ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కోసం రైతుల పడిగాపులు
పత్తి విత్తనాల కోసం రైతుల అగచాట్లు
సీజన్ మొదలయ్యే దాకా ఏమాత్రం పట్టించుకోని వ్యవసాయశాఖ
అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం.. ఇంకా సేకరణలోనే అధికారులు
నల్లబజారుకు బ్రాండెడ్, నాణ్యమైన విత్తనాలు.. రెండింతల ధరకు విక్రయాలు
కొన్నిచోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు
అనుమతి లేని బీటీ–3 విత్తన విక్రయాలు కూడా..
వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు.. తూతూమంత్రంగా దాడులు
ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపంతోనూ సమస్య!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి.
అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో..
శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.
కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు.
నిషేధిత విత్తనాలు అంటగడుతూ..
కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటివరకు సగం వరకు సరఫరా..
నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు.
ఇంకా సేకరణలోనే యంత్రాంగం..
రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు.
ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో..
వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి..
⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు.
⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు.
⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి.
⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు.
⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు.
⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
యూఎస్ 7067 రకం లేవంటున్నారు
యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా
పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment