unauthorized
-
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా -
అనధికారిక ఫారెక్స్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచాలి..
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్‌ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్‌లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు. -
కేఆర్ఐపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: అనధికార పెట్టుబడి సలహాలు ఇస్తున్న కారణంగా నాలెడ్జ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(కేఆర్ఐ)తోపాటు సంస్థ యజమాని ఆయుష్ ఝవార్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కన్నెర్ర చేసింది. ఆరు నెలలపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. కేఆర్ఐ, ఆయుష్లకు సెబీ 2021 జులైలో షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తదుపరి తాజా ఆదేశాలు జారీ చేసింది. సెబీ నుంచి సర్టిఫికెట్ పొందకుండానే కేఆర్ఐ, ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సర్వీసులను అందించడం ద్వారా అడ్వయిజరీ నిబంధనలను అతిక్రమించాయి. దీంతో సెబీ తాజా చర్యలను చేపట్టింది. సలహాల ద్వారా ఫీజు రూపేణా ఆర్జించిన రూ. 27.57 లక్షలను 3 నెలల్లోగా వాపస్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. -
కారుణ్యమూర్తి
అది దేశరాజధాని నగరం ఢిల్లీలో ఓ చిన్న కాలనీ. పేరు ఆనంద్ పర్బత్ కాలనీ. మొత్తం 52 కుటుంబాలు నివసిస్తాయి. సమాజం నుంచి అనధికార వెలివేతకు గురయిన కుటుంబాలే అవన్నీ. తమ ప్రమేయం లేకనే వివక్షను ఎదుర్కొంటున్న జీవితాలవి. ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాధ. అందుకు అనిత జీవితమే ఓ ఉదాహరణ. పని ఎవరిస్తారు? అనిత సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది. ఇంటి పనులు, వంట చేసి పెడుతుంది. ముగ్గురు పిల్లలను నిద్రలేపి తాను ఎనిమిదన్నరకంతా బయటపడుతుంది. రోజూ ఇదే ఆమె దినచర్య. ఆమె డ్యూటీకి వెళ్లినట్లు ఆ వెళ్లడం ఉద్యోగానికి కాదు, రోడ్డు సిగ్నళ్ల దగ్గర యాచన కోసం. దీనమైన ఆమె ముఖం చూసి ఒక రూపాయి ఇచ్చే వాళ్లు ముఖం చిట్లించి ‘పని చేసుకోవచ్చు కదా! ఒళ్లు వంచి పని చేయాలనుకుంటే స్వీపర్ ఉద్యోగం వంటిదేదో రాకపోతుందా’ అని చిరాకు పడుతుంటారు. ‘ఆ పని కూడా ఎవరూ ఇవ్వకపోవడం వల్లనే ఇలా’ అంటూ ఒంటి మీద మచ్చలను చూపిస్తుంది అనిత. ‘చెప్పండి... నాకు పని ఎవరిస్తారు?’ అని అడుగుతుంది దీనంగా. ‘సిగ్నళ్ల దగ్గర రోజంతా యాచిస్తే ఎంత వస్తుంది’ ఎవరో అడుగుతారు కొంత సానుభూతితో. ‘వంద రూపాయలు వచ్చిన రోజు నలుగురమూ కడుపు నిండా తింటాం’ అని ఆవేదనగా చెబుతుంది అనిత. ఆమె ఇంకా చాలా చెప్తోంది... పాదాలరిగిపోయాయి! ‘‘మా లాంటి వాళ్ల కోసం ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందట. కానీ మా పేర్లు రాసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులెవరూ రారు. మేమే పెన్షన్ కోసం అప్లయ్ చేయడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అంటరాని వారిని చూసినట్లు చూస్తారు. అలా చూసినా సరే... చీదరతోనైనా త్వరగా పని చేసి పంపించేస్తారా అంటే అదీ ఉండదు. తిరిగి తిరిగి మా కాళ్లరిగిపోతాయి. అసలే అనారోగ్యంతో అరిగిపోయిన పాదాలు మావి. వయసు మీరిన వాళ్లకయితే వేళ్లు కూడా ఊడిపోయి ఉంటాయి. వేళ్లు ఊడిపోయిన చేతులతో దణ్ణం పెట్టి వేడుకున్నా సరే... కనికరించాలనే కరుణ ఉండదు. రోజులు లెక్కపెట్టుకుంటన్న మా బతుకులకు ఆసరాగా ఉంటోంది జయ దీదీ. మా బతుకుల్లో కొండంత అండగా ఉంది’’ అని చెబుతోంది అనిత. వేరే బెంచీ! ‘లెప్రసీ వ్యాధిగ్రస్థులను మాత్రమే కాదు, ఆ ఇంట్లో వాళ్లను కూడా సమాజం చూపులతోనే దూరం పెట్టేస్తుంది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే లెప్రసీ బాధితుల కోసం పని చేయడానికి ముందుకు వచ్చా’నని చెప్పింది జయారెడ్డి. ‘‘నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మానాన్నలకు ఈ వ్యాధి సోకింది. గాయాలకు డ్రెస్సింగ్ చేసుకోవడం లో వాళ్లకు సహాయం చేసేదాన్ని. మా పేరెంట్స్ తరచూ హాస్పిటల్‌కు వెళ్లాల్సి రావడం గురించి మా టీచర్‌కు తెలిసిన తర్వాత ఆమె నన్ను క్లాసులో అందరితో కలిసి కూర్చోనివ్వలేదు. నాకు వేరే బెంచీ, ఆ బెంచీ మీద మరెవరూ కూర్చోరు. మా పేరెంట్స్‌ను తాకిన నా నుంచి బ్యాక్టీరియా క్యారీ అవుతుందని, నాతో ఆడుకుంటే, నాకు దగ్గరగా మసలితే మిగిలిన వాళ్లకూ సోకుతుందనే అపోహతోనే నన్ను వెలివేశారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడంతో మా పేరెంట్స్ కోలుకున్నారు. లెప్రసీ వ్యాధిగ్రస్తుడికి మందులు అందిస్తున్న జయారెడ్డి కానీ ఆ తర్వాత మా నాన్న ఈ వ్యాధిగ్రస్థుల కోసం పని చేయడానికే తన జీవితాన్ని అంకితం చేశారు. వీళ్లకు పెన్షన్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి సాధించేవారు. హాస్పిటల్లో మందులిచ్చే సమయం తెలుసుకుని పేషెంట్లను తీసుకుని వెళ్లడం, వాళ్లను ఓ చెట్టుకింద కూర్చోబెట్టి ఆయన క్యూలో నిలబడి మందులు తీసుకునేవారు. అలా ఓ పదేళ్లపాటు పని చేసిన తర్వాత ఆయన కాలం చేశారు. ఆయన పోయి ఇరవై ఏళ్లయింది. నాన్న వదిలిన పనిని నేను అందుకున్నాను. నేను ఈ కాలనీ వాసులతో చొరవగా మెలగడాన్ని గమనించిన ఓ ఎన్జీవో నన్ను గౌరవవేతనంతో వాలంటీర్‌గా చేర్చుకుంది. లెప్రసీని పారదోలడానికి ఓ తపస్సు జరుగుతోంది. కానీ అది ఇంకా పూర్తికాలేదు. సరైన వైద్యంతో మామూలు మనుషులైన వాళ్లకు స్వయం ఉపాధి కల్పిస్తే సమాజంలో గౌరవంగా జీవించగలుగుతారనేది నా ఆశ. ఆ రోజు ఎప్పుడు వస్తుందో...’’ అని అర్ధోక్తిలో ఆగిపోయిందామె. ఇది 21వ శతాబ్దం... లెప్రసీపై పోరాటం ఇంకా ముగిసిపోకపోవడం నిజంగా దురదృష్టకరం. -
అనధికార ఫ్లాట్‌ఫామ్స్‌పై ఫారెక్స్ ట్రేడింగ్ వద్దు..ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికార ఎలక్ట్రానిక్ ఫ్లాట్‌ఫామ్స్‌పై విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) ట్రేడింగ్ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం (ఫెమా) కింద జరిమానాలు పడే అవకాశం ఉందని కూడా సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజన్లు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ యాప్ తదితర ఫ్లాట్‌ఫామ్స్‌పై భారతీయ నివాసితులకు ఫారెక్స్ ట్రేడింగ్ సౌకర్యాలను అందిస్తామంటూ వస్తున్న తప్పుదోవ పట్టించే అనధికార ఈటీపీల ప్రకటనలను ఆర్బీఐ గమనిస్తున్నట్లు తెలిపింది. అనుమతించబడిన ఫారెక్స్ లావాదేవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆర్బీఐ లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా) అధికారిక ఈటీపీల మాత్రమే నిర్వహించాలని సూచించింది. ఫెమా కింద రూపొందించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ ఎక్సే్ఛంజీలు, విదేశీ కౌంటర్పార్టీలకు మార్జిన్ల కోసం చెల్లింపులకు ఎంతమాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫారెక్స్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పథకాలను చేపట్టేందుకు కొందరు మోసపూరిత సంస్థలు వారి ఏజెంట్లు ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా సంప్రదించి భారీ రాబడుల హామీలతో వారిని ప్రలోభపెడుతూ, అనధికార ఈటీపీలను నిర్వహిస్తున్న అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇటువంటి అనధికార ఈటీపీలు, పోర్టల్‌లు చేసిన మోసపూరిత పథకాలు, ట్రేడింగ్‌ల వల్ల అనేకమంది భారీ ఎత్తున డబ్బును పోగొట్టుకుంటున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నట్లు తెలిపారు. -
మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం
నీరు సృష్టిలో ప్రతి జీవరాశికి చాలా అవసరమైనది. మంచినీరు లేకపోతే మానవాళి లేదు. ప్రపంచంలో కేవలం 10 శాతం నీరు మాత్రమే తాగేందుకు అనువైనది. మారుతున్న కాలక్రమంలో పెరిగిపోతున్న జనాభా వల్ల మంచినీరు కొరత రోజురోజుకూ పెరిగిపోతోంది. భూగర్భజలాలు అడుగంటడం, నీటి కాలుష్యం పెరిగిపోవడంతో మనుషుల జీవన విధానం, ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో బావులు, బోర్ల నుంచి వచ్చే నీటిని, పట్టణాలు, నగరాల్లో కుళాయి నీటిని తాగేవారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు ధనిక, పేద అనే తేడా లేకుండా మినరల్ వాటర్‌ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రజల తాగునీటి అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకున్న వ్యాపారులు పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా వృద్ధి చెందింది. కాసులకు కక్కుర్తి పడిన వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండా వాటర్ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. మనం రోజూ మినరల్ వాటర్ పేరిట తాగుతున్న నీళ్లలోనూ ‘మినరల్’ అంతే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తద్వారా వ్యాపారులు కోట్లు వెనకేసుకుంటున్నారు. (బొల్లం కోటేశ్వరరావు, సాక్షి అమరావతి బ్యూరో): మార్కెట్లో మినరల్ వాటర్ పేరిట మోసాల దందా జోరుగా సాగుతోంది. మారుమూల పల్లెల నుంచి పెద్దపెద్ద నగరాల వరకు అన్ని చోట్లా మినరల్ వాటరే ఆధిపత్యం సాధించడంతో జనం బావులు, బోరు నీళ్లకు, కుళాయి నీటికీ దాదాపు మంగళం పాడేశారు. తాము తాగేది సాదాసీదా నీరే అయినప్పటికీ మినరల్ వాటర్‌గానే భ్రమిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తమ ఇంటికి వాటర్ క్యాన్లు రప్పించుకోవడమో, క్యాన్లు తీసుకెళ్లి నీటిని తెచ్చుకోవడమో చేస్తున్నారు. ఇక బయటకు వెళ్లినా బాటిల్ నీళ్లు తాగడానికే మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ వాటర్ ప్లాంట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి పొందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు 200లోపు ఉంటే.. ఆ సంస్థ అనుమతుల్లేకుండా నడుస్తున్నవి వేలల్లో ఉన్నాయి. ప్రజల్లో ఈ వాటర్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో వీటి ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదు. ఆర్వో(రివర్స్ ఆస్మాసిస్) ప్లాంట్లు, ఎక్స్ట్రా ఆడెడ్ మినరల్స్ అంటూ మోసం చేస్తున్నారు. మంచినీటి ఉత్పత్తిలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. అధికారుల తీరూ అలాగే ఉంది. వాటర్ ప్లాంట్‌కు దరఖాస్తు చేయగానే లోతుగా పరిశీలించకుండా ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. ఆ తర్వాత మామూళ్ల రుచి మరిగి ఆ ప్లాంట్లలో జరుగుతున్న మోసాలను పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కుటుంబ ఖర్చులో పెరిగిన మంచి నీటి వాటా నలుగురు సభ్యులున్న కుటుంబం రోజుకు సగటున 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను వినియోగిస్తున్నారు. ఆ 20 లీటర్ల వాటర్ క్యాన్ ప్రాంతాన్ని, పోటీని బట్టి ప్లాంట్‌లో రూ.10 నుంచి 20 వరకు విక్రయిస్తున్నారు. అదే డోర్ డెలివరీ చేస్తే అదనంగా మరో రూ.10–15 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక కుటుంబం రోజుకు సగటున రూ.30 చొప్పున నెలకు రూ.900 వరకు వెచి్చస్తోంది. ఇది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్‌ను కొని తాగుతున్నారు. లీటరు వాటర్ బాటిల్ ఖరీదు రూ.20 ఉంది. ఇలా నెలలో సగటున ఐదారు బాటిళ్లు తాగినా రూ.100 వరకు ఖర్చవుతుంది. అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేలు కేవలం మంచినీళ్లకే చెల్లించాల్సి వస్తోంది. ఇక కార్యాలయాలకు 20 లీటర్ల వాటర్ క్యాన్ రూ.25–30కు సరఫరా చేస్తున్నారు. మారిన పరిస్థితుల్లో కూలింగ్ మినరల్ వాటర్ పేరిట కూడా నీటిని అమ్ముతున్నారు. 20 లీటర్ల కూలింగ్ క్యాన్‌కు రూ.40–50 వరకు వసూలు చేస్తున్నారు. ఫంక్షన్లలో ఇలాంటి కూలింగ్ వాటర్‌కు ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. పాలతో నీళ్లకు పోటీ.. రానురాను పరిస్థితి ఎలా తయారైందంటే తాము మంచినీళ్లకు పెట్టే ఖర్చు.. పాల కంటే మించిపోతోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. సగటు మధ్య తరగతి కుటుంబాలు మార్కెట్లో రూ.4–5 తక్కువ ధర ఉన్న పాల ప్యాకెట్‌కే మొగ్గు చూపుతాయి. ప్రస్తుతం మార్కెట్లో అర లీటరు పాల ప్యాకెట్ ధర వెన్న శాతాన్ని బట్టి రూ.26 నుంచి 32 వరకు ఉంది. ఇలా పాలకు వెచి్చంచే సొమ్ము గరిష్టంగా రూ.900 అవుతుంది. అంటే పాలతో నీళ్ల ధర పోటీ పడుతోందని స్పష్టమవుతోంది. మనుషుల్లో ‘మినరల్ వాటర్’పై మోజుకు ఇది దర్పణం పడుతోంది. విజయవాడ కృష్ణలంకలో నడుస్తున్న ఓ వాటర్ ప్లాంట్ ఇది. ఆ ప్లాంట్ బయట బోర్డుపై ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని రాసుంది. దాని దిగువనే ‘వివాహాది శుభకార్యాలకు ‘మినరల్ వాటర్’ సప్లై చేయబడును’ అని చిన్న అక్షరాలతో రాశారు. సాక్షి ప్రతినిధి అక్కడికి వెళ్లి టీడీఎస్ స్థాయిని గుర్తించే డిజిటర్ మీటర్ ఎక్కడని సిబ్బందిని ప్రశ్నిస్తే.. అసలు అలాంటిది ఉంటుందనే విషయమే వారికి తెలియదన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఐఎస్ సర్టిఫికెట్లు ఎక్కడ అని అడిగితే సమాధానం చెప్పలేదు. ఇళ్ల మధ్యలో ఇరుకుగా, పరిశుభ్రత లేకపోయినా అక్కడికి జనం వచ్చి నీటిని కొనుక్కొని వెళ్తున్నారు. అక్కడకు సమీపంలోనే మరో పెద్ద వాటర్ ప్లాంట్ ఉంది. అది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పేరిట ఐఎస్ఐ గుర్తింపు లేకుండా నడుస్తోంది. అక్కడ రిటైల్‌లో అర లీటరు బాటిల్ రూ.10లు, లీటర్ బాటిల్ రూ.20లు, 20 లీటర్ల వాటర్ క్యాన్ రూ.20ల చొప్పున అమ్ముతున్నారు. ఐఎస్ఐ అనుమతి లేకుండా ఇంత పెద్ద ప్లాంట్‌ను ఎలా నడుపుతున్నారన్న ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నకు నిర్వాహకుడి నుంచి సమాధానం లేదు. ఇలా ఐఎస్ఐ గుర్తింపు లేకుండా అనధికారికంగా నడుస్తున్న ప్లాంట్లు ఒక్క విజయవాడ నగరంలోనే వందల్లో ఉన్నాయి. ఇవీ నిబంధనలు.. ►ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు మొదటిగా వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలవనరుల శాఖ అనుమతి ఉండాలి. 500 మీటర్ల పరిధిలో మరో బోరు తవ్వకూడదు. ఫ్యాక్టరీలు, రసాయన కర్మాగారాలున్న చోట ఏర్పాటు చేయకూడదు. ►స్థానిక సంస్థలు (పంచాయతీ/మునిసిపాలిటీ/నగరపాలకçసంస్థ), రెవెన్యూ, కారి్మక, కాలుష్య నియంత్రణ మండలి, ప్రజారోగ్య శాఖ, తూనికలు, కొలతల శాఖ, ఆహార భద్రత అధికారి, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల నుంచి అనుమతి పొందాలి. వీరి అనుమతి లేకుండా ప్లాంట్ ఏర్పాటు చేస్తే సంబంధిత అధికారులు సీజ్ చేయవచ్చు. ►ప్యాకింగ్, బాట్లింగ్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌కు ఐఎస్ఐ గుర్తింపు తప్పనిసరి. దీనిని భారత ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ఐఎస్ఐ గుర్తింపును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్‌ను ప్లాంట్‌లో కనిపించేలా వేలాడ దీయాలి. ఇది లేకుండా నడిచే వాటర్ ప్లాంట్‌ను సీజ్ చేసే అధికారం రెవెన్యూ అధికారులది. ►ఒక్కసారి బీఐఎస్/ఐఎస్ఐ సరి్టఫికేషన్ వచ్చాక ఏటా రెన్యువల్ చేయించుకోవాలి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే రెన్యువల్ చేయాలి. ►ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌కు ఐఎస్–14543, మినరల్ వాటర్ ప్లాంట్‌కు ఐఎస్–13428 మార్కును జారీ చేస్తారు. వాటిని వాటర్ బాటిళ్లపై ముద్రిస్తారు. ►ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సరి్టఫికేషన్ కూడా ఉండాలి. ►ఈ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేయాలి. ►శుద్ధి చేసిన నీటిలో టోటల్ డిజాల్‌్వడ్ సాల్వెంట్స్ (టీడీఎస్–ఖనిజాల స్థాయి) స్థాయి లీటరుకు 500 మి.గ్రా. కంటే తక్కువ ఉండాలి. అది తెలియజేయడానికి డిజిటల్ మీటర్ ఏర్పాటు చేయాలి. ►టీడీఎస్ చెక్ చేయడానికి ప్లాంట్‌లో ల్యాబ్ ఉండాలి. ఈ ల్యాబ్‌లో ల్యాబ్ టెక్నీíÙయన్ను నియమించాలి. నీటిని స్టోర్ చేయడానికి ట్యాంకులు ఉండాలి. ►నీటిని శుద్ధి చేసేందుకు వాడే కెమికల్స్ క్వాలిటీని తనిఖీ చేయాలి. ఈ నీటిలో ఎలాంటి హానికర పదార్ధాలు లేకుండా మనుషులు తాగడానికి వీలుగా ఉందని నిర్ధారించాకే విక్రయించాలి. ►బీఐఎస్ సర్టిఫికేషన్ ఉంటేనే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ జారీ చేస్తుంది. ►బీఐఎస్ లైసెన్స్ పొందిన కంపెనీలకు తయారు చేసే వాటర్ బాటిళ్లను కూడా బీఐఎస్ అధికారులు టెస్టింగ్ చేస్తారు. ప్యాకింగ్ మెటీరియల్, పరిశుభ్రత, వర్కర్లకు హెల్త్ చెకప్, గోళ్లు తీసుకుంటున్నారా? హెయిర్ కవర్ చేస్తున్నారా? వంటివి కూడా పరిశీలిస్తారు. ►ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీస్ యాక్టు ప్రకారం బీఐఎస్ మార్కింగ్ లైసెన్స్ లేని మంచినీళ్ల తయారీ, విక్రయం నిషిద్ధం. అలాంటి ప్లాంట్లకు ఏ ప్రభుత్వ శాఖ లైసెన్స్ జారీ చేయకూడదు. ►నాన్ ఐఎస్ఐ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషన్ నం.9765/సీపీఆర్ అండ్ ఆర్ఈ/డీ3/2006లో సర్క్యులర్ మెమో జారీ చేసింది. ►బీఐఎస్ సర్టిఫికేషన్ లేని వాటర్ ప్లాంట్లకు ఐఎస్ఐ సరి్టఫికెట్, ఇన్సెంటివ్‌లు రద్దు చేయాలని, విద్యుత్ కనెక్షన్ తొలగించాలని పరిశ్రమల శాఖ 2002లోనే ఉత్తర్వులిచ్చింది. ►ఐఎస్ఐ మార్కు లేని ప్లాంట్లపై సీఆర్పీసీ సెక్షన్ 133 కింద కేసు నమోదు చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులున్నాయి. కానీ ఇవన్నీ ఎక్కడ అమలవుతున్నాయి? నిబంధనలకు ‘నీళ్లు’ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న వాటర్ ప్లాంట్లు నిబంధనలు ఏవీ పాటించడం లేదు. అంతా ‘మినరల్ వాటర్’కే అలవాటు పడడం, వినియోగం పెరగడం, మంచి ఆదాయం సమకూరడంతో ఈ వాటర్ ప్లాంట్లు చిన్నచిన్న వీధుల్లోనూ పుట్టుకొస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం 185 వరకు మాత్రమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లైసెన్స్‌లు పొందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. కానీ అనధికారికంగా 12 వేలకు పైగానే ఇలాంటివి ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు రెండువేల వరకు అనధికారిక వాటర్ ప్లాంట్లు ఉన్నాయని అంచనా. గుంటూరు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోనే చిన్న, చితకా కలిపి ఐదు వేలకు పైగా అనధికారిక వాటర్ ప్లాంట్లు ఉన్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో వాటర్ ప్లాంట్ల ద్వారా ఏటా వేల కోట్ల రూపాయల మంచినీటి వ్యాపారం జరుగుతున్నా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఏమాత్రం జమ కావడం లేదు. మరోవైపు కొంతమంది చారిటీ, ట్రస్టుల పేరిట వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు. చారిటీ సంస్థలకు పన్ను మినహాయింపులతో పాటు పలు రాయితీలు దక్కుతాయి. ఇలా రిజిష్టర్ అయిన సంస్థలు ప్రజలకు వాటర్‌ను కారు చౌకగా ఇవ్వాలి. కానీ అలా చేయడం లేదు. చారిటీ పేరుతో ఐటీ, జీఎస్టీలను ఎగవేస్తున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమేది? నిత్యం ఇళ్లు, కార్యాలయాల్లో వాడే వాటర్ క్యాన్లను తరుచూ విధిగా మార్చాలి. కానీ మూడు నాలుగేళ్ల వరకు మార్చరు. క్యాన్లపై సంస్థ లేబుల్ ఉండాలి. అవీ ఉండవు. ప్యాకింగ్ యూనిట్ స్టెరైల్గా, ఆపరేషన్ థియేటర్లా ఉండాలి. కానీ అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుంది. అయినా ఇటు ప్లాంట్ యజమానులు, అటు ప్రజలు పట్టించుకోవడం లేదు. తక్కువ ఖర్చుతో.. ఐఎస్ఐ ప్రమాణాలు పాటించి ప్లాంట్ ఏర్పాటు చేస్తే కనీసం రూ.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ ఆ ప్రమాణాలు పాటించకుండా రూ.4–5 లక్షలతోనే ఎడాపెడా ప్లాంట్లు పెట్టేస్తున్నారు. ఇలా ఏటా 20 శాతం చొప్పున ఈ వాటర్ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వేసవిలో మరింత ఆదాయం.. ఏడాదిలో ఎనిమిది నెలలు ఎంత ఆదాయం సమకూరుతుందో ఎండాకాలం నాలుగు నెలలూ అంత రాబడి వస్తుంది. వేసవిలో తాగునీటి వినియోగం ఇతర సీజన్లకంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఈ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు ప్రస్తుత వేసవి సీజను ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అందుకే ఈ సీజనులో అధికారులు కూడా ‘అవగాహన’తో ఈ ప్లాంట్ల తనిఖీల జోలికి అంతగా వెళ్లరు. చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు. ఆరోగ్యానికి ప్రమాదం.. శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో టీడీఎస్ స్థాయి గరిష్టంగా లీటరుకు 500 మిల్లీగ్రాముల లోపు ఉండాలి. కానీ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అంతకు రెట్టింపు ఉంటున్నా పట్టించుకునే వారే లేరు. తాగునీటిలో టీడీఎస్ స్థాయి (లెడ్, ఫ్లోరిన్, నైట్రేట్, క్లోరైడ్స్ వంటివి)కి మించి ఉంటే దీర్ఘకాలంలో జీర్ణకోశ, కాలేయ, ఉదర సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, ఎముకలు, పళ్లకు కూడా నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేసి విక్రయిస్తున్న ‘జనరల్’ వాటర్‌కంటే కుళాయి నీళ్లు చాలా బెటర్ అంటున్నారు నిపుణులు. అధికారుల మధ్య సమన్వయలేమి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసే అధికారం ఆర్డీవోలకే ఉంది. బీఐఎస్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులకు ప్లాంట్‌లో ఉన్న స్టాకు సీజ్ చేయడానికే అధికారం ఉంది. ఆర్డీవో నుంచి ఆదేశాలొస్తేనే తహసీల్దార్లు, ఆహార తనిఖీ, భద్రత అధికారులు సీజ్ చేస్తారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటప్పుడే ఫుడ్ లైసెన్స్, బీఐఎస్, రెవెన్యూ పర్మిషన్లు ఉన్నాయా? లేదా చూసి ఇవ్వాలి. కానీ అవేమీ చూడకుండానే కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. పైగా ఇలాంటి అనధికారిక వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకునే విషయంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేదు. ఇవన్నీ వెరసి అనధికారిక వాటర్ ప్లాంట్ల యజమానులకు వరంగా మారింది. రెయిడ్స్‌కు సన్నద్ధమవుతున్నాం.. బీఐఎస్ లైసెన్స్ పొందిన వాటర్ ప్లాంట్లు రాష్ట్రంలో 185 వరకు ఉన్నాయి. బీఐఎస్ సరి్టఫికేషన్ లేకుండా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం. కొందరు కేవలం ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులతో వీటిని నడుపుతున్నారు. బీఐఎస్ లేని అనధికారిక ప్లాంట్లపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్చి 26న రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. త్వరలోనే బీఐఎస్ అనుమతుల్లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై రెవెన్యూ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, విజిలెన్స్, భూగర్భ జలవనరులశాఖ అధికారులతో కలిసి దాడులకు సన్నాహాలు చేస్తున్నాం. ఇలాంటి అడ్డగోలు ప్లాంట్లను, నీటి వ్యాపారాన్ని కట్టడి చేస్తాం. – బి.సంధ్య, సైంటిస్ట్–డి అండ్ హెడ్, బీఐఎస్, విశాఖపట్నం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు.. నాణ్యతా ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నీళ్లలో టీడీఎస్ సమతుల్యత పాటించకపోవడం, నిర్దేశిత స్థాయిలో శుద్ధి జరగకపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంచినీటిలో కాపర్ అధికంగా ఉంటే కాలేయం, క్లోరైడ్ ఎక్కువైతే జీర్ణకోశ ఇబ్బందులు, నైట్రేట్స్ వల్ల కండరాలు, నరాల సంబంధ సమస్యలు దీర్ఘకాలంలో అంటే 5–10 ఏళ్లలో తలెత్తుతాయి. అందువల్ల బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న సంస్థలు ఉత్పత్తి చేసే నాణ్యమైన శుద్ధ జలాన్నే ప్రజలు తాగాలి. లేదంటే ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. –డాక్టర్ బి.రత్నగిరి, అసిస్టెంట్ గ్యాస్ట్రో ఎంటారాలజిస్ట్, జీజీహెచ్, విజయవాడ. ప్రభుత్వ ఖజానాకు గండి.. రాష్ట్రంలో అనుమతుల్లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఇలాంటి సంస్థలు అనధికారికంగా ప్లాంట్లు నిర్వహిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి తరచూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఇతర విభాగాల వారితో సమీక్షలు నిర్వహించాలి. సంబంధిత శాఖలను సమన్వయం చేయాలి. విజిలెన్స్ కమిటీ సమావేశాల్లో అజెండాగా చేర్చాలి. ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలి. – కాండ్రేగుల వెంకటరమణ, విజిలెన్స్ కమిటీ సభ్యుడు, వినియోగదార్ల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ. అనుమతుల్లేని ప్లాంట్లను సీజ్ చేస్తాం.. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లకు బీఐఎస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు తప్పనిసరి. ఈ లైసెన్స్‌లు పొందాకే వాటిని నడపాలి. అవి లేకుండా నడుస్తున్న వాటిని కలెక్టర్ అనుమతితో 133 సీఆర్పీసీ ప్రకారం సీజ్ చేస్తాం. ఈ వాటర్ ప్లాంట్లు రోజూ కెమికల్, బ్యాక్టీరియాలాజికల్ టెస్ట్‌లు నిర్వహించాలి. విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. వాటర్ క్యాన్లను 90 రోజులకు మించి వినియోగించరాదు. –ఎన్.పూర్ణచంద్రరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయవాడ. చదవండి: 1.43 లక్షల టన్నుల ఆక్సిజన్ సరఫరా పోలవరానికి రూ.333 కోట్లు -
ఆ యాప్‌ల ద్వారా రుణాలొద్దు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: చట్టబద్దత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌ల పై ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్‌ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు. (చదవండి: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత) ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45-1ఏ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని తెలిపారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్లైన్ యాప్‌లలో అధికశాతం ఆర్బీఐలో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారం లేదని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!) ఈ యాప్‌లలో అధికంగా చైనీస్‌వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నంబర్ గాని ఇతర వివరాలు ఉండవని పేర్కొన్నారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని, ఈ యాప్‌ల యూజర్లు లిఖిత పూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు. యాప్‌ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్‌ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దని సూచించారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపారు. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్‌లు మోసపూరితమైనవని, ఆర్బీఐ గుర్తింపులేని ఈ యాప్‌ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలిపారు. ఈ యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సీ రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణ వలయంలో చిక్కుకుంటారు. దీంతో రుణాలు చెల్లించని రుణ గ్రహీతలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్లైన్ వేధింపులకు ఈ యాప్‌లు పాల్పడతాయి. రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రుణం అందించే యాప్‌లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ తెలిపారు. ఆర్బీఐలో రిజిస్టర్ కాని, అక్రమ యాప్‌ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని డీజీపీ కార్యాలయం ప్రజలకు సూచించింది. ఈ విషయంలో ఎవరైన వేధింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. -
ఆ వలలో చిక్కిన వారికి.. తప్పవు చిక్కులు
కాకినాడ రూరల్: అద్దె ఇళ్లల్లో.. చాలీచాలని ఇరుకు కొంపల్లో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నవారు.. అప్పోసప్పో చేసి సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటారు. దీనిని సొమ్ము చేసుకొనే లక్ష్యంతో పట్టణాలు, నగరాలను ఆనుకొని ఉన్న పల్లెల్లో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తగిన అనుమతులు లేకుండానే ఇష్టానుసారం లే అవుట్లు వేసేస్తున్నారు. తక్కువ ధరల పేరుతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై వల విసురుతున్నారు. ఆ వలలో చిక్కుకున్న వారికి చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు గుడా అధికారులు. నిబంధనలు పాటించకుండా వేసిన లే అవుట్లలోని స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు రావని స్పష్టం చేస్తున్నారు. అటువంటి అనధికార లే అవుట్లలోని ప్లాట్లను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల ఒత్తిళ్లతో జిల్లాలోని పలు వ్యవసాయ భూములు వ్యవసాయేతరంగా మారిపోయాయి. ఆ పార్టీ నేతల కనుసన్నల్లో రియల్ ఎస్టేట్ నిబంధనలను తుంగలో తొక్కి.. అనేకమంది యథేచ్ఛగా అనధికార లే అవుట్లు (నాన్ లే అవుట్లు) వేసేశారు. సామాజిక అవసరాలకు స్థలాలను మినహాయించకుండానే ప్లాట్లు వేసి అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. తగిన అనుమతులు లేని ఇటువంటి లే అవుట్లలో భవిష్యత్తులో భవన నిర్మాణాలకు అవకాశం ఉండదు. అంతేకాదు.. వీటిని అమ్ముకునే వీలు కూడా ఉండదని గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) అధికారులు స్పష్టం చేస్తున్నారు. 23 మండలాల పరిధిలో.. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతో పాటు తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, మండపేట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలు, 43 మండలాల్లోని 598 రెవెన్యూ గ్రామాలు గుడా పరిధిలో ఉన్నాయి. మొత్తం 4396.84 చదరపు కిలోమీటర్ల మేర గుడా పరిధి విస్తరించి ఉంది. మొత్తం 23 మండలాల్లో విస్తరించి ఉన్న గుడా పరిధిలో 1,338 అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అత్యధికంగా 370 ఉండగా, కడియం మండలంలో అత్యల్పంగా 6 ఉన్నాయి. వీటిని ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నిషేధిత భూముల రిజిస్టర్లో నమోదు చేయించారు. తద్వారా వాటి కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. ఇటువంటి లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ముందే మేల్కోవాలని, ఏప్రిల్ ఆరో తేదీలోగా వాటిని క్రమబదీ్ధకరించుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్తో ప్రయోజనాలు లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా అనధికార లే అవుట్లను క్రమబదీ్ధకరించుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8న జీఓఎంఎస్ 10 ద్వారా అనుమతి ఇచ్చింది. దీని ద్వారా గత ఏడాది ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబదీ్ధకరించుకొనేందుకు అవకాశం ఇచ్చింది. జిల్లాలోని సంబంధిత యజమానులు తమ ప్లాట్లను ఏప్రిల్ ఆరో తేదీలోగా క్రమబద్దీకరించుకుంటే 14 శాతం ఓపెన్ స్పేస్ ఖరీదులో 50 శాతం మినహాయింపు లభిస్తుంది. పూర్తి వివరాలకు కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని గుడా అధికారులు సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ను వినియోగించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్ల క్రమబదీ్ధకరణకు ఎల్ఆర్ఎస్–2020కి జనవరిలో అనుమతి ఇచ్చింది. ఈ పథకాన్ని గుడా పరిధిలోని నాన్ లే అవుట్ల ప్లాట్ల యజమానులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే 1,338 నాన్ లే అవుట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల రిజిస్టర్లలో నమోదు చేశాం. దీనివల్ల భవిష్యత్తులో అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం ఉండదు. అందువల్ల ఎల్ఆర్ఎస్ మంచి అవకాశం. – ఆర్.అమరేంద్రకుమార్, వైస్ చైర్మన్, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ -
అక్రమాల్లో విక్రమార్కులు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రాధినేత అక్రమ నిర్మాణాలు సాగిస్తే... వాటిని యథేచ్ఛగా ప్రోత్సహిస్తే... ఆ అక్రమ భవనాల్లో మకాం పెడితే... ఆయన వంది మాగధులు ఊరుకుంటారా? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా అనుసరిస్తారు. తామేమీ తక్కువ కాదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. అధినేత చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఆదర్శంగా తీసుకుని ఇష్టమొచ్చిన రీతిలో దందాలు చేశారు. తమను అడ్డుకునేదెవరని అధికార దర్పంతో చెలరేగిపోయా రు. టీడీపీ కార్యాలయం కోసం అక్రమ కట్టడాన్ని నిర్మించేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చేతిలో అధికారం ఉందని పార్టీ కార్యాల యం కోసం ఎకరానికి బదులు రెండెకరాలు తీసుకున్నారు. 30 సంవత్సరాల లీజుకు బదులు 99 సంవత్సరాల లీజుకు రాయించుకున్నారు. రూ.12 కోట్ల విలువైన భూమిని సంవత్సరానికి రూ.25 వేల లీజు ధరకు చేజిక్కించుకున్నారు. అంతటితో ఆగలేదు. వుడా, టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు పొందకుండానే ఏకంగా (జీ ప్లస్ 2) రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించేశారు. పనిలో పనిగా పక్కనున్న కొంత స్థలాన్ని నిర్మాణంలో కలిపేసుకున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయించారు. అనుమతుల కోసం ఒక్క రూపాయీ చెల్లించని టీడీపీ కార్యాలయం.. జీ ప్లస్ 2 భవనం కోసం 2017 ఫిబ్రవరిలో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) అధికారులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష దరఖాస్తు చేశారు. వుడా, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి బెటర్మెంట్ చార్జి కింద రూ.6 లక్షల 7 వేల 50లు చెల్లించాలని నోటీసు జారీ చేశారు. ఇంత మొత్తం చెల్లించలేమని, రెండెకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ కేవలం 25 సెంట్లలో మాత్రమే నిర్మాణం చేపట్టామని, ఆమేరకు తమకు ప్లాన్ అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఆ అధికారం తమకు లేదని, మొత్తం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటామని, భవనం మేరకు ప్లాన్ ఇవ్వలేమని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వానికి ఫైలు పంపిస్తే అక్కడ మేం చూసుకుంటామని టీడీపీ నేతలు సూచించారు. దీంతో ప్రభుత్వానికి ఫైలు వెళ్లింది. ప్రభుత్వం వాళ్లదే కావడంతో సంబంధిత ఉన్నతాధికారులు జీ హుజూర్ అనేశారు. చెప్పినట్టుగా సంతకం పెట్టేశారు. అంతటితో ఆగకుండా 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని హుటాహుటిన వుడా, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధం... కట్టడం ఎంత ఉన్నా ప్రహరీతో కూడిన విస్తీర్ణానికే ప్లాన్ తీసుకోవాలి. ఆమేరకు కార్పొరేషన్ అధికారులు నిర్దేశించిన ఫీజు చెల్లించి అనుమతి పొందాలి. కానీ ఎక్కడ బెటర్మెంట్ చార్జీ ఎక్కువగా ఉందని చెప్పి రెండెకరాల విస్తీర్ణంలో ప్రహరీ, భవనం నిర్మించినా కేవలం భవనానికి మాత్రమే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని అధికారులపై కత్తి పెట్టారు. వారిపై ఒత్తిడి తెచ్చి ఫైలు పెట్టించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులతో సానుకూలంగా సంతకం చేయించుకున్నారు. వెలుగు చూసిన ఆక్రమణ.. ప్రభుత్వ ఉన్నతాధికారులు 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన వెంటనే వుడా అధికారులు జాగ్రత్తపడ్డారు. ఇదేదో సమస్యగా మారి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ చోటు చేసుకున్న ఆక్రమణ విషయాన్ని కాగితంపై పెట్టారు. టీడీపీ భవన్‌కు దక్షిణం వైపు ఉన్న రోడ్డును ఆనుకొని కొంత ఆక్రమిత స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారని, దాని తొలగించి, రిమార్క్స్‌తో కూడిన ప్లాన్ ఫైలు పెట్టాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతల దృష్టికి కార్పొరేషన్ అధికారులు తీసుకెళ్లారు. కానీ వారంతా గమ్మున ఉండిపోయారు. అధికార చేతిలో ఉంది... ఎవరేమి చేస్తారు అన్న ధోరణితో వుడా అధికారులు సూచించిన విధంగా ప్లాన్‌కు దరఖాస్తు పెట్టుకోలేదు. ఒక్క రూపాయి ఫీజు చెల్లించకుండా... ప్లాన్ అనుమతి పొందకుండానే చంద్రబాబు చేతుల మీదుగా అట్టహాసంగా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయించారు. ప్రస్తుతానికి ఇది అక్రమ కట్టడమే కాకుండా ఆక్రమిత స్థలంలో నిర్మించిన భవనంగా కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా కొనసాగుతున్న భవనం జోలికే వెళ్లడం లేదు. టీడీపీ నేతలు చెప్పినట్టు ప్లాన్ ఇస్తే... మిగులు భూమి స్వాధీనం చేసుకోవల్సిందే... ప్రభుత్వం నుంచి పొందిన స్థలాన్ని రెండు సంవత్సరాల్లోగా పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఆమేరకు నిర్మాణాలు చేపట్టాలి. నిరుపయోగంగా ఉంటే స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంది. రెండెకరాల స్థలంలో ప్రహరీతో కూడిన భవనాన్ని నిర్మించినప్పటికీ తాము కేవలం 25 సెంట్లలోనే భవనం నిర్మించామని, దానికే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని డిమాండ్‌తో కూడిన అర్జీని టీడీపీ నేతలు పెట్టారు. దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉన్నట్టుగానే భావించాలి. ఆ ప్రకారం నిరుపయోగంగా ఉం దని గుర్తించి.. ఇప్పుడున్న డిమాండ్, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా కలెక్టర్ స్వాధీనం చేసుకోవచ్చు. ఆ దిశగా చర్యలు చేపడితే పట్టణంలోని ఎకరా 75 సెంట్ల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికైతే, ఈ భూమిని షెడ్యూల్ కులాల నివాసిత స్థలాల కోసమే గతంలో సాంఘిక సంక్షేమ శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ భూమి ఖాళీగా ఉందని టీడీపీ కన్నేసి కొట్టేసింది. ఇప్పుడు టీడీపీ నేతలే 25 సెంట్లలోనే నిర్మాణం చేపట్టామని అధికారికంగా అంగీకరించారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉందని వేరొక అవసరాలకు కేటాయిస్తే సరిపోతుంది. టీడీపీ భవన్‌కు అనుమతుల్లేవు.. టీడీపీ కార్యాలయ భవన్‌కు అనుమతుల్లేవు. కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి చెల్లించలేదు. 6 లక్షల 7 వేల 50 రూపాయలు బెటర్మెంట్ చార్జి చెల్లించమని నోటీసు ఇస్తే అభ్యంతరం తెలిపారు. రెండు ఎకరాలకు కాకుండా కేవలం 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని మరో అర్జీ పెట్టారు. దానికి ఉన్నతాధికారుల ఆమోదం రావడంతో తదుపరి ఎండార్స్మెంట్ ఇచ్చారు. కానీ దానిపై టీడీపీ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతానికి టీడీపీ భవనం అక్రమ కట్టడమే. – దేవకుమార్, కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ -
అనుమతిలేని ఆస్పత్రి సీజ్
కోడుమూరు రూరల్ : ఎలాంటి అనుమతుల్లేకుండా కోడుమూరు పట్టణంలో వైద్యం, స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న బాషా నర్సింగ్ హోమ్‌ను డీఎంఅండ్‌హెచ్‌ఓ మీనాక్షి మహాదేవ్ బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుమతుల్లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈనెల 19వతేదీ కోడుమూరులోని బాషా నర్సింగ్ హోమ్ తనిఖీ చేయగా, స్కానింగ్ మిషన్‌తో పాటు, వైద్యుడు పరారయ్యాడన్నారు. అస్పత్రిలోని రోగులను విచారించగా స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారన్న విషయం రుజువైందన్నారు. ఎలాంటి అర్హత పొందిన డాక్టర్లు, సిబ్బంది లేకుండానే ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీంతో బాషా నర్సింగ్ హోమ్‌ను సీజ్ చేసి, అస్పత్రిలోని రోగులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు మీనాక్షిమహాదేవ్ వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఓ ఎర్రంరెడ్డి, హెచ్ఈఓ సత్యనారాయణ, లీగల్ కన్సల్టెంట్ మాధవి, కోడుమూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ప్రకాశం, వీఆర్వో వెంకట్రాముడు తదితరులున్నారు. -
ఆటకట్టిస్తాం
అనుమతిలేని ప్లే స్కూళ్లపై కఠిన చర్యలు జిల్లాలో 425 పాఠశాలలు కొనసాగుతున్నట్లు నిర్ధారణ ఒక్కదానికీ గుర్తింపు లేని వైనం షోకాజ్ నోటీసులు జారీచేసిన విద్యాశాఖవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనుమతి లేని ప్లే స్కూళ్లపై విద్యాశాఖ చర్యలకు దిగింది. గతవారం దిల్సుఖ్నగర్ సమీపంలోని మూసారాంబాగ్‌లోని స్టార్ కిడ్స్ ప్రీమియం ప్లేస్కూల్లో ఓ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించింన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని ప్లే స్కూల్స్‌పై విద్యాశాఖ ఆరా తీస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 37 మండలాల్లో ఒక్క ప్లే స్కూల్‌కు కూడా అనుమతి లేదు. అనుమతి లేకుండా కొనసాగుతున్న వీటిపై కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండలాల వారీగా నడుస్తున్న ప్లేస్కూళ్లను గుర్తించేందుకు ఉపక్రమించింది. 425 స్కూళ్లకు షోకాజ్ నోటీసులు.. జిల్లాలో మండలాల వారీగా తనిఖీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు ఇప్పటిరకు 425 ప్లే స్కూళ్లున్నట్లు గుర్తించారు. వీటి పరిధిలో దాదాపు 13వేల మందికి పైగా పిల్లలున్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్లేస్కూళ్లను గుర్తించిన వెంటనే వాటికి షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 425 స్కూల్ మేనే జ్మెంట్లకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. అక్రమంగా నడుస్తున్నవి మరో 750.. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్లే స్కూళ్లు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాజధాని చుట్టూ ఉన్న 9 మండలాల్లో ఇప్పటివరకు 425 పాఠశాలలను గుర్తించారు. ఇవేగాకుండా మిగతా మండలాల్లోనూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ప్లేస్కూళ్లలో కేవలం చిన్నారులకు ఆటపాటలతోనే సరిపెడుతున్నారు. అయితే కొన్ని అనుమతి పొందిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో అక్రమంగా ప్లేస్కూళ్లను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ పరిశీలనలో వెల్లడైంది. ఇలా దాదాపు 750 పాఠశాలల్లో ఇలా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వీటి సంఖ్యను తేల్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా.. ప్లే స్కూళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులుంటే అధికారికంగా వీటిని నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
అనుమతిలేని మెడికల్ షాపులపై చర్యలు
పుణే సిటీ, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించామని, ఇప్పటిదాకా 2,586 షాపులను తనిఖీ చేయగా 192 షాపులు అనుమతులు లేకుండానే మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం కమిషనర్ మహేశ్ జగడే మాట్లాడుతూ... ‘నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారే మందులను విక్రయించాలి. రాష్ట్రవ్యాప్తంగా 51,000 మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఉంది. నిజానికి వీటి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం మెడికల్ షాపుల్లో దాదాపు 35 శాతం దుకాణాలకు అనుమతి లేనట్లు మా పరిశీలనలో వెల్లడైంది. దీంతో వీటిపై చర్య తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. డాక్టర్ రాసిచ్చిన చీటీ ఉంటేనే మందులను ఇవ్వాలనే నిబంధన ఉన్నా చాలా దుకాణాలు ఈ నిబంధనను పాటించడం లేదు. నిర్దేశించిన మోతాదు, కంపెనీ అన్నీ సరిపోలిన మందులనే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా విక్రయదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది రోగి ప్రాణానికే అపాయం కలిగించే అవకాశముంటుంది. ఇటువంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని దుకాణాలను మూసివేయిస్తామ’న్నారు.