
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ పీఎమ్‌ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్.
పీఎమ్‌ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. 2008లో మొదలైన ఈ పథకం గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించి వారి ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (MSME) పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ కేవీఐసీ ద్వారా ఇది అమలవుతోంది. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణసౌకర్యం అందుతోంది. అభ్యర్థులు పది శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సహాయాన్ని పొందవచ్చు. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రం అయిదు శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకులు 95 రుణాన్ని అందిస్తాయి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఫిజికల్లీ చాలెంజ్డ్, ట్రాన్స్‌జెండర్స్, గ్రామీణ ప్రాంతం వారికి 35 శాతం రాయితీ కూడా లభిస్తుంది. జనరల్ కేటగిరీలోని వారికేమో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ కేటాయించారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి... ముందుగా అభ్యర్థులు పీఎమ్‌ఈజీపీ పోర్టల్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అందులో వివరాలను స్పష్టంగా, పూర్తిగా నింపాలి. తర్వాత దాన్ని గ్రామీణప్రాంతాలవారైతే కేవీఐసీకి, పట్టణ ప్రాంతం వారైతే డీఐసీకి అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారుల నుంచి స్పందన ఉంటుంది. అధికారుల తనిఖీ అనంతరం వారి సూచన మేరకు.. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇస్తున్న ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణకు సంబంధించిన పరీక్ష కూడా పాసై, సర్టిఫికెట్ పొందాలి.
అర్హతలు... 18 ఏళ్లు నిండి, కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలి. స్వయం సహాయక బృందాలు కూడా అర్హులే! ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన పత్రాలు... 1. వ్యాపారానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్, 2. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సహా వివరాలు నమోదు చేసిన అప్లికేషన్ ఫామ్, 3. ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్, 4. శిక్షణ పొందిన ఆంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్‌ప్రోగ్రామ్ సర్టిఫికెట్. 5. ఎక్స్‌పీరియెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్.
వ్యాపారాలు... పేపర్ నాప్కిన్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్.. అనుబంధ ఉత్పత్తులు, నాన్ ఓవెన్ బ్యాగ్స్, పెన్నుల తయారీ, షాంపూ, డిటర్జెంట్‌లు, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ తయారీ, ΄్యాక్డ్ వాటర్, ఎల్‌ఈడీ లైట్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాలు, రసాయన పాలిమర్లు, టెక్స్‌టైల్స్, ఫారెస్ట్ ఇండస్ట్రీ వంటివాటికీ ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు. గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయాధారిత, పాడి, వర్తక విభాగాల్లోనూ దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2022– 2025 మధ్య కాలంలో ఈ పథకానికి 13,554.42 కోట్ల రూపాయలను కేటాయించారు.
– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్
మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.com
నిర్వహణ : సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment