రుణమాఫీ, రైతు భరోసా, బీమాలకు ఖర్చు
వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు.
హెచ్‌ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్ ఇన్‌స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్ గోపి, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment