రాజ్యసభలో ప్రసంగిస్తున్న ఖర్గే
న్యూఢిల్లీ: స్వాతంత్య్రోద్యమంలో బీజేపీ పాత్రపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేశాయి. ‘‘స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ నేతలు అత్యున్నత త్యాగాలు చేశారు. బీజేపీ నుంచి మాత్రం కనీసం ఒక కుక్క కూడా చనిపోలేదు. మోదీ ప్రభుత్వం మాటలు సింహంలా మాట్లాడుతుంది గానీ పనులు మాత్రం ఎలుకలా చేస్తుంది’’ అంటూ సోమవారం ఆయన ఎద్దేవా చేయడం తెలిసిందే. దీనిపై మంగళవారం ఉదయం ఉభయ సభలూ ప్రారంభమవుతూనే అధికార బీజేపీ సభ్యులంతా ఒక్కసారిగా లేచి నిలబడి ఖర్గే క్షమాపణలకు డిమాండ్ చేశారు.
లోక్‌సభలో విపక్ష సభ్యులూ ప్రతి నినాదాలకు దిగడంతో గందరగోళం నెలకొంది. దాంతో సభను స్పీకర్ ఓం బిర్లా ఉదయం 11.30 దాకా వాయిదా వేశారు. రాజ్యసభలోనూ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఎంత చెప్పినా బీజేపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దాంతో వారిని అదుపు చేయాల్సిందిగా సభా నాయకుడు పీయూష్ గోయల్‌ను కోరారు. ఖర్గే అమర్యాదకరమైన పదజాలం వాడారంటూ గోయల్ ఆక్షేపించారు.
బీజేపీకి, సభకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్‌ను ప్రజలు ఆమోదించడం లేదని బహుశా ఖర్గేకు అసూయగా ఉన్నట్టుంది. అదే ఆయన విమర్శల్లో ప్రతిఫలించింది. నిజానికి స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ అన్నారు. అది సరైందేనని ఖర్గే ప్రవర్తన రుజువు చేసింది. క్షమాపణలు చెప్పే దాకా ఆయనకు సభలో ఉండే హక్కు లేదు’’ అంటూ మండిపడ్డారు.
తప్పుడు సంకేతాలిస్తున్నారు: చైర్మన్
ఎంత విజ్ఞప్తి చేసినా నిరసనలు ఆగకపోవడంపై రాజ్యసభ చైర్మన్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ‘‘మీ ప్రవర్తనతో తప్పుడు సంకేతాలిస్తున్నారు. 135 కోట్ల మంది దేశ ప్రజలు మనల్ని చూసి నవ్వుతున్నారు. చిన్న పిల్లల్లా దెబ్బకు దెబ్బ తరహాలో ప్రవర్తించొద్దు’’ అంటూ హితవు పలికారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. స్వాతంత్య్రోద్యమంలో బీజేపీ పాత్రే లేదని పునరుద్ఘాటించారు. బయట చేసిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావించరాదన్నారు. ఖర్గేకు చరిత్ర గుర్తు లేనట్టుందంటూ ఎద్దేవా చేశారు. విపక్ష సభ్యులంతా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
267వ నిబంధన దుర్వినియోగం: ధన్‌ఖడ్
267వ నిబంధనను సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు సాధనంగా సభ్యులు వాడుకుంటున్నారని ధన్‌ఖడ్ విమర్శించారు. మంగళవారం ‘‘అత్యవసరంగా చర్చ జరగాల్సిన అంశాలుంటే రోజువారీ కార్యకలాపాలను సస్పెండ్ చేసి మరీ 267వ నిబంధన కింద రోజూ చర్చ చేపట్టేందుకు కూడా వెనకాడబోను. అదే సమయంలో సభ్యుల డిమాండ్లలో పస లేకుంటే అనవసరంగా నా పదవీకాలంలో ఒక్కసారి కూడా ఆ నిబంధనను వాడను’’ అన్నారు.
ఇటలీ కాంగ్రెస్: బీజేపీ
కేంద్ర మంత్రులు పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఖర్గే వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ‘‘ఇప్పుడున్నది ఇటలీ కాంగ్రెస్. నకిలీ నేతలతో నిండిన నకిలీ పార్టీ. అధ్యక్ష స్థానంలో రబ్బర్ స్టాంపును కూచోబెట్టి వేరెవరో వ్యవహారాలు నడుపుతున్నారు. స్వాతంత్య్రోద్యమ వారసత్వాన్ని తమదిగా చెప్పుకనే హక్కు దానికి లేనే లేదు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘‘చిల్లర విమర్శలతో భారత్ జోడో యాత్ర శవయాత్రగా మారుతోంది. కాంగ్రెస్‌ను అధఃపాతాళంలోకి దిగజారింది’’ అని అశ్వినీకుమార్ చౌబే అన్నారు.
23న సమావేశాలకు తెర!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వారం ముందే ముగియనున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన సమావేశమైన సభా కార్యకాలాపాల సూచనల కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 7న మొదలైన సమావేశాలు డిసెంబర్ 29వ తేదీదాకా కొనసాగాలి. కానీ 23వ తేదీనే సెషన్‌ను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల çనేపథ్యంలో సెషన్‌ను ముందుగా ముగించాలని విపక్ష నేతలు స్పీకర్‌ను, ప్రభుత్వాన్ని గతంలోనే కోరారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment