హమ్మయ్యా..!
ఒంగోలు టూటౌన్ : ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ఇంటర్వూ్యలకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ అనుమతితో ఈ నెల 24, 25వ తేదీల్లో అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒంగోలులోని టెక్నాలాజీ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ (టీటీడీసీ)లో ఇంటర్వూ్యలు నిర్వహించనున్నారు. 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఖాధీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (కేవీఐబీ) దరఖాస్తుదారులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. 25న జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.ఆనంద్కుమార్ తెలిపారు. డీఐసీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న రూరల్ అభ్యర్థులకు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్బన్ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ అభ్యర్థులను ఇంటర్వూ్య చేస్తుంది.
ఫలించిన ఎదురు చూపులు
పీఎంఈజీపీ రుణాల కోసం రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించలేదు. బ్యాంకు లింకేజీ రుణాలు కావడంతో నిరుద్యోగులకు రుణాలు అందని ద్రాక్షే అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలతో ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులు జిల్లాలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పేదరికంతో చదువులు మధ్యలో మానేసిన వారే. ఇటు ఉన్నత చదువులు చదవలేక అటు వ్యవసాయ భూములు లేక కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది పీఎంఈజీపీ రుణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సిమెంట్ ఇటుకల తయారీ, కారం మిల్లులు, డిటర్జంట్ పౌడర్ల తయారీ, గ్రానైట్ ఫాలిషింగ్, ఐస్ క్రీమ్ తయారీ, మహిళలు ఇంటి వద్ద ఉండి తయారు చేసే పలు కుటీర పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లకు పీఎంఈజీపీ కింద బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇస్తారు. యూనిట్ విలువ ఆధారంగా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రుణాలు ఇస్తారు. కనీసం 8వ తరగతి వరకు చదివిన వారు రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్వయం సహాయక సంఘాల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల వారికి 15 శాతం, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు 25 శాతం వరకు యూనిట్ విలువలో రాయితీ ఇస్తారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం లక్ష్యాలకు.. బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. దీంతో లక్ష్యాల్లో పురోగతి కనిపించకపోవడంతో పీఎంఈజీపీ రుణాలను ప్రభుత్వం ఏటా తగ్గిస్తూ వస్తోంది. దీనికి తోడు బ్యాంకు నుంచి లభించే రుణ సదుపాయం, సాంకేతిక సహకారం వంటి వాటిని ప్రభుత్వం గాలికొదిలేసింది. కేవలం లబ్ధిదారుల ఎంపికతోనే చేతులు దులుపుకోవడంతో పథకం నీరుగారింది. 2009 నుంచి కనీసం 132 యూనిట్ల వరకు లక్ష్యాలు ఇస్తున్న సర్కార్.. రానురానూ క్రమంగా 32 యూనిట్లకు కుదించింది.
దీనికి తోడు రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించిన పాపాన పోలేదు. దీంతో నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి పీఎంఈజీపీ ఇంటర్వూ్యల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది కనీసం 500 మంది నిరుద్యోగులకైనా పీఎంఈజీపీ రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ భక్తవత్సలం డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించక పోవడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఆన్లైన్లో రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించి చిన్న పరిశ్రమలతోనైనా జీవితంలో స్థిరపడేందుకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారులు ఆ దశగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికే..
01–07–2016 నుంచి 2017 జనవరి 31లోపు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుదారులకు మాత్రమే ప్రస్తుతం ఇంటర్వూ్యలకు కాల్ లెటర్లు పంపుతారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులు), ప్రత్యేక అర్హత సంబంధిత పత్రం (వికలాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు), రూరల్ ఏరియా సర్టిఫికెట్, పాపులేషన్ సర్టిఫికెట్, అభ్యర్థి స్థాపించబోయే ప్రాజెక్టు నివేదిక, విద్యార్హత పత్రాలు, ఆన్లైన్ దరఖాస్తు కాపీ, పాస్పోర్టు సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్లను వెంట తెచ్చుకోవాలని జీఎం సూచించారు.