తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దేవేంద్ర కోటే
మహేశ్ కొటే ఆశలు గల్లంతు
ఎమ్మెల్యే కల చెదిరి.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి
సోలాపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరి కలలు నెరవేరగా.. అనేకమంది వైఫల్యాలను చవిచూశారు. కోటే కుటుంబానికి చెందిన మహేశ్ కోటే, ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకే కుటుంబం తరఫున ఇరువురు అందులో తెలుగువారు శాసనసభ్యులు అయ్యే కల నెరవేరుతోందని వారి అనుచరులు భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న మహేశ్ కోటే కల చెదిరిపోగా.. ఆయన తమ్ముడు కొడుకు దేవేంద్ర ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు.
పట్టణంలో పేరు గాంచిన కోటే కుటుంబం కాంగ్రెస్‌కు, ముఖ్యంగా సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ శిందేకు విధేయులుగా గుర్తింపు పొందింది. సుశీల్ కుమార్ శిందే ఎన్నికల్లో విజయం సాధించడంలో, రాజకీయ ఆధిపత్యం అంతా దివంగత విష్ణు పంతు కోటే ఎన్నికల వ్యూహంలో ప్రధానపాత్ర పోషించేవారు. అయితే సుశీల్ కుమార్ శిందే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఇక్కడి ఎంపీ టికెట్ విష్ణు పంతు కోటేకు వస్తుందని అంతా భావించారు. అయితే విష్ణు పంతుకోటేకు మాత్రం అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009లో సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణు పంత్ కుమారుడైన మహేశ్ కోటేకు కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థత్వం లభించింది. అయితే అప్పటి మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన వ్యక్తి రెబల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మహేశ్ కోటే ఎన్నికల్లో పరాభవం చెందారు. తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే తన ఎమ్మెల్యే కల నెరవేరదని తెలుసుకున్న మాజీ మేయర్ మహేశ్ కోటే శివసేనలో చేరారు.
సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో శివసేన తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు తీరా సమయంలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన మూడో స్థానంలో నిలిచారు. గత మూడు ఎన్నికలలో పరాభవం చవిచూసిన మహేశ్ కోటే గత సంవత్సరం కిందట శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టిగా సన్నాహాలు చేసుకున్నారు. మహా వికాస్ అఘాడీకి చెందిన నేతలు అందరూ ఈ ఎన్నికల్లో మహేశ్‌కు వెన్నంటి ఉండి ప్రచారాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయనే సోలాపూర్ నార్త్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి పరాభవం చెందారు.
మరోవైపు ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలో దూకుడుగా ప్రసంగించడం ద్వారా కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఆ తర్వాత కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీలో క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధిష్టానం దృష్టిలో పడి అభ్యరి్థత్వాన్ని పొందారు. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెలుగువాడిగా రికార్డు సృష్టించారు.
ఇదీ చదవండి: మహాయుతి గెలుపులో ‘లాడ్‌కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు!
Comments
Please login to add a commentAdd a comment