ఆసక్తికరంగా మహారాష్ట్ర పోరు
ఇరు కూటముల్లోనూ గుబులు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. కానీ అంతిమ ఫలితాన్ని మాత్రం చిన్న పార్టీలు, స్వతంత్రులే తేల్చే సూచనలు కన్పిస్తుండటం విశేషం. ఈ జాబితాలో మజ్లిస్, ఎంఎన్‌ఎస్, వీబీఏ వంటి పార్టీలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. వీటికి, స్వతంత్రులకు కలిపి ఈసారి కనీసం 30 స్థానాలకు పైగా రావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగి, హంగ్ వచ్చే పక్షంలో అవి కింగ్‌మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకూ నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న పార్టీల హల్‌చల్ రెండు కూటముల్లోనూ గుబులు రేపుతోంది. దాంతో అందరి దృష్టీ 23న వెల్లడయ్యే ఫలితాలపైనే కేంద్రీకృతమైంది...!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరింది. అధికారం నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్న బీజేపీ సారథ్యంలోని మహాయుతి, దాన్ని ఎలాగైనా గద్దె దించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూటములకు చిన్న పార్టీలు పెద్ద సమస్యగా పరిణమించాయి. జరుగుతున్నది ద్విముఖ పోరే అయినా రెండు కూటముల భాగ్యరేఖలనూ ఈ ‘తృతీయ శక్తులు’ నిర్దేశించేలా కనిపిస్తుంటే ఆసక్తికరంగా మారింది. ఈ చిన్న పార్టీల్లో ఒక్కోదానికీ ఒక్కో ప్రాంతంలో చెప్పుకోదగ్గ పట్టుంది.
అగాడీకి ఎంఎన్‌ఎస్ గుబులు
ఈ ఎన్నికల్లో ప్రబల శక్తిగా కనిపిస్తున్న రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) విపక్ష ఎంవీఏ కూటమికి గుబులు పుట్టిస్తోంది. రాజధాని ముంబై, శివార్లలో ఎంఎన్‌ఎస్ హవా అంతా ఇంతా కాదు. ముంబైలోని 25 స్థానాల్లో ఎంఎన్‌ఎస్ బరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం మరో 36 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గట్టి ప్రభావం చూపడం ఖాయంగా కన్పిస్తోంది. ముంబైలోని 25 స్థానాల్లో మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) 12, బీజేపీ 10 చోట్ల పోటీ పడుతున్నాయి.
ఎంఎన్‌ఎస్‌ను బీజేపీకి మిత్రపక్షంగా పరిగణిస్తారు. రాజ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన కుమారుడు అమిత్ పోటీ చేస్తున్న మాహింలో కూటమి ధర్మాన్ని కూడా బీజేపీ పక్కన పెట్టింది! అక్కడ షిండే సేన అభ్యర్థని కాదని మరీ అమిత్‌కే బీజేపీ నేతలు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు! ఇది ఆ రెండు పార్టీల లోపాయికారీ అవగాహనకు, బీజేపీ వ్యూహ చతురతకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.
కింగ్‌మేకర్ ఆశల్లో ఒవైసీ
అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్‌కు కూడా మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ పట్టే ఉంది. ముఖ్యంగా ఔరంగాబాద్‌తో పాటు ముంబైలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పార్టీ హవా కొనసాగుతుంది. 2019లో 44 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ ఈసారి కేవలం 16 స్థానాల్లోనే బరిలో ఉంది. కాకపోతే అవన్నీ ముస్లిం ప్రాబల్య స్థానాలే. వాటిలో చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయంపై పార్టీ నమ్మకంగా ఉంది.
అంతేగాక మిగతా చోట్ల మజ్లిస్ చీల్చే ముస్లిం ఓట్లు అగాడీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలకు గట్టిగా గండి కొట్టేలా కన్పిస్తున్నాయి. ‘‘హంగ్ వచ్చి ఎంవీఏ కూటమి గనక మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోతే మేం గెలవబోయే సీట్లే కీలకం కావచ్చు. అప్పుడు మజ్లిస్ కింగ్‌మేకర్ అవుతుంది’’ అని ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎంవీఏ కూటమిలో చేరేందుకు మజ్లిస్ విఫలయత్నం చేసింది.
గత ఎన్నికల్లోనూ దుమ్ము రేపాయి
మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిన్న పార్టీలు దుమ్మురేపాయి. మొత్తమ్మీద 29 సీట్లు గెలుచుకోవడమే గాక ఏకంగా మరో 63 అసెంబ్లీ స్థానాల్లో చిన్న పార్టీల అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈసారి కూడా ఆ ఫలితాలే పునరావృతమైతే కూటములకు కష్టకాలమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఓటర్లు 4 లక్షలు, అంతకన్నా తక్కువే ఉంటారు. 60 శాతం పోలింగ్ జరుగుతుందనుకున్నా సగటున ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో 2.5 లక్షల ఓట్లు పోలవుతాయి. పార్టీపరమైన చీలికల దృష్ట్యా ప్రతి స్థానంలోనూ కేవలం లక్ష ఓట్లే విజేతను తేల్చే అవకాశముంది.
సరిగ్గా ఈ అంశమే పలు స్థానాల్లో చిన్న పార్టీలను ప్రబల శక్తులుగా మారుస్తోంది. దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్రలో ఈసారి రాజకీయ రంగస్థలం నానారకాలుగా చీలిపోయింది. దాంతో చిన్న పార్టీ, గట్టి ఇండిపెండెంట్ బరిలో ఉన్న అన్ని స్థానాల్లోనూ మిగతా అభ్యర్థులందరి భాగ్యరేఖలూ ప్రభావితమ య్యే పరిస్థితి నెలకొంది! ఈ కారణంగానే ఈసారి ఫలితాలను అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు
అంటున్నారు.
దళిత ఓట్లను చీల్చనున్న వీబీఏ!
ఎన్నికల బరిలో ఉన్న వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) నిజానికి పలు చిన్న పార్టీల కూటమి. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని ఈ కూటమికి దళితులు, బౌద్ధ దళితులు, ఇతర అణగారిన వర్గాలతో పాటు ముస్లింలలో కూడా మంచి ఆదరణే ఉంది. రిజర్వేషన్లే ప్రధాన నినాదంగా ఈసారి ఏకంగా 67 స్థానాల్లో వీబీఏ బరిలో దిగింది. వీటిలో అత్యధిక స్థానాలు ముంబై, విదర్భ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర జనాభాలో దళితులు 14 శాతం, బౌద్ధ దళితులు 7 శాతమున్నారు. గతంలోనూ పలు ఎన్నికల్లో వీబీఏ సత్తా చాటింది.
విదర్భతో పాటు మరాఠ్వాడా ప్రాంతంలోనూ పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణ ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాకపోయినా 7 శాతం ఓట్లు సాధించింది. ఈసారి వీబీఏ భారీగా దళిత ఓట్లు సాధిస్తే ప్రధానంగా ఎంవీఏ కూటమికే దెబ్బ పడుతుంది. 2019లో కూడా కనీసం 10 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్థుల ఓటమికి వీబీఏ సాధించిన ఓట్లే కారణమని తేలింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా పలు స్థానాల్లో ఎంవీఏ అభ్యర్థుల ఓటమికి వీబీఏ కారణంగా నిలిచింది. ఇవే గాక మరికొన్ని చిన్న పార్టీలతో స్థానికంగా గట్టి పట్టున్న స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు స్థానాల్లో కూటముల అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.
జరంగే ఫ్యాక్టర్?
మరాఠా హక్కుల ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ కూడా ఈసారి ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపేలా ఉన్నారు. ఈసారి అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి రెండు కూటములకూ ఆయన చెమటలు పట్టించారు. మహారాష్ట్ర జనాభాలో ఏకంగా 30 శాతానికి పైగా ఉండే మరాఠాల్లో ఆయనకు గట్టి పట్టుండటమే ఇందుకు కారణం. చివరి క్షణంలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా ఎన్నికల ఫలితాలపై మాత్రం జరంగే గట్టి ప్రభావమే చూపనున్నారు.
ముఖ్యంగా మరాఠ్వాడాలో చాలా స్థానాల్లో ఆయన మద్దతిచ్చే అభ్యర్థులే గట్టెక్కే పరిస్థితి నెలకొని ఉంది! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జరంగే సహాయ నిరాకరణ మరాఠ్వాడాతో పాటు పశ్చిమ మహారాష్ట్ర, విదర్భల్లోని పలు స్థానాల్లో మహాయుతి అవకాశాలను బాగా దెబ్బతీసింది. ఆ చేదు అనుభవం ఈసారీ పునరావృతం అవుతుందేమోనని బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment