పత్తి 15.60 లక్షల ఎకరాల్లో, కంది 76 వేల ఎకరాల్లో
వ్యవసాయ మంత్రి తుమ్మల వెల్లడి
ఎరువుల సరఫరా పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు.
10.40 ఎల్‌ఎంటీల యూరియా కేటాయింపు
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా, 2.40 ఎల్‌ఎంటీల డీఏపీ, 10.00 ఎల్‌ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్‌ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్‌ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్‌ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్‌ఎంటీల డీఏపీ, 1.30 ఎల్‌ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్‌ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్‌ఎంటీల యూరియా, 0.54 ఎల్‌ఎంటీల డీఏపీ, 1.06 ఎల్‌ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు.
ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖ
ఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు.
వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment