ముంబై, ఢిల్లీల్లో ఘనంగా శరద్‌పవార్ జన్మదిన వేడుకలు
ప్రధానీ మోదీ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
ఢిల్లీలోని పవార్ నివాసానికి సపరివారంగా తరలివెళ్లిన అజిత్‌పవార్
పార్టీల్లో చీలిక తరువాత తొలిసారిగా ఇద్దరు నేతల కలయిక
35 నిమిషాలపాటు భేటీ..రాజకీయవర్గాల్లో పలు ఊహాగానాలు
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
స్వయంగా కలిసి..శుభాకాంక్షలు
శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి.
మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్
అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్‌ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా.....
తల్లినుంచే రాజకీయ వారసత్వం
పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్‌బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు.
బారామతి ఎంపీగా ఏడు సార్లు...
శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
కేంద్రరాజకీయాల్లోకి...
పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు...
ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్‌పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్‌పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు.
50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో..
మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు.
రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
Comments
Please login to add a commentAdd a comment