వివిధ పార్టీల తరపున కుటుంబసభ్యులు, దగ్గరి బంధువుల పోటీ
అత్యధిక అభ్యర్థుల గెలుపు , కొద్దిమంది మాత్రమే ఓటమి
ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఊరట
కొద్దిమందికి మంత్రివర్గంలోనూ చోటు దక్కే అవకాశం
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.
అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బారామతిలో మామా అల్లుళ్ల పోటీ
కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్‌ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ తనయుడు సలిల్ దేశ్‌ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్‌ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు.
అనీల్ దేశ్‌ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్‌గావ్‌లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్‌లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు.
ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్‌లో ఎస్పీ వర్గం టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు.
బోకర్‌లో తండ్రిపై కుమార్తె విజయం
గడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్‌బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్‌గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్‌రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు.
మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు.
చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?
కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్‌కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్‌కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది.
ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్‌నాథ్ శిందే వర్గం టికెట్‌పై పోటీచేసిన రావ్‌సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రావ్‌సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.
తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక
మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్‌నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment