
దౌత్యానికే నా మొదటి ప్రాధాన్యం
ఆర్మీ మాజీ చీఫ్ నరవణె వ్యాఖ్యలు
పుణె: యుద్ధం, పర్యవసానాలపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధమంటే సరదా కాదు, బాలీవుడ్ సినిమా అంతకంటే కాదు’అని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం నిలిచిపోవడంపై కొందరు చేస్తున్న విమర్శలకు ఆయనీ మేరకు బదులిచ్చారు. ఆదివారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో నరవణె మాట్లాడారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర శిబిరాలు, సైనిక మౌలిక వనరులపై భారత ఆర్మీ దాడులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు వైమానిక దాడులు, సరిహద్దుల్లో కాల్పులతో వారం పాటు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సాగాయని ఆయన తెలిపారు. ‘అనంతరం సైనిక దాడులకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు రెండు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇది మిలిటరీ ఆపరేషన్‌కు విరామమే తప్ప, కాల్పుల విరమణ వంటిది మాత్రం కాదని మరోసారి నేను చెప్పాలనుకుంటున్నా.
వచ్చే మరికొన్ని రోజుల్లో పరిణామాలు ఎలా మలుపులు తిరుగాయో మీరే చూడండి’అని ఆయన పేర్కొన్నారు. సైనిక దాడులను నిలిపివేయడం మంచిది కాదంటూ కొందరు చేస్తున్న వాదనపై మాట్లాడుతూ ‘యుద్ధంతో కలిగే వ్యయం అంకెలు, గణాంకాలను పరిశీలించండి. ఈ నష్టం మరీ ఎక్కువ కాకముందే, పూడ్చలేనంతగా మారడానికి ముందే యుద్ధాన్ని ఆపేయాలని తెలివైన వారెవరైనా అనుకుంటారు’అని చెప్పారు.
దాడుల ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మాత్రమే కాదు, వైమానిక స్థావరాల్లోని మౌలిక సౌకర్యాలకు సైతం తీవ్రంగా నష్టం కలిగించాం. వైఖరి మారకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని పాక్ గ్రహించేలా చేయగలిగామని భావిస్తున్నాను. అందుకే పాక్ ఆర్మీ చేసేదిలేక కాల్పుల విరమణ కోసం మన ఆర్మీతో సంప్రదింపుల బేరానికి వచి్చంది’అని ఆర్మీ మాజీ చీఫ్ వివరించారు.
రక్షణ వ్యయం కూడా పెట్టుబడే
‘అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి దేశాలు రక్షణ కోసం ఎంత ఖర్చు చేయగలవు? రోజూ టీవీల్లో చూసే సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలా? విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, పారిశుధ్యం, ఇంకా ఇతర చాలా ముఖ్యమైన అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలా?అని ఆయన ప్రశ్నించారు. ‘మన బడ్జెట్‌లో రక్షణ రంగం వాటా 15 శాతం వరకు ఉంటోంది.
ఇదీ ఒక రకమైన పెట్టుబడే. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇలాంటి బ్యాకప్ ప్లాన్ అవసరం. గతవారం ఆపరేషన్ సిందూర్‌తో అటువంటి ప్రణాళిక మనకు ఉందనే విషయం స్పష్టమైంది. రక్షణ బలగాలు సర్వ సన్నద్ధంగా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మనపై దాడి చేయాలనుకునే వాళ్లు ఒకట్రెండు సార్లు ఆలోచిస్తారు’అని ఆర్మీ మాజీ చీఫ్ నరవణె వివరించారు.
యుద్ధం చివరి అస్త్రం
ఆదేశాలొస్తే వెంటనే కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నానన్న నరవణె..ఈ విషయంలో తన మొట్ట మొదటి ప్రాధాన్యం దౌత్యానికే ఉంటుందన్నారు. ‘ఇతర దేశాలతో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలే తప్ప, యుద్ధానికి వెళ్లరాదు, హింస పరిష్కారం కాదు’అని కుండబద్దలు కొట్టారు. ‘యుద్ధం ఆషామాషీ కాదు. మన బాలీవుడ్ సినిమా కాదు. చాలా సీరియస్ వ్యవహారం. చిట్టచివరి అవకాశం లేక అస్త్రంగా మాత్రమే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది యుద్ధాల శకం కాదని మన ప్రధాని మోదీ చెప్పింది ఇందుకే. కొందరు మూర్ఖులు యుద్ధాన్ని మనపై రుద్దారు. యుద్ధంపై మనం ఉత్సాహం చూపరాదు’అని ఆయన అన్నారు.
సామాజిక కోణం మరువరాదు
యుద్ధంతో వాటిల్లే నష్టాల్లో సామాజికపరమైన కోణం కూడా ఉందన్న జనరల్ నరవణే..‘ఇతరత్రా నష్టాలతోపాటు యుద్ధంతో ప్రాణ నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారులుంటారు. ఇటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. సన్నిహితులను కోల్పోయిన వారిని ఆ ఆవేదన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధ దృశ్యాలను దగ్గర్నుంచి చూసేవారు పీటీఎస్‌డీ అనే మానసిక రుగ్మత బారినపడతారు. దీన్నుంచి బయటపడేందుకు కనీసం 20 ఏళ్లపాటు వీరికి చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది’అని వివరించారు.