ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ అని ధ్వజం
మహారాష్ట్రలో మోదీ ఎన్నికల ప్రచారం
చంద్రాపూర్/షోలాపూర్: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ అవినీతికి మారుపేరు అని మండిపడ్డారు. అవినీతి పార్టీలు జట్టుకట్టాయని అన్నారు. అభివృద్ధికి బ్రేకులు వేయడంలో ఎంవీఏ పార్టీలు పీహెచ్‌డీ చేశాయని, కాంగ్రెస్ పార్టీ డబుల్ పీహెచ్‌డీ చేసిందని ధ్వజమెత్తారు. మంగళవారం చంద్రాపూర్, షోలాపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు.
అభివృద్ధి చేయడం చేతకాని పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడం మాత్రమే తెలుసని విమర్శించారు. చంద్రాపూర్ ప్రజలు రైలు మార్గం కావాలని దశాబ్దాలుగా కోరుతున్నారని, కాంగ్రెస్ కూటమి ఆ ప్రయత్నం నెరవేరనివ్వలేదని అన్నారు. మహాయుతి పాలనలో మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు అందనంత వేగంతో అభివృద్ధి జరుగుతోందని వివరించారు.
మరో ఐదేళ్లపాటు ఇదే వేగంతో ప్రగతి కొనసాగిస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి అధికారం అప్పగించాలని కోరారు. బీజేపీ మేనిఫెస్టో ‘మహారాష్ట్ర వికాస్ కీ గ్యారంటీ’గా మారడం ఖాయమన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే అర్థం డబుల్ స్పీడ్ డెవలప్‌మెంట్ అని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
బడుగులను కాంగ్రెస్ ఎదగనివ్వలేదు
‘‘దేశాన్ని పాలించడానికే జన్మించామని కాంగ్రెస్ రాజకుటుంబం భావిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలను కాంగ్రెస్ పైకి ఎదగనివ్వలేదు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఆ పార్టీకి చిరాకు పుడుతోంది. దళితులు, గిరిజనులు, బీసీలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ప్రశ్నిస్తూ 1980వ దశకంలో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇచ్చింది. ఆ పాత ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సమాజాన్ని కులాల పేరిట ముక్కలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రమాదకరమైన ఆట ఆడుతోంది. ఒకవేళ గిరిజనులను కులాల వారీగా విడదీస్తే వారి గుర్తింపు, బలం కనుమరుగవుతాయి.
సీఎం సీటు కోసం పోటీ
విపక్ష మహా వికాస్ అఘాడీలో డ్రైవర్ సీటు కోసం అంతర్గత యుద్ధం కొనసాగుతోంది. అక్కడ జరుగుతున్న తొక్కిసలాటను మీరు చూడొచ్చు. కూటమి నేతలంతా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. టగ్–ఆఫ్–వార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేర్లను ప్రకటించడంలో ఓ పార్టీ రోజంతా బిజీగా ఉంటోంది. కాంగ్రెస్ ప్రయ త్నాలను కొట్టిపారేయడంలో మరో పార్టీ బిజీగా గడుపుతోంది. పదవుల కోసం కొట్టుకొనే ఇలాంటి నాయకులు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? మహారాష్ట్ర ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించే సత్తా మహాయుతికి మాత్రమే ఉంది. అభివృద్ధి కొనసాగాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి’’ అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment