సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాన్ని ఈ ఖరీఫ్‌లో రైతులు విరివిగా వేశారని, అనేకచోట్ల మంచి ఫలితాలు రాగా అక్కడక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రానికి తెలిపింది. అనుమతి లేకున్నా అనేక కంపెనీలు, డీలర్లు బీజీ–3ని రైతులకు విక్రయించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజీ–3 విత్తనానికి సంబంధించి వివిధ అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి బుధవారం కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఈసారి పత్తి విస్తీర్ణంలో దాదాపు 20 శాతం బీజీ–3 పత్తి విత్తనాన్ని రైతులు సాగు చేసినట్లు తెలిసింది.
వారంలో పత్తి రైతులకు గుర్తింపు కార్డులు
వారం రోజుల్లో పత్తి రైతులకు గుర్తింపు కార్డులు జారీచేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పత్తి రైతుల వివరాల నమోదు పూర్తయిందని, గుర్తింపు కార్డులను ప్రింట్ చేసి వారంలో గ్రామాల్లో రైతులకు అందజేస్తామని తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను గుర్తించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ లోడింగ్ జరుగుతోందన్నారు. వచ్చే 23వ తేదీ నాటికి ఇది పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఒకవేళ గుర్తింపు కార్డు లేకున్నా డేటాలో పొందుపరిచిన ఆధార్‌కార్డు నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు తెలిపి ఆ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవచ్చన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తొందరపడి పత్తి అమ్ముకోకూడదని, మార్కెట్ బలపడ్డాక కనీస మద్దతు ధరకు విక్రయించుకోవాలని ఆయన కోరారు.
ఈ ఏడాది 5.60 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తి
2017–18 ఖరీఫ్‌లో 2.40 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.20 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరుగుతుందని పార్థసారథి తెలిపారు. ఈ అంశంపై బుధవారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జాతీయ విత్తన సంస్థ (ఎన్‌ఎస్‌సీ) నుంచి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు 20 వేల క్వింటాళ్ల సోయాబీన్, 40 వేల క్వింటాళ్ల దయించా (పచ్చిరొట్ట) విత్తనాలను సరఫరా చేసేలా ఒప్పందం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఎన్‌ఎస్‌సీకి తెలంగాణ సోనా వరి, డీహెచ్‌ఎం 121 మొక్కజొన్న రకం విత్తనాలను సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అలాగే హైబ్రీడ్ మొక్కజొన్న విత్తన ఉత్పత్తిని హాకా, విత్తనాభివృద్ధి సంస్థలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్థసారథి వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్, విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంచాలకుడు డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
బీజీ–3 పత్తి విత్తనంపై ఏంచేయాలి?
Published Thu, Oct 19 2017 5:34 AM | Last Updated on Thu, Oct 19 2017 5:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment