రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం తాజాగా కలకలం సృష్టించింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి కారణమైంది. సమగ్ర దర్యాప్తు-కుట్ర అని పరస్పరం ఆరోపించుకున్నాయవి. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా కూడా పడింది. కానీ, ఒక చట్ట సభ్యుడు నిజంగా అలా నోట్ల కట్టతో సభకు వెళ్లకూడదా?.. ఇది రాజకీయ రాద్ధాంతం చేయాల్సిన అంశమా?.. అసలు అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమా?
పార్లమెంట్ అంటే చట్ట సభ్యులు కొలువుదీరే భవనం. కాబట్టి.. హైసెక్యూరిటీ జోన్ అని అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. అయితే పార్లమెంట్‌లో భాగమైన రాజ్యసభలో.. అదీ ఓ సభ్యుడి సీటు దగ్గర డబ్బు దొరకడం కచ్చితంగా తీవ్రమైన అంశమే!. పార్లమెంట్‌లోకి ఏది పడితే అది తీసుకురావడానికి ఆస్కారం ఉందన్న సంకేతాలను పంపిచింది ఈ ఘటన.
‘‘ప్రతి సీటు చుట్టూ గాజు గదినిగానీ, ముళ్లతో కూడిన ఇనుప కంచెనుగానీ ఏర్పాటుచేయాలి. సభ్యులు వాటికి తాళాలు వేసుకుంటే.. తాము ఇంటికెళ్లాక సీట్ల వద్ద ఇతరులెవరూ గంజాయి, కరెన్సీ నోట్లు పెట్టకుండా నివారించొచ్చు’’
.. నోట్ల కట్ట దొరికిన సీటు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కామెంట్
అసలేం జరిగిందంటే..
శుక్రవారం రాజ్యసభ నడుస్తుండగా.. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. ‘‘గురువారం సభ వాయిదా పడిన తర్వాత భద్రతా అధికారులు లోపల సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబరు సీటు వద్ద నోట్ల కట్టను వారు గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే నిబంధనల ప్రకారం దర్యాప్తునకు ఆదేశించా. ఈ విషయాన్ని సభకు తెలియజేయడం నా బాధ్యత’’ అన్నారు.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday. Apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/42GMz5CbL7
— ANI (@ANI) December 6, 2024
రాజకీయ దుమారంతో..
చైర్మన్ చేసిన ఈ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ధన్‌ఖడ్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నోట్ల కట్ట వ్యవహారంపై దర్యాప్తునకు తమకు అభ్యంతరమేమీ లేదని.. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు బయటకు చెప్పడమేంటని ప్రశ్నించారు. సభను సజావుగా జరగనివ్వకూడదనే కుట్రలో ఇది భాగంకావొచ్చని అనుమానం వ్యక్తం చేశారాయన. అయితే..
ఖర్గే స్పందనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. ఏ సీటు వద్ద కరెన్సీ దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో.. ఛైర్మన్ చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. నోట్ల కట్టను సభకు తీసుకురావడం చాలా తీవ్రమైన అంశమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ భంగం కలిగించిందంటూ మరో సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సభ్యులెవరూ శాంతించకపోవడంతో.. సభ వాయిదా పడింది. అరుదుగా జరిగిన ఘటన.. అందునా రాజకీయ దుమారం రేగడంతో మీడియా కూడా అంతే హైలైట్ చేసి చూపించింది.
మరి ఇంత వీకా?
అయితే సదరు సభ్యుడు ఆరోపిస్తున్నట్లు ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే!. గత అనుభవాల దృష్ట్యా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. సరిగ్గా కిందటి ఏడాది ఇదే నెలలో లోక్‌సభలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. సెషన్ జరుగుతున్న టైంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్‌లోకి దూకిన ఇద్దరు.. టియర్ గ్యాస్ షెల్స్‌తో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. కొందరు ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ నిలువరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. హైటెక్ హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక పాత పార్లమెంట్ భవనం ఉన్నప్పుడు 2001లో జరిగిన ఉగ్రదాడి సంగతి సరేసరి.
ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతా ఎవరి బాధ్యతో తెలుసా?
మరోవైపు ఈ ఘటనతో పార్లమెంట్ ఔనత్యంపై ప్రజల్లోనూ పలు అనుమానాలు కలగొచ్చు. చట్ట సభల్లోనే సభ్యుల్ని కొనుగోలు చేసే ప్రయత్నమా? లేదంటే డబ్బుతో ప్రభావితం చేయాలనుకుంటున్నారా? లేకుంటే.. విపక్ష సభ్యుడి సీటు దగ్గరే దొరకడంలో ఏదైనా కుట్ర దాగి ఉందా?.. అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు. వీటిని నివృత్తి చేయడానికైనా రాజ్యసభలో నోట్ల కట్ట బయటపడడంపై రాద్ధాంతం కాకుండా.. చర్చ జరగాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment