51.40 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం
రైతులు ఒకే కంపెనీ విత్తనాలు కాకుండాగతంలో దిగుబడి ఇచ్చిన విత్తనాలు కొనాలి
రూ. 2.49 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం..
33 మంది అరెస్టు
12.28 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 2023–24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా, ఈ వానాకాలం సీజన్‌లో 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు.
దీనికనుగుణంగా బుధవారం వరకు 51,40,405 పత్తి ప్యాకెట్లను వివిధ జిల్లాలలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 పత్తి ప్యాకెట్లను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
క్యూల్లో ప్యాకెట్ల పంపిణీ ఎక్కడ.. ఎందుకంటే..
కొన్ని జిల్లాల్లోని రైతులు ఒకే కంపెనీకి చెందిన, ఒకే రకం పత్తి విత్తనాల కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే ఆ రకం విత్తనాలు డిమాండ్ మేరకు లేకపోవడం వల్ల ఉన్న వాటిని రైతులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక్కొక్కరినీ వరుసలో నిల్చోబెట్టి ఆ రకానికి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లు రెండేసి చొప్పున ఇచ్చామని ఆయన వివరించారు. అంతేతప్ప ఆ మార్కెట్లలోగానీ, ఆ జిల్లాల్లో గానీ పత్తి విత్తన ప్యాకెట్లలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు.
రైతులు ఒకటే కంపెనీ కోసం పోటీ పడొద్దు
రైతులు కేవలం ఒకటే కంపెనీ, ఒకటే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న, గతంలో మంచి దిగుబడులు ఇచ్చిన రకాలను కూడా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. విత్తన చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రూ.2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ళ నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకొని 33 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేస్తాం
ఈ వానాకాలంలో 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తనాన్ని పంపిణీ చేయాలని ప్రతిపాదించి, ఇప్పటివరకు 79,261 క్వింటాళ్ళు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్ళు రైతులు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువులను 12.28 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తన దుకాణం వద్ద మండుటెండను సైతం లెక్కచేయకుండా విత్తనాలను కొనుగోలు చేసేందుకు గంటల తరబడి బారులు తీరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో బుధవారం విత్తన దుకాణాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ రాజర్షి షా రైతుల ఇబ్బందులను చూసి.. టెంట్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానిని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు టెంట్లు ఏర్పాటు చేయడంతో రైతులు కాస్త సేద తీరారు.–సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment