
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో.. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన ఆరోపణలు చేయగా.. బీజేపీ అంతే ధీటుగా బదులిచ్చింది. బలవంతంగా హిందీ భాషను రుద్ది.. స్థానిక భాషలను కనుమరుగయ్యే స్థాయికి చేర్చారంటూ ఆరోపిస్తున్నారాయన.
సోదరీసోదరీమణుల్లారా.. గత 100 సంవత్సరాల్లో ఎన్ని భాషలను హిందీ మింగేసిందో తెలుసా? భోజ్‌పురి, మైథిలీ, అవాదీ, బ్రజ్, బుంధేలీ, ఖుమావోని, మఘాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌ఘడీ, అంగిక, సంతాలి, హో, ఖారియా, ఖోర్థా, కుర్మాలీ, ముండారీ, కురుఖ్.. ఇలా పాతికకుపైగా నాశనం చేసింది. ఇంకోన్ని భాషలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి.

ఏకపక్షంగా హిందీని రాష్ట్రాలపై రుద్దేయాలన్న నిర్ణయం.. పురాతన భాషలను తుడిచి పెట్టేస్తోంది. ఉత్తర ప్రదేశ్, బీహార్‌లు హిందీకి గుండెకాయలు అని చెబుతుంటారు. కానీ, ఆ రాష్ట్రాల్లో అసలైన భాషలు అంతరించే స్థితికి చేరుకున్నాయి అని స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీ అమలు విషయంలో తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని.. కేవలం 2026 ఎన్నికల్లో లాభం కోసమే పాకులాడుతున్నాయని కేంద్రం డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతోంది. అయితే స్టాలిన్ ఈ విమర్శలను కూడా తిప్పికొట్టారు. తమిళనాడుకు మాత్రం ఆ నిర్ణయం(NEP) ఏవైపు దారి తీస్తుందో తెలుసని, అందుకే అమలు చేయబోమంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన.
My dear sisters and brothers from other states,
Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9— M.K.Stalin (@mkstalin) February 27, 2025
ఇదిలా ఉంటే.. స్టాలిన్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆయన(Stalin) వాదన అసంబద్ధంగా(Silly)గా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తొలుత జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని తమిళనాడు కూడా అంగీకరించిందని, ఆపై రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకుందని మండిపడ్డారాయన. ఇక.. ఎన్‌ఈపీ అమలుకు సన్నద్ధంగా లేకపోవడం వల్లే తమిళనాడుకు వచ్చే రూ. 2,400 కోట్ల ఫండ్‌ను కేంద్రం ఆపేసిందన్న ఆరోపణలనూ మంత్రి ధర్మేంద్ర తోసిపుచ్చారు. ఎన్‌ఈపీ ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన భాషలను అమలు చేసే అవకాశం ఉందని, కానీ తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
హిందీ భాష అమలు విషయంలో కేంద్రం గనుక తమ రాష్ట్రంపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే.. మరో భాషా యద్ధానికి(Language War) సిద్ధమంటూ సీఎం స్టాలిన్, ఆయన తనయుడు.. డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..
అప్పటి నుంచే అనుమానాలు
భారత రాజ్యాంగం ప్రకారం 15 ఏళ్లపాటు హిందీతో పాటు ఇంగ్లీష్‌ను అధికారిక ఉత్తర్వుల కోసం వినియోగించాలని కానిస్టిట్యూట్ అసెంబ్లీ నిర్ణయించింది. దీని ప్రకారం.. జనవరి 26, 1950 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే 1965లో ఆ గడువు పూర్తి కావడంతో.. హిందీయేతర రాష్ట్రాలు ఆందోళన బాట పట్టాయి. బలవంతంగా తమ రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేస్తారేమో అని ఉద్యమాలు మొదలుపెట్టాయి.
తమిళ సంప్రదాయాలతో పాటు భాషప్రతిపాదికన మద్రాస్ గడ్డపై ద్రవిడ ఉద్యమం జరిగింది. అలాంటి చోట హిందీ భాష ప్రవేశపెట్టడంపై దశాబ్దాల నుంచే వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. 1965లో తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో భారీ హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అది హింసాత్మక మలుపు తీసుకుంది. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ను తమిళనాడులో అధికార పీఠం నుంచి దించేయడానికి ఓ కారణమైంది.

తమిళనాడులో రెండు భాషలే..
సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని తొలి డీఎంకే ప్రభుత్వం.. 1968లో తమిళనాడు కోసం ఓ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే బోధించాలని ఉంది. అయితే అదే సమయంలో ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కొఠారి కమిషన్(1964-66) నివేదిక ఆధారంగా తొలిసారి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. సమాన విద్యావకాశాలను ప్రొత్సహించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా మూడు భాషల ఫార్ములాను ప్రవేశపెట్టాలని సదరు కమిషన్ సూచించింది. దీని ప్రకారం.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలను సూచించింది. అయితే ఆ టైంలోనూ హిందీ తప్పనిసరి కాదని కేంద్రం చెప్పినా.. ఆ విద్యావిధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది.
👉1968లో ఇందిరా గాంధీ హయాంలో మొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 14 ఏళ్లలోపు వారికి తప్పనిసరి విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాలపై అవగాహన ద్వారా ఆర్థిక అభివృద్ధి, సమాన విద్యావకాశాలు, టీచర్లకు శిక్షణ.. ఇతర అంశాలతో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో మూడు భాషల విధానం తీసుకొచ్చింది కేంద్రం.

👉ఇక.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మరోసారి ఎన్‌ఈపీ తెరపైకి వచ్చింది. ఈసారి మూడు భాషల అంశం లేకుండా.. కేవలం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అన్ని వయసుల వారికి విద్యను అందించడం మీదనే ఫోకస్ చేసింది.
👉ముచ్చటగా మూడోసారి.. పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టారు. అయితే.. 1986 ఎన్‌ఈపీకే కొన్ని మార్పులుచేర్పులు చేశారు. సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై ఆయన దృష్టిసారించారు.
ఇక.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో.. 2020, జులై 29వ తేదీన జాతీయ విద్యా విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 1986 జాతీయ విద్యా విధానాన్ని(ఇప్పుడు అమల్లో ఉన్నదే) సమూలంగా మార్చేసింది. జులై 29, 2020లో అప్పటి కేబినెట్ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 10+2గా ఉన్న బేసిక్ అకడమిక్ వ్యవస్థను.. 5+3+3+4గా మార్పు చేయడంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ఎన్‌ఈపీ ప్రకారం.. మూడు లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో హిందీ కూడా ఉంది.

కానీ.. ఇది బలవంతపు నిర్ణయం కాదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. రాష్ట్రాలు, రీజియన్‌లు, విద్యార్థులు తమకు నచ్చి భాషలను ఎంచుకునే వీలు ఉంటుందని చెబుతూ వస్తోంది. అయితే ఇది తమ మాతృభాషకు దొడ్డిదారిన ముప్పు కలిగించే ప్రయత్నమేనని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయబోమని చెబుతోంది. ఇక 2026లో ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment