ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మహాయుతి కూటమికి..ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం అడగులు వెనక్కి పడుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శుక్రవారం ముంబైలో జరగాల్సిన ఎన్డీయే కూటమి కీలక సమావేశం రద్దైంది.
రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేడు సతారాలోని తన గ్రామానికి వెళ్లడంతో ఈ భేటీ రద్దైంది. ఆయన తిరిగొచ్చాక సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశంలో తదుపరి సీఎం అంశంపై కూటమి నేతలు చర్చించనున్నారు. అయితే ఇలా ఉన్నట్టుండి షిండే ఆకస్మిక ప్రణాళికతో ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
కూటమిలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. కొన్ని మంత్రి పదవుల కేటాయింపు విషయంలో మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. గతంలో మాదిరి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, షిండేలు డిప్యూటీలుగా పదవులు చేపట్టడం దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తుంది.
కానీ షిండే డిప్యూటీ పదవిపై సంతృప్తి చెందనట్లు సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ..‘ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి తగదు. ఇదివరకే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అది సరికాదు’ అని అన్నారు.
ఇక కేబినెట్‌లో బీజేపీకి 22 బెర్త్‌లు, శివసేనకు 12, ఎన్‌సీపీకి 9 పోర్ట్‌ఫోలియోలు దక్కే అవకాశం ఉంది. కీలక హోంశాఖను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. షిండేకు చెందిన శివసేనకు పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలు.. ఎన్సీపీకి ఆర్థిక శాఖను కేటాయించే ఛాన్స్ ఉంది. డిసెంబరు 2న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
కాగా ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్, సీఎం పదవిపై చర్చిందేందుకు మూడు పార్టీలకు చెందిన నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే గురువారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం షిండే మాట్లాడుతూ.. కేంద్రమంత్రితో చర్చలు సానుకూలంగా జరిగినట్లు పేర్కొన్నారు.,
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై రాష్ట్ర రాజధానిలో జరిగే మహాయుతి కూటమి మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాను అడ్డంకి కానని, ప్రధాని నరేంద్ర మోదీ, షా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన విలేకరులతో అన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 మంది సభ్యుల సభలో 230 సీట్లను గెలుచుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ 132 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగా, శివసేన 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment