
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఓ సైబర్ కేటుగాడు అరెస్టయ్యాడు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, కొందరు రాజకీయ ప్రముఖులు అతని చేతిలో మోసపోయినట్టు సమాచారం. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (పీఎంఈజీపీ) కింద సబ్సిడీ రుణాలు ఇస్పిస్తానని టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్టీపీసీ ఉద్యోగి తోట బాలాజీ బురిడీ కొట్టించినట్టు తెలిసింది. పీఎంఈజీపీ కింద రూ.50 లక్షలు లోన్ ఇప్పిస్తానని అందుకుగాను 5 శాతం ప్రాసెసింగ్ ఫీజు కింద అకౌంట్‌లో వేయాలని నిందితుడు నమ్మబలికాడు.
దాంతో అతని మాయమాటలు నమ్మిన సదరు ఎమ్మెల్యే రూ.2.5 లక్షలు నిందితుని అకౌంట్‌లో వేయించారు. అతని నుంచి ఎంతకీ ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా బాలాజీ నిందితుడిగా తేలింది. పాండిచ్చెరిలో అతని అరెస్టు చేసిన సైబర్‌క్రైం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment