చిచ్చు రేపిన అమిత్ షా వ్యాఖ్యలు
విపక్షాల నిరసనలు, ఆందోళనలు
అంబేడ్కర్ నామజపం ఫ్యాషనైపోయింది
దైవనామం జపిస్తే స్వర్గమన్నా దక్కేది
కాంగ్రెస్‌పై రాజ్యసభలో హోం మంత్రి విసుర్లు
రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం: విపక్షాలు
అమిత్ షా రాజీనామాకు వెల్లువెత్తిన డిమాండ్లు
తప్పుకోకుంటే దేశమంతటా వీధి పోరాటాలే: ఖర్గే
నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: అమిత్ షా
కాంగ్రెస్ నిస్పృహకు నిదర్శనమంటూ ఎద్దేవా
ఆయనకు మోదీ, కేంద్ర మంత్రుల బాసట
న్యూఢిల్లీ: మాటలు మంటలు రేపాయి. అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు మంగళవారం ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేడ్కర్ ప్రస్తావన తెచ్చారు. ‘‘అంబేడ్కర్, అంబేడ్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘కాంగ్రెస్ పదేపదే అంబేడ్కర్ నామస్మరణ చేస్తుండటం మాకూ ఆనందమే. కానీ ఆయనపై వారి అసలు వైఖరేమిటో కూడా బయటపెట్టాలి. అంబేడ్కర్‌ను పదేపదే అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఆర్టికల్ 370తో పాటు పలు విధానాలపై నెహ్రూ సర్కారు విధానాలతో విభేదించి ఆయన మంత్రివర్గం నుంచి అంబేడ్కర్ వైదొలిగాల్సి వచి్చంది. అలా మీరు నిత్యం వ్యతిరేకించిన అంబేడ్కర్ పేరునే ఇప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇదెంత వరకు సమంజసం?’’ అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అయితే అమిత్ షా చేసిన ‘అంబేడ్కర్–దైవ నామస్మరణ’ పోలిక తీవ్ర విమర్శలకు దారితీసింది.
జాతీయ రాజకీయాలు బుధవారమంతా వాటిచుట్టే తిరిగాయి. రాజ్యాంగ నిర్మాతనే గాక దేశంలోని దళితులందరినీ అమిత్ షా తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ఆయన తక్షణం బహిరంగంగానూ, పార్లమెంటులోనూ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరో అడుగు ముందుకేసి, ‘‘షా తక్షణం రాజీనామా చేయాల్సిందే. లేదంటే ప్రధాని మోదీయే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి.
అంబేడ్కర్ పట్ల మోదీకి ఏమాత్రం గౌరవమున్నా బుధవారం అర్ధరాత్రిలోపు ఈ పని చేయాలి’’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు, వీధి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంటు కూడా అట్టుడికిపోయింది. ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపక్షాలు నిరసనలకు, ఆందోళనలకు దిగాయి.
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ‘అమిత్ షా సిగ్గు పడు’, ‘క్షమాపణలు చెప్పు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ‘‘ప్రసంగంలో కొంత భాగాన్ని తీసుకుని వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌కు మరే అంశాలూ లేక నిస్పృహతో చౌకబారు చర్యలకు అన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అమిత్ షాకు బాసటగా మాట్లాడారు.
దేశమంతా అగ్గి రాజుకుంటుంది: ఖర్గే
బీజేపీ అహంభావ ధోరణికి, అంబేడ్కర్‌పై వారికున్న ద్వేషానికి అమిత్ షా వ్యాఖ్యలు అద్దం పట్టాయని ఖర్గే మండిపడ్డారు. ‘‘అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వొద్దని మనుస్మృతి సిద్ధాంతాన్ని ఆచరించే బీజేపీ, ఆరెస్సెస్ నిర్ణయించుకున్నాయి. మనుస్మృతికి చోటివ్వలేదంటూ రాజ్యాంగ ప్రతిని, అంబేడ్కర్ దిష్టి»ొమ్మలను తగలబెట్టిన చరిత్ర బీజేపీది’’ అని ఆరోపించారు. ఉభయ సభలు వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలన్నీ అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనకు దిగాయి. నేతలంతా నల్లజెండాలు, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.
రాహుల్‌గాం«దీ, ప్రియాంకతో పాటు తృణమూల్, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన (యూబీటీ), వామపక్షాల నేతలు పాల్గొన్నారు. వారితో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఇలాగే మాట్లాడితే దేశమంతటా అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఎవరైనా రాజ్యాంగంపై ప్రమా ణం చేసిన మీదటే కేంద్ర మంత్రి అవుతారు. రాజ్యాంగ నిర్మాతనే అవమానించే వారికి ఆ పదవిలో కొనసాగే అర్హతే లేదు’’ అన్నారు. ఆయన రాజీనామాకు విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయన్నారు. ‘‘అమిత్ షాపై మోదీ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. ఆప్తమిత్రులు ఒకరి పాపాలను ఒకరు కప్పిపుచ్చుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు.
మనువాదానికి తార్కాణం: రాహుల్ ‘‘మనువాదులకు అంబేడ్కర్ సహజంగానే నచ్చరు. అమిత్ షా వ్యాఖ్యలు దాన్ని మరోసారి నిరూపించాయి’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమే. అంబేడ్కర్ చరిత్రను, రాజ్యాంగ రచనలో ఆయన కృషిని తెరమరుగు చేసేందుకు ప్రయతి్నస్తోంది. కానీ బాబాసాహెబ్‌ను అవమానిస్తే దేశం సహించబోదు. అమిత్ షా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని స్పష్టం చేశారు. ప్రియాంక కూడా ఈ మేరకు ఎక్స్‌లో డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్‌ది చౌకబారుతనం: బీజేపీ
అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. ఇది ఆ పార్టీ చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, కిరెణ్ రిజిజు, అశ్వినీ వైష్ణవ్, రవ్‌నీత్ బిట్టూ తదితరులు మండిపడ్డారు. అంబేడ్కర్‌ను ఆయన జీవితపర్యంతమూ, తదనంతరమూ పథకం ప్రకారం అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. ‘‘దాన్నే అమిత్ షా రాజ్యసభ సాక్షిగా నిరూపించారు. దాన్ని తట్టుకోలేక ఆయనపై తప్పుడు ఆరోపణలకు దిగింది’’ అని రాజ్‌నాథ్ ఆరోపించారు. తీవ్ర నిస్పృహలో కూరుకుపోయిన కాంగ్రెస్ చివరికి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి దిగజారిందని నడ్డా ఎద్దేవా చేశారు.
బీజేపీ మనస్తత్వం బయటపడింది
పుణే: అమిత్ షా వ్యాఖ్యలను అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన అఘాడీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ ఖండించారు. బీజేపీ పాత మనస్తత్వం ఆయన మాటలతో బయటపడిందని అన్నారు. అంబేడ్కర్ పట్ల బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. ‘‘బీజేపీ మాతృసంస్థలు ఆర్‌ఎస్‌ఎస్, జన సంఘ్ అంబేడ్కర్‌ను వ్యతిరేకించాయి. రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో అంబేడ్కర్‌ను తప్పుబట్టాయి. అంబేడ్కర్ భావజాలం దేశంలో బలంగా ఉండటం వల్లే బీజేపీ తన పాత ప్రణాళికలు అమలు చేయడానికి జంకుతోంది. ఆ ఉక్రోషం కొద్దీ ఆయన పట్ల కోపాన్ని ఇలా వెళ్లగక్కుతోంది’’ అని ఆరోపించారు.
అట్టుడికిన రాజ్యసభ
షాపై హక్కుల తీర్మానం
సభలో టీఎంసీ నోటీసు
అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల తీర్మానం పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 187వ నిబంధన మేరకు టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ బుధవారం రాజ్యసభలో ఈ మేరకు నోటీసిచి్చనట్టు సమాచారం. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యుల నిరసనలతో సభ అట్టుడికింది. మంత్రి రాజీనామాకు సభ్యులంతా డిమాండ్ చేశారు. షా ప్రసంగంలో కేవలం 12 సెకన్ల భాగాన్నే ప్రచారం చేస్తూ కాంగ్రెస్ వక్రీకరిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. 1990 దాకా ఆయనకు భారతరత్న కూడా ఇవ్వని చరిత్ర ఆ పారీ్టదని ఎద్దేవా చేశారు.
అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నే అమిత్ షా నిండు సభలో ఎండగట్టారన్నారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. ‘అంబేడ్కర్‌కు అవమానాన్ని దేశం సహించబోదు’’ అంటూ పెద్దపెట్టున నినాదాలకు దిగారు. ఆయన్ను అవమానించింది కాంగ్రెసేనంటూ రిజిజు కౌంటరిచ్చారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి అంబేడ్కర్ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం రెండింటి దాకా చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కూడా అవే దృశ్యాలు కొనసాగడంతో సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. విపక్ష సభ్యులు అంబేడ్కర్ పోస్టర్లతో వెల్‌లోకి దూసుకెళ్లి ‘జై భీమ్’ అంటూ నినాదాలకు దిగారు. దాంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా, తర్వాత గురువారానికి వాయిదా పడింది.
ముసుగు తొలగింది
‘‘మొత్తానికి ముసుగు తొలగింది. రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ రాజ్యాంగ నిర్మాతనే అమిత్ షా అవమానించారు. ఆయన వ్యాఖ్య లు బీజేపీ కులవాదానికి, దళిత వ్యతిరేక భావజాలానికి నిదర్శనం. 240 లోక్‌సభ సీట్లొస్తేనే ఇలా ప్రవర్తిస్తున్నారు. అదే 400 వస్తే అంబేడ్కర్ స్మృతులనే పూర్తిగా చెరిపేస్తూ చరిత్రను తిరగరాసేవాళ్లేమో!’’
– తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
అంబేడ్కర్ పేరే జపిస్తాం
‘‘పాపాలు చేసేవాళ్లే పుణ్యం కోసం ఆలోచిస్తారు. దేశం, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి తపించేవాళ్లు అంబేడ్కర్ నామాన్నే జపిస్తారు’’
– డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
దొందూ దొందే
‘‘బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. అంబేడ్కర్ పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. దళితులకు, అణగారిన వర్గాలకు అవి చేసిందేమీ లేదు’’
– బీఎస్పీ అధినేత్రి మాయావతి
Comments
Please login to add a commentAdd a comment