ఆ యాప్‌ల ద్వారా రుణాలొద్దు: డీజీపీ | Do Not Take Loans Through Unauthorized Apps | Sakshi
Sakshi News home page

ఆ యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించొద్దు

Published Fri, Dec 18 2020 8:08 PM | Last Updated on Fri, Dec 18 2020 8:08 PM

Do Not Take Loans Through Unauthorized Apps - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చట్టబద్దత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌ల పై ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్‌ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు. (చదవండి: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత)

ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45-1ఏ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని తెలిపారు. ఆర్‌బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్‌లైన్‌ యాప్‌లలో అధికశాతం ఆర్‌బీఐలో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారం లేదని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్‌ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!)

ఈ యాప్‌లలో అధికంగా చైనీస్‌వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నంబర్ గాని ఇతర వివరాలు ఉండవని పేర్కొన్నారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని, ఈ యాప్‌ల యూజర్లు లిఖిత పూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు.

యాప్‌ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్‌ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దని సూచించారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపారు. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్‌లు మోసపూరితమైనవని, ఆర్‌బీఐ గుర్తింపులేని ఈ యాప్‌ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలిపారు. 

ఈ యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సీ రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణ వలయంలో చిక్కుకుంటారు. దీంతో రుణాలు చెల్లించని రుణ గ్రహీతలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్‌లైన్ వేధింపులకు ఈ యాప్‌లు పాల్పడతాయి.

రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రుణం అందించే యాప్‌లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ తెలిపారు. ఆర్‌బీఐలో రిజిస్టర్ కాని, అక్రమ యాప్‌ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని డీజీపీ కార్యాలయం ప్రజలకు సూచించింది. ఈ విషయంలో ఎవరైన వేధింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement