూరు: ఆయనో సామాన్య రైతు. వ్యాపారం, పరిశ్రమలపై అవగాహన లేదు. అయినా తాను జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం ఓ చిన్నతరహా పరిశ్రమ స్థాపన వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారు. మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా పరిశ్రమను నిర్వహిస్తూ పది మందికి అన్నం పెడుతున్నారు. ఇదీ పొదలకూరు మండలం సూదుగుంట గ్రామానికి చెందిన పెద్దమల్లు శ్రీనివాసులు రెడ్డి విజయప్రస్థానం.
పడిలేచిన కెరటంలా..
గతంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో సూదుగుంట షుగర్స్, సోనాక్(రొయ్య పిల్లల మేత) వంటి పెద్ద తరహా పరిశ్రమలు, అల్లోవీర, సిమెంటు బ్రిక్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి తట్టుకోలేక మూతపడ్డాయి. కానీ పెద్దమల్లు శ్రీనివాసులురెడ్డి 2015లో బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమలను స్థాపించి నష్టాలు, కష్టాలను అధిగమించి ఓ స్థాయికి చేరుకున్నారు. పడి లేచిన కెరటంలా ఎదిగారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బయో మాస్ బ్రికెట్స్(కట్టె ముక్కలు) తయారీ పరిశ్రమను స్థాపించి తయారు చేసి వస్తువును అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఎంఎస్‌ఎంఈ సర్టిఫికెట్ కూడా పొందలేకపోయారు. ఫలితంగా పరిశ్రమకు ఎలాంటి రాయితీలు పొందలేకపోయారు. బ్రికెట్స్‌ను అమ్ముకోగలిగినా లాభాలు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. ఇబ్బందులతో నెట్టుకొస్తున్న సమయంలో 2019 లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎస్‌ఎంఈ సర్టిఫికెట్ పొంది యూనియన్ బ్యాంకులో రూ.కోటి రుణం పొందగలిగారు. దానితో పరిశ్రమలో ఆధునాతన మెషినరీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచారు.
మార్కెటింగ్ పల్స్ తెలుసుకున్నారు. ఫలితంగా విజయం సాధించి ఇప్పుడు రూ.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 మందికి ఉపాధి అవకాశం కల్పించి నెలకు రూ.3 లక్షల జీతాలు అందజేస్తున్నారు. బ్యాంకు రుణంలో ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇవ్వడం, విద్యుత్ యూనిట్‌కు ఒకరూపాయి సబ్సిడీని అందజేయడంతో నిలదొక్కుకోగలిగారు.
సర్కారు సాయంతోనే నిలదొక్కుకున్నాం
ప్రారంభంలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొన్నాను. నిలదొక్కుకునేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ నిలదొక్కుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నా అదృష్టం బాగుండి 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రోత్సాహాలు లభించాయి. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన టిప్పర్లు, మెషనరీ కొనుగోలు చేయగలిగాను.
ఎంఎస్‌ఎంఈ సర్టిఫికెట్ పొందడం వల్ల పంచాయతీ, టౌన్‌ప్లానింగ్ అనుమతులు లభించాయి. ఫలితంగా పరిశ్రమ గాడిలో పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతున్నాను. ఎలాంటి కాలుష్యం ఏర్పడనందున ఫార్మాసిటికల్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. – పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, పొదలకూరు
స్థానికంగానే ఉద్యోగం దొరికింది
నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మా ఊరికి చెందిన మారుతీ గ్రానైట్స్ నీరజ, హనుమంతరావు ఫ్యాక్టరీ పెట్టడంతో నాకు అందులో సూపర్‌వైజర్‌గా పని ఇచ్చారు. నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్లే నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని లేకుండా ఉపాధి దొరికింది. నాతోపాటు ఇక్కడ మరో 15 మంది పనిచేస్తున్నారు. – వెంకటేశ్, సూపర్‌వైజర్
పదేళ్లుగా పనిచేయిస్తున్నా..
మాది రాజస్థాన్. బతుకుతెరువు కోసం వచ్చా. ఇక్కడ మేస్త్రీగా పని చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ యజమాని మాకు బాగా నచ్చాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నెలా నెలా వేతనాలు అందుతున్నాయి. – బీరారామ్, మేస్త్రీ
డెంటిస్ట్ కల అలా సాకారమైంది
విశాఖలో డెంటల్ ల్యాబ్‌కు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం: ఆయనో దంత వైద్యుడు. వైద్య విద్యను పూర్తి చేసుకుని 2010లో విశాఖపట్నం మురళీనగర్‌లో ఓ డెంటల్ క్లినిక్ ప్రారంభించారు. తాను నడిపే క్లినిక్‌కంటే దానికి సంబంధించిన ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తే పలువురికి ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. దాని వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశారు. స్నేహితుడు గోపీకృష్ణతో కలిసి కృత్రిమ దంతాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఎంఎస్‌ఎంఈ సింగిల్ పోర్టల్ విధానంలో నెల రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు రుణమూ మంజూరైంది. రూ.3.50 కోట్ల పెట్టుబడితో 2020 జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక టర్నోవర్ రూ.4.80 కోట్లకు చేర్చారు. ఆయన పేరు డాక్టర్ గండి వెంకట శివప్రసాద్. ఆయన స్థాపించిన యూనిట్ పేరు డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ డెంటల్ ల్యాబ్‌కు రూ.20 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ కూడా మంజూరు చేసింది.
మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో...
విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ల్యాబ్ నడుస్తోంది. ఇందులో కృత్రిమ దంతాలకు అవసరమైన అచ్చులు, క్రౌన్లు, బ్రిడ్జిలు వంటివి తయారు చేస్తారు. వీటిని కాస్టింగ్ టెక్నాలజీతో కాకుండా మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో డిజిటల్ త్రీడీ ప్రింటింగ్ విధానంలో చేస్తారు. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఇవి మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇప్పుడు 45 మంది శాశ్వత, 20 మంది తాత్కాలిక, మరో 20 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. అతి తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకవసరమైన అనుమతులను మంజూరు చేస్తోంది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మా ల్యాబ్‌ను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు రూ.6.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఉత్పత్తులు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులో దేశమంతటా విస్తరించాలని యోచిస్తున్నాం. ల్యాబ్ విస్తరిస్తే వెయ్యి మంది ఉపాధి పొందుతారని భావిస్తున్నాం. – డా. గండి వెంకట శివప్రసాద్, ఎండీ, డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment