విత్తనాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే పీడీయాక్ట్‌ | CS Shanti Kumari issued instructions to the District Collectors | Sakshi
Sakshi News home page

విత్తనాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే పీడీయాక్ట్‌

Published Fri, May 31 2024 4:57 AM | Last Updated on Fri, May 31 2024 4:57 AM

CS Shanti Kumari issued instructions to the District Collectors

జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ శాంతి కుమారి 

సాక్షి, హైదరాబాద్‌: విత్తనాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్‌ 2వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీఏడీ, వ్యవసాయ శాఖల కార్యదర్శి రఘునందన్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 సీఎస్‌ మాట్లాడుతూ వానాకాలానికి సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తనాల విషయంలో ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధిక డిమాండ్‌ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్‌ విత్తనాలు సరిపడా ఉన్నాయని వివరించారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనికీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనితోపాటు, గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

జిల్లా కలెక్టర్లతో పతాకావిష్కరణ
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ రెండవ తేదీన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లో కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించాలని సీఎస్‌ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ కోసం అమరులైన వారికి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమ కారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement