సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల వారీగా క్లస్టర్లను ప్రభుత్వం గుర్తించింది. ఏ పంట ఏ క్లస్టర్లలో అధికంగా సాగవుతుందో నిర్ధారించింది. గుర్తించిన క్లస్టర్లలో వచ్చే వానాకాలం సీజన్‌లో పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. పంట కోత అనంతరం క్లస్టర్ల ఆధారంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.
పంటలు శాస్త్రీయంగా సాగు కావాలన్నది క్లస్టర్ల నిర్ధారణలోని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల రైతులకు బాగా ప్రయోజనం కలుగుతుందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్లస్టర్ల ప్రకారం ఈసారి వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. రాష్ట్రంలో సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయా బీన్‌తో పాటు పలు పంటలను ఏ జిల్లాలో ఎంత వేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఏ పంట ఎక్కువగా సాగవుతుందో దానిపై దృష్టి
ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువగా సాగవుతుందనే దాని ఆధారంగా ఆ పంట క్లస్టర్‌ను గుర్తించారు. ఒకవేళ రెండు ప్రధాన పంటలుంటే, వాటిల్లో ఏది 50 శాతం పైగా ఉందో దాన్ని ఆ పంట క్లస్టర్ (ఐదు వేల ఎకరాలు)గా నిర్ధారించారు. ఆ క్లస్టర్‌లో ఆ పంటపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు.
రైతులకు కూడా ఆ ప్రధాన పంటపైనే అవగాహన కల్పిస్తారు. నిర్దిష్ట పంట క్లస్టర్‌లో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రధాన పంటలను 2,615 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 , కందులకు 71, సోయాబీన్‌కు 21, మొక్కజొన్నకు 9 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నాగర్‌కర్నూల్‌లో 142 పంట క్లస్టర్లు..
అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో 142 పంట క్లస్టర్లు, నల్లగొండ జిల్లాలో 140, ఖమ్మం జిల్లాలో 129, సిద్దిపేటలో 128 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడ్చల్, ములుగు జిల్లాల్లో అత్యంత తక్కువగా 15 క్లస్టర్ల చొప్పున మాత్రమే ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ 5 వేల ఎకరాల్లో ఉండగా, వాటిని పంటల వారీగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పత్తి క్లస్టర్లే ఎక్కువ.. మొక్కజొన్న మూడు జిల్లాల్లోనే
రాష్ట్రంలో గుర్తించిన క్లస్టర్లలో అత్యధికంగా పత్తి క్లస్టర్లే ఉన్నాయి. అయితే జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో పత్తి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. కాగా ఆ జిల్లాల్లో ఏ ఒక్కచోట కూడా అత్యధికంగా పత్తి సాగు కావడం లేదని దీనిని బట్టి తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏకంగా 110 క్లస్టర్లలో పత్తి సాగు చేస్తారు.
ఇక ఆదిలాబాద్ జిల్లాలో వరి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. అక్కడ 98 పత్తి క్లస్టర్లు ఉన్నాయి. ఇక నారాయణపేట సహా ఎనిమిది జిల్లాల్లో కంది క్లస్టర్లు, కామారెడ్డితో పాటు నాలుగు జిల్లాల్లో సోయాబీన్ క్లస్టర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి అయినా.. కేవలం మూడు జిల్లాల్లోనే ఈ పంట క్లస్టర్లు ఉన్నాయి.
80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు!
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వానాకాలంలో పత్తి పంటను ఎక్కువగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దాదాపు 80 లక్షల ఎకరాలకుపైగా పత్తి వేసేలా ప్రణాళికలు రచిస్తోంది. పత్తి పంటతో వచ్చే లాభాలు రైతులకు వివరించి ఎక్కువ సాగయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. గత ఏడాది వానాకాలంలో వేసిన పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా పత్తినే ఎక్కువ వేయాలని రైతులకు సూచించాలని నిర్ణయించింది. ఒకవేళ మార్కెట్లో ధర పడిపోయినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వరి సాగుపై గందరగోళం కొనసాగుతున్నందున రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment