
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను హత్య చేసినట్టు తెలుస్తోంది. యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్య. ఈ సందర్భంగా బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు సమాచారం. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెంట్‌గా వ్యవహరించిన బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న తెలిసింది.
మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించనున్నారు.
ఇది కూడా చదవండి: సహస్ర హత్యపై సీపీ మహంతి.. సంచలన విషయాలు వెల్లడి..
ఇక, కూకట్‌పల్లి దయార్‌గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను పదో తరగతి బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వచ్చిన అతడు.. బాలిక చూడటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు విచారణలో భాగంగా బాలానగర్, కూకట్‌పల్లి పోలీసులు, ఎస్‌వోటీ సిబ్బంది నాలుగు రోజులుగా వందలాది సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..‘హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడదూకి అపార్ట్‌మెంట్‌లోకి రావడాన్ని గమనించానంటూ’ కూకట్‌పల్లి పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ దిశగా విచారించారు.
అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. ‘హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్‌పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్‌ను వాషింగ్ మెషిన్‌లో వేశానని’ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు దొంగతనం ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలో ఆన్‌లైన్‌లో శోధించాడు. ఈ వివరాలన్నీ బాలుడు కాగితంపై రాసుకున్నట్లు సమాచారం.