
చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్‌పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తమిళ భాషను పెరియార్ అవమానించారంటూ సీతారామన్ నిజంగా బాధపడుతున్నారా?అని ప్రశ్నించిన ఆయన.. అదే నిజమైతే తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేయకుండా ఆపాలని ఆమెకు సూచించారు.
పెరియార్ తన కాలానికి మించిన ఆలోచనలతో సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. అందుకే ఇప్పటికీ ఇక్కడి ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ పెరియార్‌ను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోంది. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అని విజయ్ మండిపడ్డారు.
నిర్మలమ్మ ఏమన్నారంటే..
జాతీయ విద్యా విధానం త్రిభాషా నిబంధనపై తమిళనాడు వర్సెస్ కేంద్రంగా విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. తమిళ భాషను అవమానించిన వ్యక్తిని(పెరియార్‌ను ఉద్దేశించి..) దేవుడిగా చూసే విధానం సరికాదని.. ఆయన్ని గౌరవించడం డీఎంకే పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. తమిళ భాషను తక్కువ అంచనా వేసిన వ్యక్తిని(పెరియార్‌ను ఉద్దేశించి..) తమ నాయకుడిగా కొనియాడడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
విజయ్ ఏమన్నారంటే..
నిజంగా తమిళ భాషపై పెరియార్ చేసిన వ్యాఖ్యలు నిర్మలా సీతారామన్‌కు సమస్యగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో మూడు భాషల విధానాన్ని ప్రయోగించడాన్ని ఆపాలని డిమాండ్ చేయాలి. ఇది తమిళ ప్రజలకు తగిన విధంగా ప్రభుత్వ విధానాలను అమలు చేయడం అనే విషయాన్ని ఆమె గుర్తించాలి. పెరియార్ ఇప్పటికీ తమిళ ప్రజల గుండెల్లో ఉన్నారు. అందుకే ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఇలాంటి చర్చలు జరుగుతుంటాయని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment