రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.
జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..
1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.
2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.
3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.
4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.
5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.
6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.
7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపు
ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment