అవును..‘ ఉగాది పచ్చడే’ | Mixed results for the ruling Congress party compared to the Assembly elections | Sakshi
Sakshi News home page

అవును..‘ ఉగాది పచ్చడే’

Published Fri, Jun 14 2024 3:54 AM | Last Updated on Fri, Jun 14 2024 3:54 AM

Mixed results for the ruling Congress party compared to the Assembly elections

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అధికార కాంగ్రెస్‌ పార్టీకి మిశ్రమ ఫలితాలు 

రాజకీయ వర్గాల్లో చర్చ

ఏకంగా 42 చోట్ల ఓట్ల సంఖ్యలో పెరుగుదల.. అసెంబ్లీ కంటే పార్లమెంట్‌కే ఎక్కువ 

8 ఎంపీ స్థానాల పరిధిలోనూపెరిగిన ఓట్లు 

ఓట్లు పెరిగిన ఆరింట ఓటమి... ఓట్లు తగ్గినా ఆరింట గెలుపు 

ఉత్తమ్, భట్టి మినహా అందరు మంత్రులనియోజకవర్గాల్లో లాస్‌ 

సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 23వేల తక్కువ ఓట్లు 

సాక్షి, హైదరాబాద్‌ : ‘పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితాలు కొంచెం తియ్యగా..కొంచెం పుల్లగా, కొంచెం వగరుగా వచ్చాయి. ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలా ఉన్నాయి.’... లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. నిజంగా ముఖ్యమంత్రి చెప్పినట్టే అధికార కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆరునెలలే అవుతున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రావడం దేనికి సంకేతమన్నది ఆసక్తికరంగా మారింది. 

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 42 చోట్ల అధికంగా ఓట్లు సాధించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తన పట్టు నిరూపించుకోగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న చాలా స్థానాల్లో ఓట్లు తగ్గడం గమనార్హం. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ఎనిమిది చోట్ల అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, తొమ్మిది చోట్ల తగ్గాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కేవలం రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన ఆరు చోట్ల ఓడిపోయారు. 

ఇక, అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చినా, ఆరుస్థానాల్లో త్రిముఖ పోటీ కారణంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగలిగారు. ఇక, రాష్ట్ర మంత్రివర్గం విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చాయి. ఆయన సొంత పార్లమెంట్‌ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. 

ఇతర మంత్రుల్లో కేవలం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్, మధిర స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, మిగిలిన అందరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లతో సరిపెట్టుకున్నారు. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసిన స్థానం మినహా 92,35,792 ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి రాగా, లోక్‌సభ ఎన్నికల్లో 86,53,707 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం 39 నుంచి 40.5 శాతానికి పెరిగినా, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అధికార కాంగ్రెస్‌ పార్టీ  5.82లక్షల ఓట్లు కోల్పోవడం గమనార్హం.  

పోస్టుమార్టం హైలైట్స్‌ ఇవే : 
»   గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ స్థానం పరిధిలో ఓట్లు భారీగా పెరిగాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. సిర్పూర్, ముథోల్‌ నియోజకవర్గాల్లో అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే 50వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 
»    పెద్దపల్లి లోక్‌సభ ఎంపీ స్థానం గెలిచినా, ఆ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.  
»   కరీంనగర్‌లోనూ అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు తగ్గాయి. అత్యధికంగా మానకొండూరు నియోజకవర్గంలో 44వేల ఓట్లు తక్కువ వచ్చాయి.  
»   అసెంబ్లీ ఎన్నికల కంటే నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 72వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈ పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ఆర్మూరు, బోధన్, నిజామాబాద్‌ అర్బన్, కోరుట్ల, జగిత్యాల స్థానాల్లో ఓట్లు పెరగ్గా, నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో తగ్గాయి. 
»   జహీరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే స్వల్పంగా ఓట్లు తగ్గినా, ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ బాన్సువాడ, కామారెడ్డి, జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు పెరగ్గా, మిగిలిన చోట్ల తగ్గాయి.  
»    మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే అతి స్వల్పంగా 7వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే, సిద్దిపేటలో 9,968 ఓట్లు, గజ్వేల్‌లో 32,971 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ వచ్చాయి. సంగారెడ్డిలో స్వల్పంగా ఓట్లు పెరిగాయి.  
»    మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచి్చన ఓట్ల కంటే లోక్‌సభ ఎన్నికల్లో వచి్చన ఓట్లు ఎక్కువ. 
»    సికింద్రాబాద్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే 1.4 లక్షల ఓట్లు ఎక్కువ పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చాయి.  
»     ఎంఐఎం అడ్డా హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. తెలంగాణ మొత్తంగా చూస్తే.. అత్యల్పంగా కేవలం 62,497 ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి పడ్డాయి.  
»   చేవెళ్లలోనూ అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యత కనిపించింది.  
»    మహబూబ్‌నగర్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే 1.10లక్షల ఓట్లు తగ్గాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో వచి్చన ఓట్ల కంటే 23వేల ఓట్లు తగ్గాయి.  
»    నాగర్‌కర్నూల్‌లో ఓట్లు తగ్గినా త్రిముఖ పోటీలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగలిగింది. ఇక్కడ కూడా అన్ని అసెంబ్లీ స్థానాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి లభించడం గమనార్హం.  
»    తెలంగాణలోనే రికార్డు మెజారిటీతో గెలిచిన నల్లగొండ పార్లమెంట్‌ స్థానం పరిధిలోనికి వచ్చే  హుజూర్‌నగర్, సూర్యాపేట అసెంబ్లీ స్థానాల్లో లోక్‌సభకు ఓట్లు పెరిగాయి. మిగిలిన చోట్ల స్వల్పంగా తగ్గాయి. సూర్యాపేటలో ఏకంగా 32వేల ఓట్లు అధికంగా లభించాయి. 
»   భువనగిరి లోక్‌సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి.  
»  వరంగల్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయి. 
»   మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోనూ అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. కేవలం భద్రాచలం అసెంబ్లీ పరిధిలో (ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది.) మాత్రమే ఓట్లు పెరగ్గా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచిన ప్రతి చోటా ఓట్లు తగ్గాయి.  
»    ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం, పాలేరులో  ఓట్లు తగ్గాయి. ఖమ్మం అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా 10వేల ఓట్లు తగ్గడం గమనార్హం.  
»   మొత్తం మీద ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, నల్లగొండ, ఖమ్మంలలో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, మిగిలిన చోట్ల తక్కువ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచి్చనా, భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్, జహీరాబాద్‌లలో త్రిముఖ పోటీ కారణంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. 



సానుకూలతలున్నా...! 
అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి అనేక సానుకూలతలున్నా, ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో సీపీఎం కాంగ్రెస్‌ పార్టీకి అధికార మిత్రపక్షంగా తోడయింది. ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ బహిరంగంగానే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చింది.

జాతీయస్థాయి రాజకీయాల నేపథ్యంలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్‌ వైపు నిలిచారనే అంచనాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న కారణంగా ఉండే సానుకూలత, వనరులు ఆ పార్టీకి అదనపు బలాన్నిచ్చాయి. ఇన్ని సానుకూలతల నేపథ్యంలోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకోవడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement