అందులో పత్తి ఒక్కటే 33 లక్షల ఎకరాలకు పైనే
గత ఏడాది కంటే భారీగా వానాకాలం సాగు
ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక
17 జిల్లాల్లో అధికం నుంచి అత్యధిక వర్షపాతం నమోదు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సాగును ఈ సారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సీజన్‌లో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది వానాకాలం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.76 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు.
ఇప్పటివరకు వేసిన పంటల్లో అత్యధికంగా పత్తి ఏకంగా 33.81 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 66.97 శాతం వేశారు. ఈ ఏడాది పత్తిని 60 లక్షల ఎకరాల్లో పండించాలని చేయాలని ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే మూడు శాతానికే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో వేశారు.
అందులో ఒక్క కంది పంటనే 2.37 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.92 లక్షల ఎకరాలు సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.55 లక్షల ఎకరాల్లో పంట వేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 99.96 శాతం..
ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు సాగైన జిల్లాల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. ఈ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 5,62,594 ఎకరాలు కాగా, 5,62,386 ఎకరాల్లో సాగైంది. అంటే 99.96 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత సాగు కావడం విశేషం. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 8.16 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి సాధారణం, అధికం, అత్యధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తెలిపింది. 17 జిల్లాల్లో అధికం నుంచి అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
ఇక హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదని వ్యవసాయ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment