పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలన్న అజిత్ తల్లి
పవార్ ఫ్యామిలీ ఒక్కటైతే సంతోషిస్తామన్నఎన్సీపీ నేతలు
శరద్ పవార్‌ను ఎల్లప్పుడూ గౌరవిస్తామని వెల్లడి
పవార్ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. కుటుంబ పెద్ద అయిన శరద్ పవార్‌పై 2023, జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పవార్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి శివసేన-బీజేపీ మహాయుతి సర్కారు పంచన చేరి పెద్దాయన పెద్ద షాకే ఇచ్చారు అజిత్ పవార్. అప్పటి నుంచి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.
కలిసిపోవాలని కోరుకున్నా
తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంతరాలు సమసిపోయి పవార్ కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చేలా కటాక్షించాలని విఠలేశుడిని కోరుకున్నట్టు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోవాలని.. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకున్నాను. నా ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నాన’ని ఆశా పవార్ అన్నారు.
పెద్దాయన అంటే చాలా గౌరవం
పవార్ ఫ్యామిలీ ఏకతాటిపైకి వస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ పెద్దాయన అంటే అజిత్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. ‘శరద్ పవార్ మాకు తండ్రి లాంటివారు. భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ ఆయనను గొప్పగా గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా సంతోషిస్తాం. నన్ను నేను పవార్ కుటుంబంలో భాగమని భావిస్తున్నాన’ని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.
అప్పుడు చాలా బాధపడ్డాం
ఎన్సీపీ మరో సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే పార్టీకి, కార్యకర్తలకు మేలు జరుగుతుందని అన్నారు. శరద్ పవార్‌ను తాము చాలా గౌరవిస్తామని, పార్టీ చీలిపోయినందుకు బాధపడ్డామని ఆయన తెలిపారు.
పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..
శరద్, అజిత్ మళ్లీ చేతులు కలుపుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆశా పవార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. మరో సంఘటన కూడా ఈ ప్రచారానికి ఊతంగా నిలిచింది. పార్టీని చీల్చిన తర్వాత తనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పెద్దాయనను అజిత్ గత డిసెంబర్ నెలలో కలవడంతో ఈ ప్రచారం మొదలయింది. పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో ఉన్న శరద్ పవార్‌ను డిసెంబర్ 12న అజిత్ కుటుంబ సమేతంగా కలిశారు. పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే అరగంట పాటు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు నడిచాయని, త్వరలోనే పవార్ ఫ్యామిలీ కలిసిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అజిత్ తోసిపుచ్చారు. కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని వివరణ ఇచ్చారు.
చదవండి: ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
మళ్లీ ఒక్కటవుతారా?
ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ భంగపాటు ఎదురైంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అజిత్ సత్తా చాటారు. ఆయన పార్టీకి 41 స్థానాల్లో విజయం సాధించగా, శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. మహాయుతి సంకీర్ణ సర్కారులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు రాష్ట్ర కేబినెట్‌లో మొత్తం 9 మంత్రి పదవులు దక్కించుకుని అజిత్ మరింత పవర్‌ఫుల్ అయ్యారు. అటు కేంద్రం, అటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియడంతో అజిత్, శరద్ మధ్య సయోధ్య వాతావరణం నెలకొంది. అజిత్ కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ తల్లి కూడా పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించడంతో మళ్లీ చర్చ మొదలయింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment