ఫలించని మరాఠా యోధుడి చాణక్యం
అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకే పరిమితం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) ఘోర పరాజయం పాలైంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఆ పార్టీ పొత్తులో భాగంగా 86 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 10 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ చీలిక వర్గం ఎన్సీపీ(అజిత్‌పవార్) 59 స్థానాల్లో పోటీచేసింది. 41 స్థానాల్లో విజయం సాధించింది. శరద్ పవార్‌కు కంచుకోట అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో అజిత్ పవార్ జయకేతనం ఎగురవేశారు.
ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థిగా పోటీ చేసిన శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ ఓడిపోయాడు. ఐదు నెలల క్రితం ఇదే బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే విజయం సాధించారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఆమె ఓడించారు. లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లలో పోటీ చేసిన శరద్ పవార్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది.
ఇకపై ఎన్నికలకు దూరం
శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గత ఏడాది జూలైలో ఎన్సీపీని చీల్చారు. బీజేపీ–శివసేన(షిండే) కూటమితో చేతులు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. అసలైన ఎన్సీపీ తమదేనంటూ శరద్ పవార్ చేసిన పోరాటం ఫలించలేదు. పార్టీని, పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్‌కే కేటాయించింది.
కుట్రదారులను ఓడించాలంటూ శరద్ పవార్ చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ప్రజలు మన్నించలేదు. 57 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో శరద్ పవార్ బారామతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనుంది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించారు.
కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడంలో శరద్ పవార్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ‘ఇండియా’కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర. కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్)ని తమ కూటమిలోకి తీసుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకు గాను ఎంవీఏ ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తగిన ప్రభావం చూపలేక చతికిలపడింది. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన శరద్ పవార్ చాణక్యం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో 54 సీట్లు గెలుచుకున్న శరద్ పవార్ ఈసారి 10 సీట్లకే పరిమితమయ్యారు.
సోనియాతో విభేదించి కాంగ్రెస్‌తో పొత్తు
1940 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బారామతిలో జని్మంచిన శదర్ పవార్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ శిష్యుడిగా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 1967లో 27 ఏళ్ల వయసులోనే తొలిసారి బారామతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి జనతా పారీ్టతో పొత్తు పెట్టుకున్నారు. పవార్ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు.
1986లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రి, రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కీలకమైన రక్షణ, వ్యవసాయ శాఖలు ఆయన లభించాయి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ విదేశీయురాలు అని విమర్శిస్తూ 1999లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ)ని స్థాపించారు. తర్వాత అదే కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి కొనసాగింది. తాజా ఎన్నికల్లో శరద్ పవార్ దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ శకం ఇక ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment