cotton seeds
-
నకిలీ విత్తనాలు.. దాడులు..
సాక్షి నెట్వర్క్: పత్తి విత్తనాల కోసం రైతుల ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలుచోట్ల అధికార యంత్రాంగం దాడులు, తనిఖీలు చేపట్టింది. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఓ దుకాణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. లూజ్ విత్తనాలను వివిధ కంపెనీల పేరిట ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దాని యజమాని రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తన గోదాముల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. మరోవైపు ఇక్కడి తాంసి బస్టాండ్ సమీపంలోని నిఖిల్ ఫర్టీలైజర్ షాపులో స్టాక్ ఉన్నా డీలర్ నోస్టాక్ బోర్డు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై అధికారులు చర్యలు చేపట్టారు. నిఖిల్ ఫర్టీలైజర్ షాపు వద్ద ఇన్చార్జ్గా ఉన్న ఏఈఓ శివచరణ్‌ను సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ అర్బన్ ఏఓ భగత్ రమేశ్‌ను బదిలీ చేశారు. ఇక విత్తనాలు గోదాంలో అందుబాటులో ఉన్నా, డీలర్లకు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాశీ–659 డిస్ట్రిబ్యూటర్ వామన్‌రావుపై కేసు నమోదు చేశారు. ⇒ ఖమ్మంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను కలెక్టర్ గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశా రు. ఆ సమయంలో దుకాణాల వద్దకు వచ్చిన రైతు లతో మాట్లాడారు. అన్ని రకాల పత్తి విత్తనాలు ఒకటేనని, ఏవైనా దిగుబడి బాగానే వస్తాయని చెప్పారు. ⇒ మరోవైపు జనుము, జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జీలుగ విత్తనాల కోసం బారులుతీరారు. -
75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం
సాక్షి, హైదరాబాద్: విత్తనాల సరఫరాను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్లు విస్తృతంగా పర్యటించా లని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. గత ఏడాది పచ్చిరొట్ట విత్తన విక్ర యాలు 26,997 క్వింటాళ్లు ఉండగా.. ఈ ఏడాది 58,565 క్వింటాళ్లు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందు బాటులో ఉంచామని స్పష్టం చేశారు.శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి విత్తన పంపిణీపై ఆరా తీశారు. గతేడాది 1,000 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు పంపిణీ అయితే.. ఈ ఏడాది 1,800 క్వింటాళ్ల విత్తనాలు అందు బాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. రైతులు కోరుతున్న ఓ కంపెనీ పత్తి విత్తనాల విషయంలో 30 వేల ప్యాకెట్లు అదనంగా ఇవ్వడానికి ఆ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో విత్తనాలు అందేలా చూస్తామని మంత్రికి వివరించారు. -
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా -
పత్తి విత్తనాల కొరత ?..మంత్రి తుమ్మల రియాక్షన్
-
పత్తి విత్తనాల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 2023–24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా, ఈ వానాకాలం సీజన్లో 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు. దీనికనుగుణంగా బుధవారం వరకు 51,40,405 పత్తి ప్యాకెట్లను వివిధ జిల్లాలలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 పత్తి ప్యాకెట్లను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.క్యూల్లో ప్యాకెట్ల పంపిణీ ఎక్కడ.. ఎందుకంటే..కొన్ని జిల్లాల్లోని రైతులు ఒకే కంపెనీకి చెందిన, ఒకే రకం పత్తి విత్తనాల కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే ఆ రకం విత్తనాలు డిమాండ్ మేరకు లేకపోవడం వల్ల ఉన్న వాటిని రైతులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక్కొక్కరినీ వరుసలో నిల్చోబెట్టి ఆ రకానికి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లు రెండేసి చొప్పున ఇచ్చామని ఆయన వివరించారు. అంతేతప్ప ఆ మార్కెట్లలోగానీ, ఆ జిల్లాల్లో గానీ పత్తి విత్తన ప్యాకెట్లలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు ఒకటే కంపెనీ కోసం పోటీ పడొద్దురైతులు కేవలం ఒకటే కంపెనీ, ఒకటే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న, గతంలో మంచి దిగుబడులు ఇచ్చిన రకాలను కూడా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. విత్తన చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ళ నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకొని 33 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేస్తాంఈ వానాకాలంలో 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తనాన్ని పంపిణీ చేయాలని ప్రతిపాదించి, ఇప్పటివరకు 79,261 క్వింటాళ్ళు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్ళు రైతులు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులను 12.28 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తన దుకాణం వద్ద మండుటెండను సైతం లెక్కచేయకుండా విత్తనాలను కొనుగోలు చేసేందుకు గంటల తరబడి బారులు తీరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో బుధవారం విత్తన దుకాణాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ రాజర్షి షా రైతుల ఇబ్బందులను చూసి.. టెంట్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానిని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు టెంట్లు ఏర్పాటు చేయడంతో రైతులు కాస్త సేద తీరారు.–సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
‘డిమాండ్’ పత్తి కోసం ఉద్రిక్తత
ఆదిలాబాద్ టౌన్, బోనకల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తి విత్తన దుకాణాల వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో అన్నదాతలు జిల్లా నలుమూలల నుంచి విత్తనాల కొనుగోలు కోసం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్నారు. గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతాల్లోని ఆయా విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. డిమాండ్ రకం పత్తి విత్తనాల కోసం రైతులు కొద్ది రోజులుగా జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్తున్నారు. ఇందులో భాగంగా వేకువజామునే భారీగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. దుకాణ యజమానులు ఆధార్ కార్డు ఉన్నవారికి రెండు ప్యాకెట్లకు మించి ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. కొందరు విత్తన దుకాణంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదు పు చేసేందుకు పోలీసులు లోనికి చొరబడ్డ రైతులను చెదరగొట్టారు. ఈ సమయంలోనే కొంత మంది రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగా రు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు రైతు సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు అక్కడికి చేరుకొని రైతులకు డిమాండ్ రకం విత్తనాలు అందించాలని డీలర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ సన్నద్ధం కంటే ముందే అన్నదాతలకు విత్తన కష్టాలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విత్తనాలకు డిమాండ్ ఉందో వాటిని కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. కాగా, ఆ తర్వాత పోలీసులు దగ్గరుండి ఒక్కో రైతుకు రెండు విత్తన ప్యాకెట్లను అందజేశారు. లాఠీచార్జి చేయలేదు: ఎస్పీ గౌస్ ఆలం జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల దుకాణాల వద్ద రైతులపై పోలీసులు ఎలాంటి లాఠీచార్జి చేయలేదని ఎస్పీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. విత్తన దుకాణాల వద్ద భారీగా చేరుకున్న రైతులను వరుసక్రమంలో నిలబడేలా మాత్రమే పోలీసులు చర్యలు చేపట్టారని వివరించారు. పోలీసులు రైతులను అడ్డుకున్నారని, చెదరగొట్టారనేది అవాస్తవమని తెలిపారు.ఆ కంపెనీ పత్తి విత్తనాల కోసంరైతుల బారులు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలోని ఓ విత్తనాల షాపు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ విత్తనాల (యూఎస్ సీడ్స్) కోసం రైతులు మంగళవారం బారులు తీరారు. ఆ పత్తి విత్తనాలను గత ఏడాది సాగు చేసిన రైతులకు అధిక దిగుబడి వచి్చందనే సమాచారంతో క్యూ కట్టారు. ఈ విషయమై వ్యవసాయాధికారి సరిత మాట్లాడుతూ ప్రభుత్వం ధ్రువీకరించిన చాలా రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నందున రైతులు ఒకే రకం కోసం ఆరాటపడొద్దని సూచించారు. -
ప్రతిగింజా కొంటామని కిషన్‌రెడ్డి చెప్పలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజా కొనిపించే బాధ్యత నాది అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పింది నిజంకాదా? వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. కొనిపించే బాధ్యత నాది. అన్నది గుర్తు లేదా? రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్ చెప్పింది వాస్తవం కాదా? ఆ తర్వాత రా రైస్.. బాయిల్డ్ రైస్ పేరుతో రాజకీయం చేసింది నిజం కాదా? ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా’ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు పలు ప్రశ్నలతో కూడిన ప్రకటన విడుదల చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పుడైనా నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను రూ.1,200 కోట్లతో పునర్నిర్మించినట్లుగా కనీసం రూ.500 కోట్లు కేంద్రం ద్వారా తీసుకొచ్చి జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తామని వాగ్దానం చేసే దమ్ముందా? అని మంత్రి సవాల్ విసిరారు. -
ఆర్బీకేల ద్వారానే పత్తి విత్తన విక్రయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ సీజన్లో నిర్ధేశించిన సాగు లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన బీటీ పత్తి విత్తనాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్ ఆదేశించారు. ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కంపెనీలు ఎంవోయూలు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తన ఉత్పత్తిదారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 5.82 లక్షల హెక్టార్లు కాగా, రానున్న ఖరీఫ్ సీజన్లో 6.17 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇందుకోసం 36 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమన్నారు. ఆ మేరకు జన్యు ఇంజనీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) ఆమోదించిన నాణ్యమైన బీటీ విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తివిత్తన విక్రయ ధర (475 గ్రాముల ప్యాకెట్) బీజీ–1కు రూ.635, బీజీ–2 ప్యాకెట్‌కు రూ.810గా నిర్ణయించిందన్నారు. అంతకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీఈఏసీ నిషేధించిన హెచ్‌టీ పత్తివిత్తనాలను విక్రయించరాదని, ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు తమదృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్లో 47 లక్షల విత్తన ప్యాకెట్లు సరఫరా చేయగలమని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. -
పత్తి విత్తన ధర పైపైకి..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ధరలను పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం వద్దని మొరపెట్టుకున్నా వినలేదు. విత్తన ధరలు పెంచితే రైతులకు నష్టం వస్తుందని అధికారులు లేఖ రాసినా పట్టించుకోలేదు. పత్తి విత్తన ధరల పెంపుపై కేంద్రం నిర్వహించిన సమావేశాల్లోనూ తెలంగాణ వ్యవసాయశాఖ వ్యతిరేకించింది. రెండేళ్లుగా పత్తి విత్తన ధరల పెంపు కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా 475 గ్రాముల బీజీ–2 పత్తి ప్యాకెట్‌పై రూ.43 అదనంగా పెరిగింది. 2020–21లో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.730 ఉండగా, 2021–22లో రూ.767కు పెంచింది. ఇప్పుడు 2022–23లో ప్యాకెట్ ధర రూ.810కు పెంచుతూ కేంద్రం తాజాగా గెజిట్ జారీ చేసింది. కరోనా సమయంలో ఇలా పెంచుతూపోవడం సమంజసం కాదని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. కాటన్ సీడ్ కంట్రోల్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు...: రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి, పత్తి అత్యధికంగా సాగవుతాయి. గతేడాది 50.94 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో వరికి ప్రత్యామ్నాయంగా ఇతరత్రా పంటలను సాగు చేయించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఇందులో పత్తిపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనా.. ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున 1.20 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. అయితే కంపెనీలు అవసరానికి మించి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాయి. పెరిగిన ధరల ప్రకారం.. రూ.కోట్లలో రైతులపై భారం పడనుంది. ఒక్కోసారి సకాలంలో వర్షాలు కురవక, విత్తనాలు మొలకెత్తక భూమిలోనే ఎండిపోతాయి. అప్పుడు రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి వేస్తారు. పత్తి విత్తన ధరల పెంపుపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని వ్యవసాయ వర్గాలు కోరుతున్నాయి. కంపెనీలకు లాభం చేకూర్చేందుకే.. విత్తన కంపెనీలకు లాభం చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ధరలను ఏటేటా పెంచుతూ వస్తోంది. అంతేగాకుండా సీడ్ ఆర్గనైజర్ల జేబులు నింపేలా కుట్ర పన్నుతోంది. కొందరు పెద్దల కనుసన్నల్లో ఇది జరుగుతోంది. ఈ పెంపుతో పత్తివిత్తన రైతులకు ఒరిగేది కూడా ఏమీలేదు. వారికి ప్యాకెట్‌పై కేవలం 32 శాతమే ఇస్తున్నారు. మిగతాది కంపెనీలకే వెళ్తుంది. కాబట్టి ఇది విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లకు లాభం చేకూరుస్తుందనేది అర్థమవుతోంది. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
సలసలకాగుతున్న వంటనూనె ధరలు! మరోసారి షాక్ తప్పదా?
Edible Oil Prices: కరువుతో అమెరికా , బ్రెజిల్‌లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు ఇలా అంతర్జాతీయ కారణాలతో ఇంత కాలం వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడికి చుర్రుమనిపిస్తున్నాయి. ఇప్పుడు వాటికి మన దేశంలోని పరిస్థితులు కూడా తోడవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వంట నూనె ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గుజరాత్లో తగ్గిన ఉత్పత్తి దేశంలో వంట నూనె ఫ్యాక్టరీల్లో సింహభాగం గుజరాత్‌లోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా వెయ్యికి పైగా వంట నూనె తయారీ కర్మాగారాలు ఉండగా ఇందులో ఇప్పటికే 800లకు పైగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపుగా మూత పడ్డాయి. భారీ నూనె తయారీ పరిశ్రమల్లోనే ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ఫ్యాక్టరీల్లో కూడా మరో నెలకు సరిపడా ముడి పదార్థాలు ఉన్నాయి. మిల్లర్ల మొండిపట్టు వంటనూనె ముడి పదార్థాలైన వేరు శనగ, పత్తిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా పత్తికి సంబంధించి నాఫెడ్ దగ్గర సరిపడా నిల్వలు ఉన్నా.. ధర ఎక్కువగా ఉందనే కారణం చెబుతూ మిల్లర్లు కొనుగోల్లు మానేశారు. ధర తగ్గిన తర్వాతే ఉత్పత్తి మొదలు పెడతామంటూ భీష్మించుకున్నారు. పెరిగిన విదేశీ ఎగుమతులు గుజరాత్ నుంచి పత్తి, వేరు శనగల ఎగుమతులు విదేశాలకు పెరిగాయి. సాధారణంగా ప్రతీ ఏడు ఈ రాష్ట్రం నుంచి 30 లక్షల పత్తి బేళ్లు ఎగుమతి అవుతుండగా ఈ సారి మొత్తం 55 లక్షలకు చేరుకుంది. విదేశీ ఎగుమతులు పెరగడంతో గత పన్నెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కో బేల్ ధర రూ. 57,000లుగా పలుకుతోంది. దీంతో వీటిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ముందుకు రావడం లేదు. అప్పుడే వంద పెరిగింది గుజరాత్లో కాటన్ సీడ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వాటి ప్రభావం వంట నూనెల ధరలపై పడుతోంది. ఇప్పటికే 15 కేజీల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.100 వరకు పెరిగింది. 15 కేజీల గ్రౌండ్ నట్ ఆయిల్ ధర రూ. 2,550 నుంచి రూ. 2,560లకి చేరుకుంది. కాటన్ సీడ్ టిన్ ధర రూ. 2400 నుంచి రూ.2500కి చేరుకుంది. చదవండి: Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’! -
నకిలీ విత్తనం.. మాఫియా పెత్తనం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పత్తివిత్తన మాఫియా నకిలీలలు’అన్నీఇన్నీకావు. అక్రమార్కుల మాయాజాలంలో అ మాయక రైతులు చిక్కుకుంటున్నారు. తాము కొని సాగు చేసినవి నకిలీ విత్తనాలనే విషయం కూడా రైతులకు తెలియకపోవడం గమనార్హం. నకిలీ విత్తనాలను పసిగట్టే పరిస్థితిలేక చాలామంది నష్టపోతున్నారు. ఇదీ నడిగడ్డ కేంద్రంగా వేళ్లూనుకున్న విత్తన మాఫియా మాయాజాలం. అక్రమార్కు ల కనుసన్నల్లోనే రాష్ట్రంలోని పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత బీటీ–3 సాగు కొనసాగుతున్నట్లు తేలింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో పోలీసుల దాడుల్లో వేలాది క్వింటాళ్లలో నకిలీ విత్తనాలు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందే జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి పలు మండలాలతోపాటు ఇతర జిల్లాల రైతులకు ఇవి చేరాయి. ఇలా బట్టబయలు.. ఈ ఏడాది జూలైలో హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు డీసీఎంలో నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు టన్నుల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అవి బీటీ–3 విత్త నాలని తేలింది. ఈ క్రమంలో గద్వాల, మల్దకల్, ధరూరు, అయిజ మండలాల్లో పట్టుబడిన నకిలీ విత్తనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపారు. వీటిలో బీటీ–3 విత్తనాలున్నాయని నిర్ధారణ అయింది. రంగంలోకి వ్యవసాయ శాఖ ఇంటెలిజెన్స్.. గద్వాల జిల్లాలో నిషేధిత బీటీ–3 విత్తనాలు వెలుగుచూడటంతో వ్యవసాయశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి బీటీ–3 పంట పండిస్తున్న రైతులకు విత్తనాలు ఇచ్చిన సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు ఎవరు.. ఏ కంపెనీ విత్తన ప్యాకెట్లు.. బ్రాండెడ్ కంపెనీలా.. సీడ్ ఆర్గనైజర్ల సొంత బ్రాండెడ్ కంపెనీలా.. ఎప్పటి నుంచి నిషేధిత బీటీ–3 పంట సాగవుతోంది.. జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు.. అనే కోణాల్లో పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్లు తెలిసింది. రైతులకు తెలియకుండానే.. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో పలువురు రైతుల నుంచి బీటీ–3 విత్తనాలను తక్కువ ధరకు సీడ్ ఆర్గనైజర్లు సేకరించారు. హైదరాబాద్ కేంద్రంగా గద్వాల, ధరూరు, మల్దకల్ మండలాలకు.. కర్ణాటక కేంద్రంగా అయిజ మండలానికి తరలించి రైతులకు తెలియకుండానే బీటీ–3 విత్తనాలను వారికి కట్టబెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. సీడ్ ఆర్గనైజర్లు ఏడాది కిత్రం ధరూర్, అయిజ మండలాల్లో పలువురు రైతులకు బీటీ–3 ఫౌండేషన్ సీడ్ ఇచ్చి సాగు చేయించారని.. మళ్లీ వాటిని సేకరించి ప్రధాన కంపెనీల తరహాలో ముద్రించిన సొంత బ్రాండ్ ప్యాకెట్లలో వేసి పలుచోట్ల రైతులకు విక్రయించారని విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీడ్ ఆర్గనైజర్లతో పాటు కంపెనీల భాగస్వామ్యం ఉందా అనే కోణంలో సైతం అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకే పెట్టుబడి ఇవ్వడం లేదా? రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేపట్టినట్లు గ్రహించిన సీడ్ ఆర్గనైజర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీడ్ పత్తి మొక్కలు ఏపుగా పెరగగా.. క్రాసింగ్ దశలో కూలీలు, ఇతరత్రా ఖర్చు అధికం. దీంతో రైతులు పెట్టుబడి కోసం సీడ్ ఆర్గనైజర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బీటీ–3 వ్యవహారం మెడకు చుట్టుకుంటుందనే భయంతో సీడ్‌ఆర్గనైజర్లు రైతులకు అప్పు ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఇప్పటికైనా సాగు నిలిపివేసి.. పంట తొలగించాలని పరోక్షంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆర్గనైజర్లు పెట్టుబడికి డబ్బులు ఇవ్వకపోవడంతో మల్దకల్, అయిజ మండలాల్లో పలువురు రైతులు పంటలు తొలగించారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్గనైజర్లు మాత్రం ‘కంపెనీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.. మేం చేతి నుంచి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.. సొంతంగా పెట్టుబడి పెడితేనే సీడ్ పత్తి సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం’అని చెబుతున్నారు. కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ బృందాలు నిర్వహించిన దాడుల్లో మొత్తం 162 క్వింటాళ్ల ఫెయిలైన విత్తనాలు పట్టుబడ్డాయి. అనుమానంతో జిల్లా నుంచి మొత్తం ఆరు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. అవి నిషేధిత బీటీ–3 విత్తనాలుగా నిర్ధారణ అయ్యాయి. నిందితులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన విత్తనాలతోపాటు ల్యాబ్ రిపోర్ట్‌ను త్వరలో కోర్టుకు సమర్పిస్తాం. – గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి, జోగుళాంబ గద్వాల -
కర్నూలు జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు
-
హెచ్‌టీ పత్తి విత్తనాల గుట్టు రట్టు
సాక్షి, అమరావతి: కలుపును తట్టుకునే హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) పత్తి విత్తనాల గుట్టు రట్టయింది. నిషేధించిన ఈ పత్తి విత్తనాలను రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మందితో కూడిన ఓ ముఠా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వెల్దుర్తి కేంద్రంగా.. ► హెచ్‌టీ కాటన్ విత్తనాలకు రాష్ట్రంలో అనుమతి లేదు. అయినా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వరుసగా మూడో ఏడాది కూడా ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖ ఇటీవల కర్నూలు, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని గిడ్డంగుల్లో తనిఖీలు చేపట్టింది. ► ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోనే రూ.2 కోట్ల విలువైన హెచ్‌టీ విత్తనాలు దొరికాయి. ► అక్కడ లభించిన సమాచారం ఆధారంగా కర్నూలులోని ఓ శీతల గిడ్డంగిపై, పత్తికొండ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా.. పెద్దఎత్తున హెచ్‌టీ విత్తనాల నిల్వలు దొరికాయి. ► కర్నూలు జిల్లాలోని చాలా గిడ్డంగుల్లో హెచ్‌టీ పత్తి ఉన్నట్టు గుర్తించారు. విత్తన వ్యాపారులకు వ్యవసాయ అధికారి, పర్యవేక్షణాధికారి అయిన ఏడీఆర్ కుమ్మక్కై ఎవరిపైనా కేసులు పెట్టలేదని తేలింది. ఏమిటీ.. హెచ్‌టీ కాటన్! ► కలుపు మొక్కలను నివారించే మందుల్ని పిచికారీ చేసినా తట్టుకోగలిగిన అంతర్గత శక్తి హెచ్‌టీ పత్తి మొక్కలకు ఉండటం ప్రత్యేకత. ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జన్యు మార్పిడి చేసి రూపొందించిన ఈ విత్తనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ► ఈ విత్తనాన్ని నేరుగా అమ్మినా.. మరేదైనా రకంతో కలిపి అమ్మినా నేరమే. ► గుంటూరు జిల్లాలోని కొందరు విత్తన వ్యాపారులు, కర్నూలు జిల్లాలోని కొందరు రైతులు ఈ ముఠాకు సహకరిస్తున్నారని గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసులు తప్పవు నకిలీ, అనుమతి లేని విత్తనాలు విక్రయించే వారిపైన, సహకరించే వారిపైనా పీడీ చట్టం కింద క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చాం. తప్పు చేస్తే వ్యవసాయ శాఖలోని ఉద్యోగులు, అధికారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
నకిలీలపై నజర్
సాక్షి, సిటీబ్యూరో: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పత్తి సాగు ఊపందుకోనుంది. ఈ సీజన్లో వరి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట సాగుచేస్తారు. ఫలితంగా విత్తనాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు నకిలీ, అనుమతి లేని విత్తనాల మాఫియాలు విజృంభిస్తూ ఉంటాయి. ఈ దందాకు చెక్ చెప్పడానికి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ బందాల్లో వ్యవసాయ, సీడ్ సర్టిఫయింగ్ ఆఫీసర్, పోలీసు అధికారులు సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన టాస్క్‌ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్వోటీ) నుంచి ఎస్సై స్థాయి అధికారులకు ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో డిప్యుటేషన్‌పై పోస్టింగ్ ఇచ్చారు. పత్తి విత్తనాలు నాటే సీజన్ సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఏటా రూ.వేల కోట్లలో జరిగే ఈ వ్యాపారంలో నకిలీ విత్తులూ పెద్ద ఎత్తున అమ్ముడుపోతున్నాయి. దీనిని గుర్తించలేని రైతన్నలు వీటిని నాటుతున్నారు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో రైతు ఆత్మహత్యలకూ కారణం అవుతోంది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తన విక్రయాలపై కన్నేసి ఉంచడానికి, నకిలీ విత్తుల దందాకు పూర్తిగా చెక్ చెప్పడానికి 15 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ నుంచి వ్యవసాయ అభివృద్ధి అధికారి, సీడ్ సర్టిఫయింగ్ అధికారి, పోలీసు విభాగం నుంచి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ లేదా సైబరాబాద్, రాచకొండల్లోని ఎస్వోటీల్లో పని చేస్తున్న సబ్–ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్రధాన సభ్యులుగా ఉన్నారు. తనిఖీల్లో వీరికి మండలస్థాయిల్లో స్థానిక వ్యవసాయ అధికారి సహకరిస్తున్నారు. నకిలీ విత్తనాలను కొందరు వ్యాపారులు స్థానికంగానే తయారు చేస్తుండగా మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి రవాణా చేసి విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, అదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలతో పాటు రాజధానిలోనూ పత్తి విత్తనాల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ గ్రేట్ హైదరాబాద్‌పై దృష్టి కేంద్రీకరించింది. నకిలీల దందాలో అత్యధికంగా రాజధాని కేంద్రంగానే జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీమ్స్ పని చేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, గోదాములు, ట్రాన్స్పోర్ట్ సంస్థల కార్యాలయాలు, విక్రయ దుకాణాల్లోనూ సోదాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్న వ్యవసాయ అధికారులు అనుమానాస్పదమైన వాటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అవి నకిలీ లేదా అనుమతి లేనివిగా తేలితే స్థానిక వ్యవసాయ అధికారితో ఫిర్యాదు చేయించి ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. కొన్ని అనుమానాస్పద దుకాణాలు, రవాణా సంస్థలపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఏడీఓ జీఎం నివేదిత, టాస్క్‌ఫోర్స్ సబ్–ఇన్స్పెక్టర్ కేఎస్ రవి, ఎస్సీఓ పి.అపర్ణ, ఏఓ నిర్మలలతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం ఆది, సోమవారాల్లో సరూర్‌నగర్‌లోని యూనిసెమ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్బీనగర్లోని చార్డన్ పోఖ్పాండ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆటోనగర్‌లోని కావేరీ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీటీ ట్రాన్స్పోర్ట్స్, వీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్స్, అసోసియేటెడ్ రోడ్ క్యారియర్స్, టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌ల్లో సోదాలు చేశాయి. ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఉన్న పత్తి విత్తనాలపై వ్యవసాయ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాజధాని కేంద్రంగా పని చేస్తున్న ఈ 15 బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. పత్తి విత్తనాల విక్రయ సీజన్ ముగిసే వరకు వీటిని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
పేరుకే నిషేధం!
సాక్షి, హైదరాబాద్: బీజీ–3 పత్తి (హెచ్‌టీ) విత్తనంపై నిషేధం అమలు తూతూమంత్రంగా సాగుతోంది. దీన్ని వినియోగిస్తే కేన్సర్ వ్యాధి వస్తుందని తెలిసినా.. విచ్చలవిడిగా మార్కెట్లో ఈ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వచ్చేనెల నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుతుండటంతో మళ్లీ రైతులకు వీటిని కట్టబెట్టేందుకు దళారులు సిద్ధమయ్యారు. బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి తేడా గుర్తించని స్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని అక్రమదందాకు తెరలేపారు. రెండు మూడేళ్లుగా ఇదే తీరులో బీజీ–3 పత్తి విత్తనాన్ని గ్రామాల్లో పండిస్తున్నప్పటికీ.. అడ్డుకోవడంలో వ్యవసాయశాఖ ఘోరంగా విఫలమైంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో 15% బీజీ–3 పత్తి సాగైంది. అనధికారికంగా చూస్తే దాదాపు 25% సాగవుతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా వ్యవసాయశాఖ తూతూమంత్రపు చర్యలకే పరిమితమైంది. ఈ రకం పత్తి విత్తనాన్ని విక్రయించేవారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తన దందాకు చెక్ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. పైపెచ్చు ఈ పత్తి విత్తనానికి వ్యవసాయశాఖ అధికారులు కొందరు వంత పాడుతున్నారు. అనుమతిస్తే తప్పేంటన్న ధోరణిలో కొందరు కీలకాధికారులున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తనం చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తుంది. గ్లైపోసేట్‌తో కేన్సర్ రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎక్కువగా పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌లో పత్తి సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఆ తర్వాత వరిని 23.75 లక్షల ఎకరాల్లో సాగుచేస్తారు. అయితే.. 2018–19 ఖరీఫ్‌లో పత్తి సాధారణం కంటే ఎక్కువగా ఏకంగా 44.91 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.91 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దేశంలో పత్తి సాగు అత్యధికంగా చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. దీంతో తెలంగాణపై ప్రపంచంలోని బహుళజాతి పత్తి విత్తన కంపెనీలు దృష్టిసారించాయి. బీజీ–2 పత్తి విత్తనం ఫెయిల్ కావడంతో మోన్శాంటో కంపెనీ రౌండ్ ఆఫ్ రెడీ ఫ్లెక్స్ (ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మన దేశంలో బీజీ–3కి అనుమతి నిరాకరించడంతో దీన్ని అడ్డదారిలో విస్తరించే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. బీజీ–3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడతారు. బీజీ–3 పండిస్తున్నారంటే గ్లైపోసేట్ కచ్చితంగా వాడాల్సిందే. ఈ గ్లైపోసేట్ అత్యంత ప్రమాదకరమైందని, దీని వల్ల కేన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించింది. 28 శాతానికిపైగా బీజీ–3 విత్తనాలు తెలంగాణ వ్యవసాయశాఖ అధికారిక నివేదిక ప్రకారం.. 2017–19 మధ్య 1062 పత్తి విత్తన శాంపిళ్లను హైదరాబాద్ మలక్‌పేటలోని డీఎన్ఏ ల్యాబ్‌లో పరీక్షించింది. అందులో ఏకంగా 302 శాంపిళ్లలో నిషేధిత బీజీ–3 విత్తనాలు ఉన్నట్లు తేలింది. అంటే ఏకంగా 28.43% అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున బీజీ–3 విత్తనం సాగవుతున్నా అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. వ్యవసాయశాఖ వర్గాలు బీజీ–3ని ఉత్పత్తి చేస్తున్న 8 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని భావించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వచ్చే ఖరీఫ్ కోసం దాదాపు 1.30 కోట్ల పత్తి ప్యాకెట్లను రైతులకు సరఫరా చేయాలని దళారులు ప్రయత్నాల్లో ఉన్నారు. గతేడాది మార్కెట్లో 68,766 లీటర్ల గ్లైపోసేట్‌ను వ్యవసాయశాఖ వర్గాలు పట్టుకున్నాయి. కానీ సీజ్ చేయలేదు. దీంతో గ్రామాల్లో విషం ఏరులై పారుతోంది. తినే తిండి, గాలి, వాతావరణం కలుషితమై జనజీవనానికి జబ్బులను తెచ్చి పెడుతుంది. బీజీ–3పై తూతూమంత్రపు చర్యలు బీజీ–3కి అడ్డుకట్టవేయాలని పైకి చెబుతున్నా వ్యవసాయ శాఖ సీరియస్‌గా తీసుకోవడంలేదు. తయారీదారులపై చర్యలు తీసుకోకుండా, మార్కెట్లోకి ప్రవేశించాక చేసే దాడులతో వచ్చే ప్రయోజనముండదు. అధికారుల చిత్తశుద్దిని శంకించాల్సి వస్తోంది. – నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు క్యాన్సర్ కారకం గ్లైపోసేట్‌తో కేన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లోనే నిర్ధారించింది. దేశంలో ఈ అమ్మకాలపై అనేక పరిమితులున్నాయి. కానీ విచ్చలవిడిగా వాడటం వల్ల జీవవైవిధ్యానికి ప్రమాదం ఏర్పడనుంది. దీనిపై సర్కారు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ కమల్‌నాథ్, జనరల్ సర్జన్, హైదరాబాద్ -
విత్తనంపై కంపెనీల పెత్తనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పత్తి విత్తనాలను విక్రయించడం ద్వారా విత్తన కంపెనీలు ప్రతీ ఏడాది రూ.400 కోట్లు లాభం పొందుతున్నాయి. మోన్శాంటో కంపెనీ కేవలం రాయల్టీ ద్వారా రూ.20 కోట్లు గడిస్తుంది. కానీ రెండు మూడేళ్లుగా పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తుండటంతో పెద్దఎత్తున దిగుబడులు తగ్గి అన్నదాత నష్టాలపాలవుతున్నాడు. కానీ కంపెనీలు మాత్రం వందల కోట్లు గడించి భోగాలు అనుభవిస్తున్నాయి. పంట సర్వనాశనం అవుతున్నా పత్తి విత్తన ధరలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఏదో తూతూమంత్రంగా పది రూపాయలు తగ్గించి ప్రచారం చేసుకుంటుంది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.400 లాభం.. దేశవ్యాప్తంగా పత్తి విత్తన ధరలను ఖరారు చేస్తూ కేంద్ర వ్యవసాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజీ–1 రకానికి చెందిన 450 గ్రాముల విత్తనం ధరను రూ. 635గా, బీజీ–2 రకం విత్తనాల ధరను రూ.710గా ఖరారు చేసింది. మొదటి రకం విత్తనానికి ఎలాంటి పన్నులు లేదా రాయల్టీని వసూలు చేయడంలేదని, బీజీ–2 విత్తనాలకు మాత్రం రూ.20 చొప్పున నిర్ణయించినట్లు పేర్కొంది. ఆ ప్రకారం బీజీ–2 విత్తనం ధర 450 గ్రాములకు రూ.730గా ఖరారు చేసింది. ఒక్కో బీజీ–2 ప్యాకెట్‌కు రూ.730 ధర ఉంటే, అందులో రూ.330 వరకు పత్తి విత్తనం పండించిన రైతులకు చెల్లింపులు, ఇతరత్రా ఖర్చులు పోతాయి. అంటే నికరంగా రూ.400 ఒక్కో ప్యాకెట్‌పై కంపెనీలు లాభం పొందుతాయి. తెలంగాణలో ప్రతీ ఏటా కోటి ప్యాకెట్లు అమ్ముడవుతాయి. ఆ ప్రకారం ప్యాకెట్ల ద్వారా కంపెనీలు రూ. 400 కోట్లు లాభం గడిస్తాయని వ్యవసాయ నిపుణులు అంచనా వేశారు. విచిత్రమేంటంటే గతేడాదికంటే ఒక్కో ప్యాకెట్‌పై కేవలం పది రూపాయలు తగ్గించారు. దీనివల్ల రైతులకు ఒరిగేది ఏముంటుందనేది పెద్ద ప్రశ్న. గులాబీ పురుగుతో నష్టాలపాలు... బీజీ–2 పత్తి విత్తనం విఫలమైందని, దానివల్ల గులాబీ రంగు పురుగు దాడి చేసి ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని మూడేళ్ల కింద తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ఈ విత్తనం పనిచేయదని తేల్చి చెప్పాయి. అయినప్పటికీ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం బీజీ–2 విత్తనాన్ని రైతులకు అంటగడుతూనే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 2018–19 ఖరీఫ్‌లో ఏకంగా 44.30 లక్షల (105%) ఎకరాల్లో సాగైంది. అయితే గులాబీ రంగు పురుగు కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని ప్రభుత్వ అర్థగణాంకశాఖ తన అంచనా నివేదికలో తెలిపింది. ప్రత్యామ్నాయం లేక గందరగోళం.. బీటీ–2 టెక్నాలజీ పత్తి విత్తనం విఫలమైందని నిరూపితమైంది. దాని ప్రభావం పత్తి పంటపై పడుతూనే ఉంది. బీటీ–2 టెక్నాలజీ వైఫల్యంతోనే పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టి పీడించింది. అయితే బీటీ–3 పత్తి విత్తనాన్ని తీసుకొచ్చినా అది జీవవైవిధ్యానికి గండికొడుతుందని నిర్ధారించడంతో దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఏ పత్తి విత్తనం వేయాలన్న దానిపై గందరగోళం నెలకొంది. బీటీ–2కు ప్రత్యామ్నాయంగా మరో పత్తి విత్తనాన్ని పరిచయం చేయలేదు. పైగా విఫలమైన విత్తనాన్నే మళ్లీమళ్లీ రైతులకు అంటగడుతూ కంపెనీలకు వందల కోట్లు కట్టబెడుతున్నారు. రాయల్టీని రద్దు చేయాలి బీజీ–2 పత్తి విత్తనం విఫలమైంది. గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తిని అది కోల్పోయింది. ఇక బీజీ–3 జీవవైవిధ్యానికి ముప్పు తెస్తుంది. కాబట్టి ఇప్పడు ఏ పత్తి విత్తనమూ రైతుకు శ్రేయస్కరం కాదు. రైతులను ఆహార పంటల సాగువైపు ప్రోత్సహించాలి. పత్తిపై మోన్శాంటో రాయల్టీని రద్దు చేయాలి. పైగా ఇప్పుడు పది రూపాయలు తగ్గించినట్లు చెబుతున్నారు. నష్టపోయిన రైతులకు ఈ తగ్గింపు వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. –నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
ఐదో తేదీ వరకు పత్తి విత్తుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఐదో తేదీ వరకు పత్తి విత్తనాలను విత్తుకోవచ్చని రైతులకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) సూచించింది. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే బీటీ హైబ్రిడ్ విత్తనాలు వేసుకోవాలని పేర్కొంది. వానాకాలం సాగయ్యే పత్తి పంటలో గులాబీ రంగు పురుగును నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. రైతులు సహా వ్యవసాయ శాఖ, పరిశోధన సంస్థలు, విత్తన కంపెనీలు, వ్యవసాయ వర్సిటీలు ఎలాంటి కార్యాచరణ పాటించాలో పేర్కొంది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రాలకు పంపింది. 10 లక్షల ఎకరాల్లో నష్టం.. రాష్ట్రంలో గతేడాది 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా 10 లక్షల ఎకరాల్లో గులాబీ పురుగు సోకి దిగుబడి పడిపోయింది. 2009 లోనే బీటీ–2 గులాబీ పురుగును తట్టుకునే శక్తిని కోల్పోయింది. పరిశోధన ఫలితాల వివరాల ప్రకారం 2010లో అధికారికంగా దీన్ని నిర్ధారించారు. దేశవ్యాప్తంగా 93% బీటీ–2 విత్తనాలనే రైతులు సాగు చేస్తున్నారు. విత్తన లోపంతోపాటు రైతులు, ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలు చర్యలు తీసుకోకపోవడం తెగులు విస్తృతికి కారణమని ఐకార్ పేర్కొంది. గులాబీ పురుగుతో 8 నుంచి 92 శాతం పంట నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించిన ఐకార్.. దిగుబడి 30 శాతం పడిపోతున్నట్లు వివరించింది. పత్తి అత్యధికంగా సాగవుతున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రైతులు ఈ తెగులుతోనే తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గులాబీ పురుగుతో ఇంతలా నష్టం జరుగుతున్నా ప్రభుత్వం బీటీ–2 విత్తనాలకు ధరలు నిర్ణయించి సాగు చేయిస్తుండటంపై రైతు సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఐకార్ సూచనలివే.. - నల్లరేగడి నేలల్లో జూన్ 15 నుంచి జూలై 5వ తేదీ వరకు బీటీ, హైబ్రిడ్ పత్తి విత్తనాలను వేసుకోవాలి. - పత్తి పువ్వుకు 10 శాతం, ఆకుకు 10 శాతం పురుగు సోకితే వెంటనే రసాయన మందులు వాడాలి. - గులాబీ పురుగు నివారణకు ట్రైకోగ్రామా బ్యాక్టీరియా రసాయనం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఉంది. - పత్తి విత్తులు వేసిన తరువాత 45 నుంచి 60 రోజుల వ్యవధిలోనే గులాబీ పురుగు దాడి జరుగుతోంది. - విత్తన ప్యాకెట్లతో పాటు గులాబీ పురుగు వస్తే సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. - తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ ఉత్పాదకత వచ్చే బీటీ హైబ్రిడ్లపై గ్రామాలలో వ్యవసాయ వర్సిటీ సర్వే చేయాలి. - బయో పెస్టిసైడ్స్ వినియోగం, ఫలితాలను అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలి. - రైతులకు సామూహికంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. -
నకిలీ గుట్టు రట్టు
ధరూరు(గద్వాల): నకిలీ పత్తి విత్తనాల వ్యాపారుల గుట్టురట్టు అవుతోంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న జర్మనేషన్ ఫెయిల్ అయిన విత్తనాలకు రంగులు, రసాయనాలు అద్ది రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులు ఒక్కొరుగా బయటికొస్తున్నారు. కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశానుసారం ఇటీవల ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు నకిలీ గుట్టును రట్టు చేస్తున్నారు. వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో సాగుతున్న టాస్క్‌ఫోర్స్ తనిఖీలతో నకిలీ వ్యాపారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే రెండు కేసులు.. పత్తి సాగుకు కేంద్ర బింధువైన గద్వాల నియోజకవర్గంలో అత్యధికంగా సాగయ్యే సీడ్ పత్తితో రైతులు అప్పులపాలవుతుండగా.. ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు, ఇతర వ్యాపారులు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం బృందం తనిఖీల్లో వారం వ్యవధిలోనే మండలంలో రెండు ప్రాంతాల్లో నకిలీ పత్తివిత్తనాల కేంద్రాలను గుర్తించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 10న మార్లబీడులో రాము అనే ఆర్గనైజర్ కోళ్లఫారం వద్ద 3.25 క్వింటాళ్ల పత్తి విత్తనాలు లభించగా.. అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘనటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే పారుచర్ల అనుబంధ గ్రామమైన సోంపురంలో సోమవారం ఏఓ భవానీ, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంకటేష్, స్వాములు, నజీర్ సోదాలు నిర్వహించి 4.50 క్వింటాళ్ల పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన గోవిందును అదుపోలోకి తీసుకున్నారు. రంగులు అద్ది రాష్ట్రం, రాయిచూరులో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. వ్యవసాయ పొలంలో గుడిసెలో దాచి ఉంచిన విత్తనాలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత దుకాణాల్లో సోదాలు అనుమానం ఉన్న ఎరువుల దకాణాలు, గద్వాలలోని వివిధ పత్తి మిల్లుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానిత విత్తనాలను షాంపిల్ సేకరించి టెస్ట్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. వారం వ్యవధిలోనే మండలంలో రెండు ప్రాంతాల్లో పట్టుబడిన దాదాపు 8 క్వింటాళ్ల నకిలీ విత్తనాల విలువ సుమారు రూ.3లక్షలకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. నకిలీ సీడ్ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేస్తున్న ప్రత్యేక బృందాలను ఎస్పీ రెమారాజేశ్వరి అభినందిస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా తమ సహకారం ఉంటుందని చెప్పడంతో పోలీసులు మరింత ముందుకుసాగి నకిలీ గుట్టును రట్టు చేసే పనిలో బిజీగా ఉన్నారు. -
ఇదీ విషయం!
బీటీ–3 హెచ్‌టీ పత్తి విత్తనాలు పర్యావరణానికి.. జీవవైవిధ్యానికి హానికరమని, వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. దీంతో ఈ విత్తనాల తయారీకి, విక్రయానికి కేంద్రప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినా, కార్పొరేట్ విత్తన సంస్థలు, బహుళ జాతి కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా బీటీ–3 పత్తి విత్తనాల దందా సాగిస్తున్నాయి. ఇందుకు కర్నూలు జిల్లాను కేంద్ర బిందువుగా చేసుకున్నాయి. గతేడాదిలాగే ఈ సారి కూడా వ్యవసాయాధికారుల కళ్లుగప్పి బీటీ–3 పత్తి విత్తనాలను రైతులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయని సమాచారం. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో బీటీ–3 పత్తి విత్తనాల దందా జోరందుకుంది. ఇటీవల వ్యవసాయశాఖాధికారులు ఆదోనిలోని వివిధ విత్తన దుకాణాల్లో తనిఖీలు జరిపి బీటీ–2 ముసుగులో బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. బీటీ–2 పేరుతో బీటీ–3 విత్తనాలు ఉన్న ప్రో సీడ్, సాయి భవ్య( నూజివీడు), మై సీడ్ కంపెనీలకు చెందిన 384 ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ విత్తన విక్రయం ఆదోనిలో ఒక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది. బీటీ– 3ని ట్రయల్ రన్‌గా నిర్వహించేందుకు విత్తన కంపెనీలు అక్రమ మార్గాల్లో వాటిని మార్కెట్లోకి తెస్తోన్నాయి. అయితే వ్యాపారులు మాత్రం కమర్షియల్ పత్తి సాగుకు బీటీ–2 పేరుతో ఉన్న బీటీ–3 విత్తనాలనే ఇస్తున్నట్లు తెలుస్తోంది. జీవవైవిధ్యానికి, పర్యావరణానికి హానికరమని కేంద్రప్రభుత్వం హెచ్చరిస్తున్నా కార్పొరేట్ కంపెనీలు పట్టించుకోకుండా కర్నూలు జిల్లాను బీటీ–3 విత్తన ప్రయోగశాలగా మార్చి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. గత ఏడాది జిల్లాలో భారీగా సాగు గతేడాది జిల్లా వ్యాప్తంగా 10వేల హెక్టార్లలో బీటీ– 3 పత్తి విత్తనాలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. బీటీ–2 పేరుతోనే ఆ విత్తనాలను రైతులకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఆ విత్తనాలను గుర్తించలేక చాలా మంది రైతులు వాటిని సాగు చేసి ఇబ్బందులు పడ్డారు. బీటీ– 1లో పచ్చపురుగును తట్టుకునే జన్యువు ఉంటే బీటీ–2లో పొగాకు లద్దెపురు, గులాబీరంగు పురుగును తట్టుకునే జన్యువు ఉంటుంది. అదే బీటీ–3లో ప్రమాదకరమైన గ్లైపోసేట్ కలుపు మందు జన్యువు ఎక్కిస్తారు. ఈ విత్తనం సాగు తర్వాత రైతులు పంటలో కలుపు నివారణకు గ్లెసెల్ కెమికల్ మందును విచ్చలవిడిగా వాడటంతో విష ప్రభావానికి గురయ్యారు. కార్పొరేట్ సంస్థలపై చర్యలు ఏవీ? కల్లూరు మండలంలో బీటీ–2 విత్తనోత్పత్తి చేసే ఓ రైతు ఇటీవల ఆకాశ్–8888 బీటీ–2 విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. అనుమానం వచ్చి వాటిని పరీక్ష చేస్తే బీటీ–3 విత్తనాలున్నాయి. ఈ విత్తనాల సాగు ప్రమాదమని వాటిని పక్కన పడేశారు. ఇలా గుట్టుగా బీటీ–3 విత్తనాలు రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిసినా వ్యవసాయశాఖాధికారులు ఎందుకో కఠినంగా వ్యవహరించడం లేదు. చిన్న కంపెనీలు, కింది స్థాయి అధికారులపై ప్రతాపం చూపుతూ కారణమైన బహుళజాతి కంపెనీలను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గద్వాలలో నిషేధిత బీటీ3 సాగు
సాక్షి, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తి విత్తన కంపెనీల బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి, వారి భూములను లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించి ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టినట్లు తేలిన విషయం విదితమే. ఇది మరువక ముందే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీటీ3 విత్తనాలను గద్వాల కేంద్రంగా విత్తన కంపెనీలు సాగు చేయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల బృందం, డీఎన్ఏ పరిశోధన సంస్థ నిర్ధారించడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జిల్లాలో పర్యటించి 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి తీసుకెళ్లారు. వీటిని ఢిల్లీలోని ల్యాబ్‌లో పరీక్షించగా ఆ శాంపిళ్లలో బీటీ3 విత్తనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిసింది. అదే నెలలో గద్వాలలోని మార్కెట్ యార్డు, ఇటిక్యాల మండలంలోని ఓ గోదాంలో అధికారులు సేకరించి న షాంపిళ్లలోనూ బీటీ3 పత్తి విత్తనాలు వాడినట్లు తేలిం ది. 60 షాంపిళ్లకుగాను ఆరు షాంపిళ్లలో నిషేధిత హెచ్‌టీ రకం పత్తి విత్తనాలున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీం తో ఆ కంపెనీలపై కేసుల నమోదుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. చర్యలు తీసుకుంటున్నాం.. పరీక్షలకు పంపిన 60 షాంపిళ్లలో 6 షాంపిళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిలేని, గడ్డి మందును తట్టుకునే హెచ్టీరకం పత్తివిత్తనాలు ఉన్నట్లు తేలింది. స్టాక్‌ను సీజ్ చేశాం. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో పాటు, సంబంధిత కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. త్వరలో కేసులు నమోదు చేస్తాం. గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
కాటన్ సీడ్.. మరో ఫ్రాడ్
సాక్షి, గద్వాల : నడిగడ్డలో విత్తనోత్పత్తి కంపెనీల బాగోతాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రైతుల భూములను లీజ్‌కు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించినట్లు బహిర్గతమైన విషయం విదితమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అనుమతి లేని బీటీ–3 విత్తనాలను గద్వాల కేంద్రంగా వ్తితన కంపెనీలు సాగు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పరిశోధన శాస్త్రవేత్తల బృందం, డీఎన్ఏ పరిశోధన సంస్థ నిర్ధారించినట్లు తేలడం గమనార్హం. గతనెల 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అ«ధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి ఢిల్లీ ల్యాబ్‌లో పరీక్షించగా బీటీ–3 విత్తనాల సాగు జరుగుతోందని గుర్తించినట్లు తెలిసింది. గత నెలలోనే ఓ గోదాంలో పట్టుబడిన ఒక కంపెనీకి చెందిన ఐదు శాంపిళ్లలో మూడింటిలో బీటీ–3 విత్తనాలు ఉన్నట్లు రాష్ట్ర, కేంద్ర పరిశోధన బృందం నిర్ధారించినట్లు సమాచారం. ఈ నివేదికను జిల్లా వ్యవసాయశాఖకు పంపించినట్లు తెలిసింది. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇన్‌కం ట్యాక్స్ దాడులు మరువకముందే.. జోగుళాంబ గద్వాల విత్తన పత్తికి ప్రసిద్ధి. జిల్లాలో దాదాపు కోటి ప్యాకెట్ల పత్తి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పన్నుల చెల్లింపులో తేడాలు రావడంతో జనవరి నెలలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు విత్తన కంపెనీలపై దాడులు చేశారు. గద్వాలలో రైతుల వద్దకు, ఆర్గనైజర్ల వద్ద నేరుగా విచారణ జరిపారు. రైతుల భూములను లీజుకు తీసుకుని విత్తనాలను సాగు చేస్తున్నట్లు విత్తన కంపెనీలు తప్పుడు పత్రాలను సృష్టించినట్లు ఐటీ శాఖ తనిఖీల్లో తేలింది. రెండు విత్తన కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. గత నెలలో కేంద్ర బృందాల ఆరా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని గడ్డిమందును తట్టుకునే పత్తి రకాలు సాగు చేస్తున్నారా, గడ్డి మందు అయిన హెచ్‌టీ(హెర్బిసైడ్ టాలరెంట్) వంటి మందు వాడకంపై కేంద్ర బృందాలు గత నెల 18న జిల్లాలో ఆరా తీశాయి. భారత ప్రభుత్వం తరపున న్యూఢిల్లీలోని భారతీయ పరిశోధన సంస్థ, నాగ్‌పూర్ కేంద్ర పత్తి పరిశోధన సంస్థ, బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, తెలంగాణ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం జేడీ రాజారత్నం నేతృత్వంలోని బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని పెద్దపల్లి, బూడిదపాడు, అమరవాయి గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పత్తి పంటను పరిశీలించి గడ్డి మందు అయిన గ్రై ఫోసెట్, హెచ్‌టీ మందు వాడకంపై రైతులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కాటన్‌సీడ్ మిల్లుల్లో కాటన్ సీడ్ పత్తిని, విత్తనాలను, కెమికల్‌తో శుద్ది చేసిన విత్తనాల శాంపిళ్లను సేకరించి వాటిని పరిశోధనలకు పంపించారు. బీటీ–3పై నిషేధం ప్రస్తుతం దేశంలో సాగవుతున్న పత్తిలో బీటీ–1, బీటీ–2 విత్తనాలను రైతులు వినియోగిస్తున్నారు. ఇందులో కలుపు తొలగించేందుకు హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) గడ్డి మందు స్ప్రే చేస్తే గడ్డితో పాటు పత్తి పంట కూడా చనిపోతుంది. దీంతో రైతులు ఎలాంటి మందులు వినియోగించకుండా కూలీలతో కలుపు తొలగించుకుంటుండగా ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. బీటీ–3 విత్తనాలతో సాగు చేస్తే హెచ్‌టీ స్ప్రే తట్టుకునే శక్తి పత్తి పంటకు ఉంటుంది. అ యితే, విత్తనాలకు కేంద్ర వ్యవసాయ పరిశోదన సం స్థ అనుమతి ఇవ్వలేదు. ఈ రకంపై హెచ్‌టీ గడ్డి మందులు వాడితే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, పర్యావరణానికి ముప్పు ఉంటుం దని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, బీటీ– 3ను నిషేధించింది. కానీ కొన్ని కంపెనీలు ఈ విత్తనాలను సాగు చేయించి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నా యనే సమాచారం అందగా కేంద్ర వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం దేశంలోని వివిధ ప్రాం తాలతో పాటు గద్వాలలో పర్య టించి శాంపిళ్లను సేకరించింది. ఈ క్రమంలోనే జిల్లాలో బీటీ–3 పండిస్తున్నట్లు గా గుర్తించినట్లు తెలిసింది. అయితే, దీనిని జిల్లా వ్యవశాఖ అధి కారి గోవింద్‌నాయక్ ధృవీకరించలేదు. -
జనంపైకి జన్యు విషం!
జనం కడుపులోకి జన్యు విషం చొరబడుతోంది. బహుళజాతి సంస్థలు గుట్టుచప్పుడుగాకుండా రైతులకు అంటగట్టిన ప్రమాదకర బీజీ–3 పత్తి.. ఇప్పుడు నూనె రూపంలో గరళాన్ని చిమ్ముతోంది. బ్రాండెడ్ రకాల నూనెల్లో కలిసిపోయి కేన్సర్ కారకాలను నేరుగా వంటింటికే మోసుకొస్తోంది. వేలకొద్దీ ఆయిల్ డబ్బాల్లో ఈ నూనెను కలిపేసి, వాటికి వివిధ కంపెనీల నకిలీ లేబుల్స్‌ను అతికించి మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు అక్రమార్కులు! హైదరాబాద్ శివారుల్లోని కాటేదాన్ నుంచి బేగంబజార్లోకి, అక్కడ్నుంచి వ్యాపారులకు, వారి నుంచి ఇళ్లకు, హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, రోడ్లపై బజ్జీ దుకాణాలకు, చిరుతిళ్ల షాపులకు చేరిపోతోంది ఈ విషపు నూనె. అటు పశువులకు దాణాగా ఈ పత్తి పిండినే ఇస్తుండటంతో పాల రూపంలోనూ నేరుగా జనం ఒంట్లోకి ప్రవేశిస్తోంది. బీజీ–3 జన్యుమార్పిడి పత్తి నూనె, పశువుల దాణా మార్కెట్లోకి చొరబడుతున్న తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పత్తి మిల్లుల నుంచి పారిశ్రామికవాడల వరకు, అక్కడ్నుంచి జనం చెంతకు ఈ నూనె చేరుతున్న వైనంపై సమగ్ర కథనం.. వర్ధెల్లి వెంకటేశ్వర్లు బీజీ విషానికి బహుళజాతి కంపెనీలే బీజాలు వేశాయి. పత్తి మొక్కలు శనగపచ్చ పురుగుతోపాటు ఇతర చీడలను తట్టుకునేలా జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అభివృద్ధి చేశాయి. గతంలో ఉన్న బీజీ–2 పత్తి విత్తనాల్లో హెర్బిసైడ్ టాలరెంట్ జన్యువును చొప్పించి బీజీ–3 విత్తనాలను సృష్టించాయి. అంతేగాకుండా ఈ మొక్కల చుట్టూ కలుపు పెరగకుండా నిరోధించే ‘గ్లైఫోసేట్’ అనే రసాయనాన్ని రూపొందించాయి. అయితే మన దేశంలో బీజీ–3 పత్తి సాగుపై నిషేధం ఉంది. అందులో ప్రమాదకరమైన కేన్సర్ కారకాలు ఉన్నాయని అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) కూడా నిర్ధారించింది. అయినా బహుళజాతి సంస్థలు దొంగచాటుగా తెలంగాణలో సుమారు 13 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి సాగయ్యేలా చేశాయి. రైతులకు తెలియకుండా, వారి ఖర్చులతోనే బీజీ–3 పత్తి సాగయ్యేలా విత్తనాలను అంటగట్టి.. సాగు ప్రయోగ ఫలితాలను పరిశీలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం కూడా రాసింది. దానిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించగా.. కమిటీ తెలంగాణలో అక్రమంగా బీజీ–3 సాగు జరిగినట్టు నిర్ధారించింది. విత్తనాలన్నీ కలగలసిపోయి.. రాష్ట్రంలో గతేడాది 47 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల చొప్పున 3.76 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే బీజీ–3 సాగుచేసిన చోట ఎకరాకు సగటున నాలుగు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. అంటే 13 లక్షల ఎకరాలకుగాను 52 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. రైతులు ఈ పత్తిని సాధారణ పత్తి కిందనే జమ కట్టి విక్రయించారు. దీంతో సాధారణ పత్తి, బీజీ–3 పత్తి కలిసిపోయింది. ఇలా కలగలిసిన పత్తి జిన్నింగ్ మిల్లులకు వెళ్లగా.. పత్తి గింజలు కూడా కలిసిపోయాయి. క్వింటాల్ పత్తి నుంచి సగటున 60 కిలోల గింజలు వస్తాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 2.35 కోట్ల క్వింటాళ్ల పత్తి గింజలు ఉత్పత్తయ్యాయి. ఇందులో 50 శాతం గింజలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మిగతా దాదాపు 1.10 కోట్ల క్వింటాళ్ల గింజలను రాష్ట్రంలోనే వివిధ మిల్లుల్లో మరపడుతున్నారు. దీంతో సుమారు లక్ష టన్నుల పత్తి నూనె, 8.25 లక్షల టన్నుల పత్తి పిండి (కేక్) ఉత్పత్తవుతోంది. ఈ నూనె, పత్తి పిండిలో బీజీ–3 ఉత్పన్నమైన హెర్బిసైడ్ టోలరెంట్ ప్రొటీన్, కలుపు నివారణగా వాడే గ్లైఫో సేట్ రసాయనం అవశేషాలు ఉంటున్నాయి. రూ.750 కోట్ల నూనె వ్యాపారం అ«నధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో నెలకు 70 వేల టన్నుల మంచినూనెను వంటల్లో వాడుతున్నారు. ఇందులో 40 వేల టన్నులు గృహ అవసరాల కోసం, 30 వేల టన్నులు వ్యాపారపరమైన వంటకాలు, పదార్థాల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 20 శాతం పత్తి నూనె.. బ్రాండెడ్ నూనెలతో కలిసిపోయి వస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి నూనెను తినటానికి వీలైనదిగానే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దీని వినియోగం ఎక్కువగానే ఉంది. అయితే అత్యంత నాణ్యతా ప్రమాణాలతో శుద్ధి (రిఫైండ్) చేసినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమని, లేకుంటే ప్రమాదకరమైన కార్సినోజెనిక్ కారకంగా మారే ప్రమాదం ఉందని వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో అధికారిక , అనధికారిక వ్యాపారాన్ని కలుపుకుంటే ఏడాదికి రూ.750 కోట్ల విలువైన పత్తి నూనె వ్యాపారం సాగుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎక్కువగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, పామాయిల్, నూనెల్లో పత్తినూనెను కలుపుతున్నారు. ఆలీవ్, ఆవ, సోయాబీన్ నూనెల్లో కాస్త తక్కువ మోతాదులో కలిపి కల్తీ చేస్తున్నారు. పత్తి పిండి రూపంలో పశువులకు.. పత్తి పిండికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 50 కిలోల పత్తి కేకును రూ.2200 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని పటాన్చెరు, మేడ్చెల్, శామీర్‌పేట ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లో 100 నుంచి 150 పశువుల సామర్థ్యం ఉన్న 12 డెయిరీలను ‘సాక్షి’ పరిశీలించింది. ప్రతి డెయిరీలో పత్తి పిండి దాణా పెడుతున్నారు. కిలో పత్తిపిండి, 2 కిలోల తవుడు, కిలో శనగ పిండితో కలిపి 2 పూటలు అందిస్తున్నారు. గోనె సంచుల్లో పత్తి కేకును నింపి కంపెనీ పేరు లేకుండా విక్రయిస్తున్నారు. ఈ దాణా ఎక్కువగా కరీంనగర్ నుంచి వస్తోందని డెయిరీల్లో కార్మికులు చెప్పారు. 6 డెయిరీల్లో ఇదే తరహా దాణా కన్పించింది. మిల్లుల నుంచి తీసిన కేకును శుద్ధి చేయకుండా నేరుగా గోనె సంచుల్లోకి నింపి డెయిరీలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు రూ.1,700 కోట్ల పత్తి పిండి వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. కాటన్ మిల్లు నుంచి కాటేదాన్ వరకు సాధారణ పత్తి గింజలతో కలిసిపోయిన బీజీ–3 విత్తనాలన్నీ ఆయిల్ మిల్లులకు చేరుతున్నాయి. కానీ అక్కడ్నుంచి ‘రిఫైన్’ కాకుండానే నూనె నేరుగా మార్కెట్లోకి వచ్చేస్తోంది. కరీంనగర్ జిల్లాలోని ఓ కాటన్‌మిల్లులో పత్తి గింజల నుంచి నూనె తీసే ప్రక్రియను ‘సాక్షి’ పరిశీలించింది. దీనికి అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. రోజుకు 10 టన్నుల గింజలను మర ఆడించే సామర్థ్యం ఉంది. నూనె తీయటం, విక్రయించటం చట్టబద్ధమే. సగటున ప్రతి రెండ్రోజులకు ఒక ట్యాంకర్ చొప్పున ముడి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. పత్తి నుంచి తీసిన ముడి నూనెను అధీకృత రిఫైనరీ కంపెనీలకు మాత్రమే విక్రయించాలి. మిల్లులో తీసిన ప్రతి లీటర్ ముడి నూనెను ఏయే కంపెనీలకు విక్రయించారో కచ్చితంగా నమోదు చేయాలి. కానీ ఇక్కడ అది జరగటం లేదు. అడ్డూ అదుపు లేకుండా ఎవరికి పడితే వాళ్లకు విక్రయిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని మరో పారిశ్రామిక వాడలో మరో మిల్లును ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ జిన్నింగ్ మిల్లుల నుంచి క్వింటాల్‌కు రూ.1,200 చొప్పున పత్తి గింజలు తీసుకువచ్చి మరపడుతున్నారు. క్వింటాల్ గింజల నుంచి 9.5 కిలోల నూనె, 75 కిలోల పత్తి పిండి వస్తోంది. కిలో ముడి తైలానికి అధీకృత రిఫైనరీ కంపెనీలు రూ.60, అక్రమ కంపెనీలు రూ.65 చొప్పున మిల్లులకు చెల్లిస్తున్నాయి. దీంతో మిల్లుల యాజమా న్యం తమ సరుకును అక్రమార్కులకే అప్పగిస్తున్నారు ఇలా సేకరించిన ప్రతి చుక్క నూనె నేరుగా కాటేదాన్ పారిశ్రామికవాడకు తరలిపోతోంది. అడ్డమైన కెమికల్స్ కలిపి.. నకిలీ లేబుల్స్ అతికించి.. కాటేదాన్‌లో 100కు పైగా చిన్న తరహా అక్రమ రిఫైనరీ పరిశ్రమలు ఉన్నాయి. ముడి పత్తి నూనెలో ఉన్న మడ్డీని కరిగించి ఇందులో ఏవేవో రసాయనాలు కలుపుతున్నారు. ఈ రసాయనాలు ఏ పేరుతో పిలుస్తారో.. ఏం కలుపుతున్నారో అక్కడ పని చేసే కార్మికులకు కూడా తెలియదు. పలుచబడిన నూనెకు పాక్షికంగా ఆకుపచ్చ వర్ణం వచ్చే వరకు మరో రసాయనాన్ని కలుపుతున్నారు. ఈ ద్రావణాన్ని ఇతర బ్రాండెడ్ ఆయిల్స్‌తో మిక్స్ చేసి బ్రాండెడ్ భ్రమ కల్పిస్తున్నారు. నూనె డబ్బాల రిసైక్లింగ్ పేరుతో ముందుగానే వేల కొద్ది ఖాళీ ఆయిల్ డబ్బాలను సేకరిస్తున్నారు. వాటికి వివిధ కంపెనీల నకిలీ లేబుల్స్‌ను అతికించి, డబ్బాల్లో ఈ ఆయిల్ నింపి ఏమాత్రం అనుమానం రాకుండా సీల్ చేసి మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఈ సరుకు వివిధ ఏజెన్సీల ద్వారా ముందుగా బేగంబజార్‌కు చేరుతోంది. అక్కడ్నుంచి టోకు వ్యాపారులకు వారి నుంచి చిల్లర వ్యాపారులకు చేరుతోంది. వారి ద్వారా గృహాలకు, హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, రోడ్లపక్కన బజ్జీల దుకాణాలకు, చిరుతిళ్ల షాపులకు చేరిపోతోంది. ఆ పాలల్లో విషపు అవశేషాలు రాష్ట్రంలో 90.5 లక్షల ఆవు లు, కోడెలు, బర్రెలు ఉన్నాయి. వీటిలో 60 లక్షల వరకు పశువులు పాలిచ్చేవి. పాలిచ్చే పశువుల కోసం గతంలో వేరుశనగ పిండి. తవుడు కలిపి దాణాగా పెట్టేవాళ్లు. కానీ వేరుశనగ సాగు గణనీయంగా తగ్గి, పత్తి సాగు పెరగడంతో పత్తి పిండిని దాణాగా పెడుతున్నారు. ముఖ్యంగా డెయిరీల్లోని పశువులకు ఇదే ప్రధాన దాణాగా మారింది. కోళ్లకు, గొర్రెలకు కూడా దీన్ని దాణాగా వాడుతున్నారు. గింజల నుంచి తైలం తీయగా మిగిలిన కేక్‌ను పత్తి పిండిగా పిలుస్తారు. వేర్వేరు బ్రాండ్ల పేరుతో పత్తి పిండిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 6.5 వేల టన్నుల పిండిని దాణాగా వాడుతున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. జన్యు మార్పిడి కోసం వాడిన హెర్బిసైడ్ టాలరెంట్ ప్రొటీన్, గ్లైఫోసేట్ అవశేషాలు పూర్తిగా ఇందులోనే ఉంటాయి. దీన్ని తిన్న పశువుల్లో జన్యు ఉత్పరివర్తనాలు రావటంతో పాటు ప్రమాదకరమైన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బీజీ–3 పత్తి విత్తన ఆధారిత పదార్థాలను పశువులకు పెట్టకుండా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి జిల్లా అధికారులను ఆదేశించడం గమనార్హం. బీజీ–3 పత్తి పిండి తిన్న పశువుల పాలలో జన్యు విష రసాయనాల అవశేషాలు ఉంటాయని, వాటిని తాగితే అవి కార్సినోజెనిక్ ఏజెంట్లుగా మారి కేన్సర్ సోకే లక్షణాలను రెట్టింపు చేస్తాయని ఇటీవలి పరిశోధనలు బయటపెట్టాయి. ఎలుకలపై ప్రయోగాల్లో ఏం తేలిందంటే.. జన్యుమార్పిడి పంటల నుంచి తీసిన నూనెలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఇప్పటివరకైతే పూర్తిస్థాయి పరిశోధన జరుగలేదుగానీ.. అంతర్జాతీయ కేన్సర్ పరిశోధక సంస్థ మాత్రం (ఐఏఆర్సీ) బీజీ–3 గింజల ఆధారిత పదార్థాలు కేన్సర్ కారకాలేనని నిర్ధారించింది. విత్తనాల్లోకి చొప్పించిన హెర్బిసైడ్ టాలరెంట్ ప్రొటీన్, జన్యుపరంగా మార్పు చెందిన గ్లైఫోసేట్ అత్యంత ప్రమాదకర కేన్సర్ ఏజెంట్లే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎలుకలపై ప్రయోగాలు చేసింది. ఎలుకలను పదే పదే గ్లైఫోసేట్ ప్రభావానికి గురిచేసి పరీక్షించగా.. మగ ఎలుకల్లో అరుదైన కణితి, ఆడ ఎలుకల్లో మూత్ర నాళాల్లో కేన్సర్ సోకేందుకు సానుకూలమైన మార్పు ను ప్రేరేపించినట్లు గుర్తించారు. క్షీరదాలలోని క్రోమోజోమ్ నష్టం, జన్యు ఉత్పరివర్తన అవకాశాలు పెరిగినట్లు గుర్తించారు. గ్లైఫోసేట్ సమ్మేళనాలు చల్లిన క్షేత్రా ల్లో పని చేసిన వ్యవసాయ కార్మికుల నుంచి తీసిన రక్తం, మూత్ర నమూనాల్లో అమీనోమైథైల్ఫాస్ఫరిక్ యాసిడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇది కణజాల క్షయాన్ని ప్రేరేపిస్తోందని ఐఏఆర్సీ ఈ కారణాల నేపథ్యంలోనే మన దేశంలో బీజీ–3 పత్తి సాగును కేంద్రం నిషేధించింది. జీర్ణ వ్యవస్థపై హానికర ప్రభావం ఇలాంటి నూనెల ప్రభావంతో డ్రాప్సీ వ్యాధి రావ టానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్లైఫోసేట్ జీర్ణవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. నూనె కల్తీ కావడంతో హెపటైటిస్ బి (కామెర్లు) రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.. – డాక్టర్ మధుసూదన్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు శుద్ధి చేసింది అయితే మంచిదే.. పత్తి నూనెకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు ఉంది. శుద్ధి (రిఫైన్) చేసిన నూనె ఆరోగ్య రీత్యా కూడా మంచిదే. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పత్తి నూనె వినియోగం ఎక్కువగా ఉంది. వేరుశనగ, నువ్వుల నూనెలను శుద్ధిచేయకపోయినా ఆహారంలో వినియోగించొచ్చు. కానీ బీజీ–3 పత్తి నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఆ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిండి (కేక్)లో హెర్బిసైడ్ టాలరెంట్ ఇతర రసాయన అవశేషాలు ఉంటాయి. వాటిని నేరుగా పశువులకు పెట్టడం ప్రమాదకరం – డాక్టర్ ప్రసాద్, ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్యానల్ కమిటీ జాతీయ చైర్మన్ -
రహస్యంగా కేంద్ర బృందం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): బీజీ–3 పత్తి విత్తనాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు సోమవారం జిల్లాలో రహస్యంగా పర్యటించారు. విత్తన కంపెనీల ప్రతినిధులను కలవనీయకుండా, రైతులతో సమావేశాలు నిర్వహించకుండానే వీరి పర్యటన సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నాగపూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ (సీఐసీఆర్) బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్, కేంద్ర వ్యవసాయశాఖ ప్లాంట్ ప్రొడక్షన్ జేడీఏ ఏఎన్ సింగ్, ఇతర ప్రముఖులు బాలకృష్ణ, ఎస్జే రహిమాన్, శ్రీవత్స, చక్రవర్తి, వీఎస్‌రెడ్డి, బాలసుబ్రమణి, ఎస్ఆర్ రావుతో పాటు జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కమిషనరేట్ జేడీఏ రామరాజు, శాస్త్రవేత్తలు చెంగారెడ్డి, రామారెడ్డి, జయకృష్ణ జిల్లాలో పర్యటించారు. ముందుగా వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర బృంద సభ్యులు.. రైతులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై బీజీ–3 పత్తి విత్తనాలపై అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది. ఇవేవీ లేకుండా పర్యటన ముగించారు. ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మోన్‌శ్యాంటో కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ ఉన్నతాధికారే కేంద్ర బృందం ప్రతినిధులతో రైతులు, విత్తన మేనేజర్లు కలవకుండా అడ్డుపడినట్లు తెలుస్తోంది. విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశమైతే వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీలు, దాడులతో పాటు బీజీ–3కి కేంద్ర అనుమతి లేదన్న విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీనివల్ల కేంద్రానికి వ్యతిరేక నివేదిక వెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జిల్లాకు వచ్చిన కేంద్ర బృందంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులు ఉన్నారు. వీరు ముందుగా కర్నూలులోని గౌతమీసీడ్స్, కర్నూలు సీడ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. పత్తి విత్తనాలను కాకుండా పత్తి శ్యాంపిల్స్ సేకరించినట్లు సమాచారం. తర్వాత గూడూరు మండలంలోని పత్తి పొలాల్లోకి వెళ్లి ఆకులను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దొర్నిపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో సాగైన బీజీ–2 పత్తి పంటను పరిశీలించి..ఆకులు, పత్తి, కాయల శ్యాంపిల్స్ తీసినట్లు తెలుస్తోంది. కేంద్ర బృందం పర్యటన గురించి వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. ఎవరూ వరాలను వెల్లడించలేదు. కేంద్ర బృందం సభ్యులు మీడీయాకు సమాచారం ఇవ్వొద్దని చెప్పారంటూ కనీసం ఎక్కడెక్కడ పర్యటించిందీ వెల్లడించకపోవడం గమనార్హం. -
బీటీ–2 పాయె.. బీటీ–3 వద్దాయె.. రైతుకు విత్తేది?
సాక్షి, హైదరాబాద్ బీటీ–2 పోయింది.. గులాబీ రంగు పురుగు సోకి లక్షల ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది! బీటీ–3.. కేంద్రమే వద్దంది.. అది విషతుల్యమని, జీవవైవిధ్యానికి ముప్పని తేల్చింది! మరి వచ్చే ఖరీఫ్‌లో రైతు ఏ పత్తి విత్తనం వేయాలి? రాష్ట్రంలో లక్షలాది మంది రైతులను వేధిస్తున్న ప్రశ్న ఇది. విత్తనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వట్లేదు. ఇదే అదనుగా వచ్చే ఏడాది కూడా బీటీ–2 పత్తి విత్తనంతోపాటు అనుమతి లేని బీటీ–3 విత్తనాలను అన్నదాతలకు అంటగట్టేందుకు కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే లక్షల ప్యాకెట్లను రహస్యంగా సిద్ధం చేసి ఉంచాయి. అదే జరిగితే ఇప్పటికే చిత్తయిన పత్తి రైతు మరోసారి నిండా మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చొరబడిన బీటీ–3: ప్రపంచంలో అత్యధికంగా పత్తి పండించే 80 దేశాల్లో భారత్ 32వ స్థానంలో ఉంది. దేశంలో 2.92 కోట్ల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. అందులో మన రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మొత్తం సాగు విస్తీర్ణంలో సగం వరకు పత్తి వేశారు. రైతులు దాదాపు కోటి పత్తి విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అయితే బీటీ–2 విఫలమైందని తెలిసిన కొందరు రైతులు అనుమతిలేని బీటీ–3 విత్తనాలు కూడా వేశారు. అక్రమ మార్గాల్లో కంపెనీలు, డీలర్లు అంటగట్టిన దాదాపు 20 లక్షల బీటీ–3 విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేసినట్లు అంచనా. దీనికితోడు పత్తి పంటకు కలుపు వస్తే దాన్ని నాశనం చేసేందుకు గ్లైపోసేట్ అనే పురుగుమందును కేంద్రం అనుమతివ్వకున్నా కంపెనీలు రహస్యంగా రైతులకు అంటగడుతున్నాయి. 10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు రాష్ట్రంలో గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి చాలా మంది రైతులు పత్తి పంట వైపే మొగ్గారు. కానీ పంటకు సోకిన గులాబీ రంగు పురుగు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లలో వర్షాభావం, డ్రైస్పెల్స్, ఎండల తీవ్రతకు ఉధృతమైంది. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా పంట ఉత్పాదకత గణనీయంగా పడిపోయింది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉన్నా అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈ సీజన్లో 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ప్రభుత్వం మొదట్లో అంచనా వేసింది. కానీ ఇప్పుడు 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ విత్తనం సంగతేంటి? దేశీయ పత్తి విత్తనాల కోసం నాగపూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. తాము అభివృద్ధి చేసిన విత్తనాలు పరిశోధన దశను దాటి ట్రయల్ రన్లో ఉన్నట్లు చెబుతోంది. ఆర్జీ–8, పీఏ–402, పీఏ–405, పీఏ–255, డీఎల్ఎస్ఏ–17, జయధర్ విత్తనాలను సంస్థ బీటీ టెక్నాలజీతోనే తయారుచేస్తోంది. అయితే బీటీ టెక్నాలజీయే విఫలమైనప్పుడు ఈ దేశీయ రకాలు కూడా ఎలా గులాబీ రంగు పురుగును తట్టుకుంటాయన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. మొత్తంగా చూస్తే రైతుకు వచ్చే ఏడాది కూడా నకిలీ విత్తనాలే దిక్కుకానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది పత్తి వేయొద్దు బీటీ–2 పత్తి విఫలమైంది. బీటీ–3 విత్తనం వల్ల జీవవైవిధ్యానికి ముప్పుంది. ఇక దేశీయ పత్తి విత్తనాలు కూడా సిద్ధం కాలేదు. పైగా వాటిల్లోనూ బీటీ టెక్నాలజీ ఉంది. కాబట్టి వచ్చే ఏడాది బీటీ–2, బీటీ–3 విత్తనాలనే రైతులకు అంటగట్టే కుట్ర జరుగుతోంది. కాబట్టి రైతులు ఇలాంటి విత్తనాలను వాడే బదులు వచ్చే ఖరీఫ్‌లో పత్తి సాగు చేయకుండా విరామం ప్రకటించాలి. – నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
పత్తి దిగుబడులు మటాష్..!
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు.. నకిలీ విత్తనాలు.. గులాబీరంగు కాయ తొలుచు పురుగు.. ఈ మూడు అంశాలు రాష్ట్రంలో పత్తి దిగుబడులను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో ఎన్నో ఆశలతో పత్తి పంట వేసిన రైతన్న పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అకాల వర్షాలు, గులాబీరంగు పురుగు కారణంగా రాష్ట్రంలో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ నెలలో మార్కెట్‌కు పత్తి భారీగా తరలిరావాల్సి ఉండగా, ఆ పరిస్థితి ఏ మార్కెట్లోనూ కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్లో రోజుకు 20 వేల క్వింటాళ్ల పత్తి తరలిరావాలి. కానీ ఐదారు వేల క్వింటాళ్లకు మించి రావడం లేదని చెబుతున్నారు. ఈ సీజన్లో 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని మొదట్లో అంచనా వేయగా, ఇప్పుడు 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పండించిన పత్తిలో దాదాపు సగం వరకు ఇప్పటికే మార్కెట్‌కు రావాల్సి ఉంది. కానీ మార్కెటింగ్ శాఖ లెక్క ప్రకారం ఈ నెల 4 నాటికి 64.12 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. భారతీయ పత్తి సంస్థ(సీసీఐ) 13.34 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 50.78 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సగానికి తగ్గిన ఉత్పాదకత.. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి ఎక్కువ మంది రైతులు పత్తి వైపే మొగ్గారు. కానీ పత్తి రైతులకు తీవ్ర ఆవేదన మిగులుస్తోంది. అక్టోబర్‌లో భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. 15 జిల్లాల్లో మూడో వంతు పత్తి కాయలోని గింజలు మొలకెత్తాయి. వర్షాలతో పత్తి నల్లరంగులోకి మారింది. దీంతో దిగుబడి గణనీయం గా పడిపోయింది. మరోవైపు పత్తికి గులాబీ రంగు పురుగు సోకింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ పురుగు ఉధృతమైంది. విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కానీ వర్షాలు పడినా.. పురుగు నాశనం కాకపోగా.. మరింత విజృంభించి పత్తికాయలను తొలిచేస్తుండటంతో దిగుబడులు దారుణంగా పడిపోయాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ పురుగు పట్టి పంటంతా సర్వనాశ నమైంది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్లు రావాలి. ఒక్కోసారి 13–14 క్వింటాళ్ల వరకు వస్తుంది. కానీ అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించలేదు. నకిలీలు.. అనుమతిలేని పత్తి విత్తనాలూ బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీంతో గులాబీ పురుగు రాష్ట్రంలో పత్తి దిగుబడిని దెబ్బతీసి రైతులను కుదేలు చేసింది. గులాబీ పురుగు ఉధృతితో తీవ్ర నష్టం జరుగుతున్నా వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేయలేకపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాలను కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టాయి. ఇప్పుడు సాగైన పత్తిలో బీజీ–3 విత్తనం 15 నుంచి 20 శాతం ఉంటుందని అంచనా. నకిలీ, అనుమతిలేని పత్తి విత్తనంతో అనేకచోట్ల రైతులు నష్టపోయారు. మూడు నెలల క్రితం ప్రభుత్వం వివిధ డీలర్ల నుంచి పత్తి సహా ఇతర విత్తనాల శాంపిళ్లను సేకరించింది. వాటిని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ లేబొరేటరీకి పంపింది. డీఎన్ఏ పరీక్షల్లో 100కు పైగా శాంపిళ్ల విత్తనాల్లో మొలకెత్తే లక్షణం తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇందులో 95 శాతం పత్తి విత్తనాలే. మొత్తంగా ఈసారి పత్తి దెబ్బకు రాష్ట్రంలో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.