ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచార స్పీడ్‌ను పెంచాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంవీఏ కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై ఉన్న అంతర్గత పోరును ఉద్ధేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత అయిదేళ్లలో మహారాష్ట్రలో మారిన ప్రభుత్వాలను ప్రాస్తావిస్తూ.. ఎంవీయే కూటమి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పాలించిందని, ఆ కాలంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలను లూటీ చేసేందుకు వారు రాజకీయాల్లో ఉంటారని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారని మండిపడ్డారు. తర్వాత ఏర్పడిన మహాయుతి అధికారంలో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదనే మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ప్రజలను ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇచ్చేస్తారని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజల్లో విష బీజాలు నాటి, మతం పేరుతో దేశ విభజనకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే వారంతా ఐక్యంగా ఉన్నంతకాలం బలంగా ఉంటారని.. ఏ శక్తీ వారిని అడ్డుకోలేదని అన్నారు.
ఇక జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కశ్మీర్‌పై వారి కుట్రను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారని.. అది ఎప్పటికీ జరగని పని అని మోదీ స్ప ష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment