DGP Mahendar Reddy
-
డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) ఎం.మహేందర్‌రెడ్డి శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఉదయం 8:25 గంటలకు పరేడ్ నిర్వహించనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి గౌరవ లాఠీని అందిస్తారు. అనంతరం అంజనీకుమార్‌ను డీజీపీ కుర్చీలో గౌరవప్రదంగా కూర్చోబెట్టనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మహేందర్‌రెడ్డికి సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది వీడ్కోలు పలకనున్నారు. మహేందర్‌రెడ్డి సేవలు అభినందనీయం: హోంమంత్రి డీజీపీగా పదవీ విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శాలువాతో సత్కరించారు. ఈ మేరకు లక్డీకాపూల్‌లోని హోంమంత్రి కార్యాలయానికి వెళ్లిన డీజీపీ మహేందర్‌రెడ్డి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డికి మంత్రి చార్మినార్ జ్ఞాపికను అందించారు. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్‌రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారని ప్రశంసించారు. విధినిర్వహణలో తనదైన ముద్రవేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, డీజీపీగా, ఇతర అనేక హోదాల్లోనూ పనిచేసి అందరి మన్ననలు పొందారని హోంమంత్రి గుర్తు చేశారు. డీజీపీగా మహేందర్‌రెడ్డి పనిచేసిన ఈ ఐదేళ్లలో తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. గురువారం బదిలీలు పొందిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు సైతం హోంమంత్రిని కలిశారు. -
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్‌శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్‌నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్‌శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్‌లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్‌టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు. నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్‌శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్‌తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్‌శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్‌తో సీసీటీవీల బిగింపు మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్‌లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్‌శాండిల్య, సంజయ్‌జైన్, ఐజీ కమలాసన్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. -
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీతో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో బదిలీలు జరిగాయి. బదిలీల అనంతరం తెలంగాణ ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్. - రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్. - ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు. - లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్. - హోంశాఖ కార్యదర్శిగా జితేందర్. -
టీఎస్‌పీఐసీసీసీ చైర్మన్‌గా డీజీపీ మహేందర్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ‘సూపర్ పోస్టు’ను సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇటీవలే ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు ప్రభుత్వం చైర్మన్‌ను నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత ఆయననే ఈ పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పోలీసు విభాగం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైతం ఐసీసీసీ చైర్మన్ ఆధీనంలోనే ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇలాంటి పోస్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు సలహాదారులే.. రాష్ట్ర పోలీసు విభాగంలో డీజీపీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన వారి సేవలను వినియోగించుకోవడం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే వారిని శాంతిభద్రతల విభాగం సలహాదారులుగానో, చట్ట సవరణ, పోలీసు మ్యాన్యువల్‌లలో మార్పుచేర్పులకు సంబంధించిన కమిటీలకు ఇన్చార్జులుగానో నియమింవారు. మాజీ డీజీపీలు ఏకే మహంతి, అనురాగ్శర్మలతోపాటు రిటైర్డ్ ఐజీ గంగాధర్‌ల నియామకాలు ఈ కోవలోకే వస్తాయి. మరికొందరు పదవీ విరమణ చేసిన డీఎస్పీలు, అదనపు ఎస్పీల సేవలనూ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరైతే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా పనిచేస్తున్నారు. వారంతా గవర్నర్, హోంమంత్రి, డీజీపీ లేదా ఆయా యూనిట్లకు నేతృత్వం వహించే పోలీసు ఉన్నతాధికారి ఆధీనంలో పని చేస్తుంటారు. దీనికి భిన్నంగా ఎం.మహేందర్‌రెడ్డిని ఐసీసీసీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణతో కలిపి.. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మూడింటిలో జోన్లు, డివిజన్లతోపాటు పోలీస్స్టేషన్ల సంఖ్య పెంపునకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్‌కు 1,252, సైబరాబాద్‌కు 750, రాచకొండకు 763 మంది అదనపు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఐసీసీసీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని నియమించాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆయన ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించడంతో మార్పులు జరిగాయి. కేబినెట్ మూడు కమిషనరేట్ల ప్రతిపాదనలకు అదనంగా ఐసీసీసీ కోసం 400, సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం 500 పోస్టులను కూడా జోడించి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిపి మొత్తంగా 3,965 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పోలీసు విభాగం వినియోగిస్తున్న టెక్నాలజీల నిర్వహణతోపాటు ఐసీసీసీ మొత్తం దాని చైర్మన్ ఆ«ధీనంలోకి వెళుతుంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొనసాగుతున్న ఐసీసీసీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ఏడో అంతస్తులో చైర్మన్ కార్యాలయం ఉండనుంది. ఇటీవల ఐసీసీసీకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఆ చాంబర్‌ను పరిశీలించారని.. ఈ వారాంతంలో లేదా వచ్చే నెల మొదటివారంలో ఐసీసీసీ చైర్మన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
విద్యార్థుల రక్షణ సామాజిక బాధ్యత
సాక్షి, హైదరాబాద్: స్కూల్ విద్యార్థుల భద్రత, రక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముందని పాఠశాల విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముందు పలువురు అభిప్రాయపడ్డారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాణీకుముదిని అధ్యక్షురాలిగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్ ఎంహెచ్ఆర్డీలో వివిధ వర్గాలతో భేటీ అయి, వారి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ స్వాతి లక్రా, ప్రభుత్వ కార్యదర్శి దివ్య దేవరాజన్, డీపీజీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన పాల్గొన్నారు. పిల్లలపై జరిగే ఘటనలను మార్గదర్శకాల రూపకల్పనపై కమిటీ సలహాలు తీసుకుంది. డీజీపీ మాట్లాడుతూ భద్రత, రక్షణవిషయంలో యాజమాన్యాలను భాగస్వాముల ను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవస్థీకృత చట్టంలో మార్గదర్శకాల రూపకల్పన చేయాలన్నారు. ఘటన జరగకముందే మేల్కొనే వ్యవస్థ ఏర్పాటు అవసర మని స్వాతి లక్రా సూచించారు. పిల్లలరక్షణ సామాజిక బాధ్యతగా అందరూ భావించాలని దేవసేన అన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. -
గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల విద్యాలయంలో సీటు రాకపోయిఉంటే.. సొంత ఊరైన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయం చేసేవాడినని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. చిన్ననాటి స్నేహితులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఉద్యోగ విరమణ చేసేలోపు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనుకున్న డీజీపీ.. మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల విద్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఆయన విద్యాలయంలో గడిపారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుకు కారణమైన మద్ది నారాయణరెడ్డి, దివంగత పీఎం పీవీ నర్సింహారావు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వేల్ గురుకులం ఎన్నో నేర్పిందని, విద్యాపరంగా వేసిన పునాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించారు. డీజీపీ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని ఆయన స్పష్టం చేశారు. తన గురువులు నేర్పిన విలువలు ఇప్పటి వరకు దిక్సూచిలా పనిచేస్తున్నా యన్నారు. గురుకులంలో చదివితే ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చని చెప్పారు. -
రాజకీయాల్లోకీ సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాలను అమలు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. చట్టాల రూపకల్పనలో నల్సార్ విశ్వవిద్యాలయం నిమగ్నమైందని, ఈమేరకు వర్సిటీతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రత్యేక సైబర్ చట్టాలతో కేసుల విచారణ, దర్యాప్తు వేగవంతమవడంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని స్పష్టంచేశారు. సైబర్ చట్టాలను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సైయంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం దేశంలోనే మొదటిది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలతోపాటు రాజకీయాల్లో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు గూగుల్ పే ద్వారా ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేశారని ఆరోపించారు. పోలీసులు, న్యాయ విభాగాలు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయాల్లో సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారి రిజిస్టర్‌లోకి ఎక్కితే... అమెరికా తరహాలో లైంగిక నేరస్తుల జాబితా తెలంగాణలోనూ అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితాతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని సూచించారు. నిందితుల పేరు, ఇతరత్రా వివరాలను రిజిస్టర్లో ఎక్కించాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఒకసారి రిజిస్టర్లో ఎక్కితే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలకూ అనర్హులుగా ఉంటారని హెచ్చరించారు. డ్రోన్ పోలీసింగ్.. అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం విచారకరమని కేటీఆర్ చెప్పారు. సైబర్ మోసాల బారిన పడిన వారు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పోలీసు యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ‘మారుమూల ప్రాంతంలోని బాధితుడు డయల్ 100కు కాల్ చేస్తే పోలీసు వెళ్లాలంటే సమయం పడుతుంది. పోలీసు కంటే ముందే కెమెరా, సైరన్, లైట్‌తో డ్రోన్ వెళ్లి అక్కడి పరిస్థితిని పోలీసులకు చేర్చే స్థాయికి రాష్ట్రం ఎదగాలి. ఈ మేరకు డీజీపీ, హోంమంత్రి కార్యాచరణ రూపొందించాలి’ అని కేటీఆర్ చెప్పారు. నెక్ట్స్‌జెన్ పోలీసింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి సాధారణ పోలీసులు, సిబ్బంది స్థానంలో టెక్ పోలీస్, నెక్ట్స్‌జెన్ పోలీసుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీంతో రాష్ట్ర ఆదాయం కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ ఎకో సిస్టమ్ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని, సైబర్ సేఫ్టీ కేంద్రం ఏర్పాటుకు కారణమిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఏసీబీ డీజీ అంజనీకుమార్ యాదవ్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, సైయంట్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక నేరాలపై ఎస్‌హెచ్‌వోలకు అవగాహన ఉండాలి : డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నేరాలపై పోలీసు స్టేషన్ అధికారులకు(ఎస్‌హెచ్‌వో)లకు అవగాహన ఉండా లని రాష్ట్ర డీజీపీ పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక నేరాలు అరుదుగా జరిగేవని, వాటిని సీసీఎస్ లేదా సీఐడీకి బదిలీ చేసేవాళ్లమని, మారిన పరిస్థితుల్లో ఆర్థిక నేరాలు అధికమైనందున వాటి దర్యాప్తు బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీ సర్స్ మెస్‌లో ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) డీజీ ఉమేష్ష్రాఫ్ రచించిన ‘ఎకనామిక్ అఫెన్సెస్–హ్యాండ్ బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్’ను డీజీపీ ఆవిష్కరించారు. అడిషనల్ డీజీ జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యకమ్రంలో డీజీపీ మాట్లాడుతూ..యువ పోలీస్ అధికారులకు మార్గ దర్శకంగా ఉండేందుకు సర్వీసులో ఉన్న ప్రతీ సీనియర్ పోలీస్ అధికారి తమ అనుభవాలతో రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావాలలో మార్పులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా, ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన నేరాలు అధికమయ్యాయన్నారు. ఉమేష్ ష్రాఫ్ రచించిన పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని, ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. మాజీగవర్నర్, రిటైర్డ్ డీజీ పి.ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆర్థికపరమైన అవకతవకలు, నేరాలు సహకార సంఘాల నుంచే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఉమేష్ ష్రాఫ్ రాసిన మరో పుస్తకం క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ పరిచయ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్ రావు, సాంబశివరావు, ఉమేష్ కుమార్, రాజీవ్ త్రివేది, రత్నారెడ్డిలతోపాటు అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, అంజనీకుమార్, శివధర్‌రెడ్డి, రాజీవ్ రతన్, సంజయ్ జైన్, విజయ్ కుమర్, అభిలాష బిష్త్, నాగిరెడ్డి, కమలహాసన్ రెడ్డి హాజరయ్యారు. -
క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: బోగస్ సర్టిఫికెట్ల నియంత్రణకు మరో అడుగు పడింది. ఈ దిశగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 27 భాషల్లో ఈ వెబ్సైట్ సేవలు పొందేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, డీజీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వెబ్సైట్ రీ డిజైనర్ ప్రొఫెసర్ నవీన్‌కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాసంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు వక్తలు చెప్పారు. తక్షణ వెరిఫికేషన్ కూడా.. ‘ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు లింక్ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చెప్పారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. ఈ సైట్నూ హాక్ చేసే ఘనులున్నారు: డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పటివరకూ ఉద్యోగాలకు వెళ్లే యువత సరిఫికెట్లు అసలో, నకిలీవో తెలుసుకోవాలంటే తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల యువకుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే ఒక ముఠాను పట్టుకుంటే, మరికొన్ని ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లు దేశ విదేశాల్లో ఉన్నారు. కన్సల్టెన్సీలూ ఫేక్ సర్టిఫికెట్లు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ టైమ్‌లో ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. రాబోయేకాలంలో ఇందులోనూ హ్యాకర్స్ ప్రవేశించే వీలుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలి. తెలంగాణ చరిత్రలో మైలురాయి: సబిత తెలంగాణ విద్య చరిత్రలో ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే దీన్ని తెచ్చాం. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్నిస్థాయిల అధికారులు చొరవ తీసుకున్నారు. టెక్నాలజీని వాడుకుని జరిగే మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. దీన్ని ఆషామాషీగా ప్రారంభించి వదిలేయకుండా మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలి. మన రాష్ట్రంలో జారీ చేసే సర్టిఫికెట్లు నకిలీలు చేయలేరనేది నిరూపించాలి. -
అవసాన దశలో మావోయిస్టు ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమం నాయకత్వ లేమితో బలహీనమై అవసాన దశలో ఉందని, ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఆలూరి ఉషారాణి శనివారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క అలియాస్ పోచక్క అలియాస్ భాను దీదీగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారని.. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో మావోయిస్టు ఉద్యమం నుంచి తప్పుకొని లొంగిపోయారని ప్రకటించారు. ‘‘ఉషారాణి కుటుంబ నేపథ్యమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. తండ్రి ఆలూరి భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విరసంలో సభ్యుడిగా కొనసాగారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పీపుల్స్‌వార్‌లో చేరారు. ఉషారాణి గుడివాడ ఏఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూలో చేరి, 1987లో విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. 1991లో పీపుల్స్‌వార్‌లో చేరి మునుగోడు దళ కమాండర్‌గా పనిచేశారు. 1998 యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ఒకరిని చంపి, ఆయుధాలు తీసుకెళ్తున్న సమయంలో ఆమె భర్త ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఉషారాణి 2002 నుంచి ఇప్పటివరకు దండకారణ్య జోనల్ కమిటీలో పనిచేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019లో సరెండర్ అవుతానని పార్టీని కోరారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లొంగిపోయారు’’ అని డీజీపీ వివరించారు. మావోయిస్టు పార్టీకి నాయకత్వలోపం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న సీనియర్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జంపన్న, సుధాకర్ సరెండర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. మావోయిస్టు పార్టీకి అగ్ర నాయకత్వం లేక బలహీనపడిందని ఉషారాణి ద్వారా తెలుసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం పార్టీలోకి కొత్తగా వస్తున్న వారికి ఐడియాలజీ లేదని.. నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ కమిటీలో కీలకమైన 11 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని.. వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు. సెంట్రల్ కమిటీ మెంబర్ ముప్పాళ్ల లక్ష్మణరావు నడవలేకపోతున్నారని, కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని.. ఆనంద్ కూడా అనారోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోతే మంచి వైద్యసేవలు అందిస్తామని, సాధారణ జీవితం గడపవచ్చని చెప్పారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి పోలీసు విభాగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
మావోయిస్టుల ఇలాకాలో పోలీస్ బాస్‌లు
చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్.ఎస్.చతుర్వేది, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీ నళిన్‌ప్రభాత్, సదరన్ సెక్టార్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్‌కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా క్యాంపులు సీఆర్పీఎఫ్ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్‌రెడ్డి పేరొన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు. -
నిమజ్జనం పై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన
-
వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలుగా ఘనంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరు కాను న్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం సన్మానించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వాయిద్య కళాకారుడు శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్స వాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షో, ఆ తర్వాత బాణాసంచా కార్యక్రమా లుంటాయని అధికారులు తెలిపారు. వజ్రోత్స వాల్లో భాగంగా థియేటర్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు తిలకించినట్టు అధికారులు పేర్కొన్నారు. -
పుస్తక ప్రదర్శనతో బాపూ భావజాలం ఆకళింపు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఆలోచనలను, భావజాలాన్ని ఆకళింపు చేసుకొనేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో దోహదం చేస్తుందని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్నారు. ‘మంచి పుస్తకం చెంతన ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే‘.. అన్న గాంధీ సూక్తిని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులతో కలసి సీఎస్ శనివారం పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరఖాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని తిలకించారు. -
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఆయన సందేశానికి ముందు 75 మంది వీణ వాయిద్య కళాకారులతో దేశభక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఇతర నృత్యాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరక్టర్ రాజమౌళి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరక్టర్ హరికృష్ణ తదితరులతో కలిసి హెచ్ఐసీసీ వేదికను పరిశీలించారు. ఈనెల 8న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆహ్వానితులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
సీసీసీ ఆలోచన ఆయనదే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఇంతటి కమాండింగ్ వ్యవస్థ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని, కానీ, చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణానికి ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త, ప్రధాన వ్యక్తి డీజీపీ మహేందర్‌రెడ్డినే అని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కాలని, అలాగే ఈ భవనం నిర్మాణానికి సహకరించిన సంబంధిత శాఖ మంత్రి, విభాగాలు, కంపెనీలు కూడా ఇందులో భాగం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి సీసీసీ నిర్వహణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ.. యావత్ పరిపాలనకు ఉపయోగకరంగా ఉంటుందని, నార్మల్ రోజుల్లో ఒకలా.. విపత్తుల రోజుల్లో మరోలా ఉంటుందని ఆ సమయంలో మహేందర్‌రెడ్డి చెప్పారని గుర్తు చేసుకున్నారు. గొప్పపనితనం ప్రదర్శించేందుకు గొప్ప వేదిక ఏర్పాటును సాకారం చేసుకున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖకు హృదకపూర్వక అభినందనలు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఈ భవనం పూర్తి కావాలని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్య మైందని సీఎం కేసీఆర్ వివరించారు. సమాజం కోసం పాటుపడుతున్న పోలీసులకు సెల్యూట్ చెప్పిన సీఎం కేసీఆర్.. సంస్కారవంతమైన పోలీసింగ్ వ్యవస్థ అంతటా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమర్థవంతంగా పని చేయాలని, ఆ మహమ్మారిని తరిమి కొట్టాలని పోలీస్ శాఖకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సహకారం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారాయన. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మహిళా భద్రత అంశాన్ని.. తమ వెంట వచ్చిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిణితో స్వయంగా పరీక్షించి ధృవీకరించిన ఘటనను సైతం సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ఫ్రెండ్లీ పోలీస్‌గా తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికి కలికితురాయి నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
టెక్నాలజీ వినియోగంతో మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వల్ల మరింత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉబెర్ యాప్ సంస్థతో కలసి లైవ్ లింక్ షేర్ టూల్‌ను ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల రియల్ టైమ్ లొకేషన్‌తో పాటు యూజర్ వివరాలు త్వరితగతిన తెలుస్తాయని, దీని వల్ల ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం సులభమవుతుందన్నారు. భద్రత కోసమే: ఉబెర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు తాము సేఫ్టీ టూల్ కిట్ ద్వారా లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించామని ఉబెర్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తమ యాప్‌లో అనేక భద్రతా అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ లైవ్ లింక్ టూల్ కిట్ సోమవారం నుంచి పోలీస్ శాఖకు లింకు అవుతుందని తెలిపారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న స్వాతిలక్రా తదితరులు సేఫ్టీ టూల్ కిట్ పని ఇలా.. డ్రైవర్ భద్రతతో పాటు ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్, పోలీస్ కంట్రోల్ సెంటర్, డయల్ 100కి చేరిపోయేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉబెర్ యాప్‌లోని సేఫ్టీ టూల్ కిట్‌లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది. ప్రయాణికులు సైతం ఈ లింక్‌తో షేర్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ షేర్ వద్దనుకుంటే ఉబెర్ యాప్‌లోని ఎస్ఓఎస్ ఉపయోగించుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎస్ఓఎస్ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌కు క్షణాల్లో కాల్ వెళ్తుంది. దీని వల్ల అటు ప్రయాణికులు, ఇటు వాహన డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉన్నా దగ్గరలోని పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలికి చేరుకుంటుంది. -
డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్‌కు మహేందర్‌రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్ నంబర్‌ను బ్లాక్ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు. -
డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్ల వసూళ్లు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఏదో రకంగా కేటుగాళ్లు.. ప్రజలను బురిడీ కొట్టించి.. డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం సైబర్ నేరగాళ్లు వదలలేదు. 97857 43029 నెంబర్‌కు డీజీపీ డీపీ పెట్టి కేటుగాళ్లు మోసాలను తీర లేపారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్యులకు డీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం -
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీతో సైబర్ నేరాల ఆటకట్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ సంస్థలు, ఐఐటీ, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సైబర్ సేఫ్టీ, జాతీయ భద్రత అనే అంశంపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో డీజీపీ మహేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సైబర్ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డీజీపీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రతీ స్టేషన్లో సైబర్ వారియర్ సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్ కీలక పాత్ర పోషిస్తోందని దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800 లకు పైగా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సైబర్ వారియర్లుగా నియమించామని డీజీపీ తెలిపారు. జిల్లా, కమిషనరేట్, రాష్ట్రస్థాయిలోను సైబర్ నేరాల పరిశోధన విభాగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సైబర్ నేరం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సదస్సుల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర హోంశాఖ డైరెక్టర్ పౌసమి బసు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ ఐజీ రాజేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ట్రాన్స్జెండర్ల డిమాండ్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, పురుషులతో సమానంగా తమకూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఇన్‌వార్డులో వైజయంతి వసంత, ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వల తదితరులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అన్ని విభాగాల్లోని పోస్టుల్లో తమకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని బుధవారం డీజీపీ కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్జెండర్లకు ఉందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. బోర్డు విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని, దరఖాస్తు ఫారమ్‌లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ జోడించాలని డిమాండ్ చేశారు. -
‘బిహార్’.. హాట్‌హాట్..
సాక్షి, హైదరాబాద్: పొలిటికల్ వర్సెస్ పోలీస్.. ఇది కొత్తదేమీ కాదు కానీ తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా బిహారీ బ్యాచ్ అంటూ రాష్ట్రంలోని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి వారం రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డీ.. రాజీనామా చేసి కేసీఆర్ ముఖాన కొట్టు అన్న వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు దీటుగానే స్పందించాయి. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం బుధవారమే తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి గురువారం సంబంధిత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు ఇచ్చిన కీలక పోస్టింగ్‌లపై రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదురుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే కుర్చీలో కూర్చోవడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్ ఆ లేఖలో సూచించారు. దీనిపై తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించింది. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగుల్లో పక్షపాత వైఖరి తెలంగాణలో బిహార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలతో పాటు కీలకమైన విభాగాలను కేటాయించ డంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆ విభాగాలకు అధిపతులుగా పనిచేయడం వల్ల అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగులపై పక్షపాత వైఖరి వీడాలంటూ గురువారం సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్‌లు, 139 మంది ఐపీఎస్ అధికారులుండగా ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శి నుంచి ఇన్చార్జి డీజీపీ వరకు బిహార్ అధికారులనే ఇవ్వడం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎందుకు లూప్లైన్లో పెడుతున్నారో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై ఐపీఎస్‌ల ఆగ్రహం రేవంత్‌రెడ్డి చేసిన బిహార్ బ్యాచ్ వ్యాఖ్యలను రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం గురువారం తీవ్రంగా ఖండించింది. ఆలిండియా సర్వీసు రూల్స్ తెలియకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించింది. అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం జరిగే అధికారుల కేటాయింపులపై వివాదాస్పదంగా మాట్లాడటం సరైంది కాదని పేర్కొంది. పోస్టింగ్‌ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణతో కూడుకున్నదని కూడా స్పష్టం చేసింది. డీజీపీ మహేందర్‌రెడ్డి బలవంతంగా సెలవులో వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, బిహార్‌కు చెందిన ఐపీఎస్‌లను డీజీపీ చేసేందుకే ఇలా చేశారని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసోసియేçషన్ తీవ్రంగా ఖండించింది. మహేందర్‌రెడ్డి ఇంట్లో జారిపడటంతో డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి కోసం మెడికల్ లీవులో వెళ్లారని వివరించింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం అధికారుల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రాల వారీగా విభజించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. బలవంతపు సెలవు నిజం కాదు: డీజీపీ తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందం టూ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్త వం కాదని డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంట్లో జారిపడిన సంఘటనలో ఎడమ భుజంపైన ఎముకకు మూడు చోట్ల హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ జరిగిందని తెలిపారు. లోపలి గాయం మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని వివరించారు. వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందం టూ తప్పుడు, బాధ్యతా రహిత ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఒక పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని, తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీ వ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒక ఉన్నత స్థాయి, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమని, ప్రభుత్వంపై అపో హలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సంజయ్‌పై దాడి సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్య లపై దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేసిన అంశంలో రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఇతర పోలీసు అధికారులకు లోక్‌సభ ప్రివి లేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ అంశంలో బండి సంజయ్ ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. దాడి, అరెస్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ వాదనలు విని.. ఆయన సమ ర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది. తర్వాత కొద్దిగంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు్ల జారీ అయ్యాయి. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ శని వారం ఆదేశించారు. సమన్లు జారీ అయిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, హుజూరా బాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్ స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరా బాద్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, కరీంనగర్ టూటౌన్ ఇన్స్పెక్టర్ చలమల్ల నరేశ్ ఉన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల భరతం పడతాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ డిగ్రీలను తయారు చేస్తున్న నేరస్తుల భరతం పడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. దీనికోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమన్వయంతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యూనివర్సిటీలు ఇచ్చే సరిఫికెట్లన్నీ ఒకే పోర్టల్ ద్వారా సంబంధిత కంపెనీలు తేలికగా పరిశీలించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా నకిలీ అని తేలితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీలకు సూచించారు. ఈ ప్రక్రియలో పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ దిశగా అన్ని యూనివర్సిటీలు డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ నకిలీల గుర్తింపునకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. అవసరమైన సంస్థలు పోర్టల్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2016 వరకు అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్ చేశామని, త్వరలో మిగతా సంవత్సరాలవి కూడా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ వెంకటరమణ, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
ఏడాదంతా ‘కోవిడ్ డ్యూటీ’లోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి తెలిపారు. 2020 తరహాలోనే 2021లో సంవత్సరమంతా కోవిడ్ విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేశామని... వైద్య, ఆరోగ్య, రెవెన్యూ సహా ఇతర శాఖల సమన్వ యంతో ప్రజలకు సేవలు అందించామన్నారు. దీంతో ప్రజల నుంచి పోలీసులకు మంచిపేరు లభించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇతర ఉన్నతాధికారులతో కలసి వార్షిక నేర నివేది క–2021ను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాం తిభద్రతల పరిరక్షణలో సఫలీకృతమయ్యా మని, నేరాల నియంత్రణ, నేరస్తులను అరె స్టులో మంచి ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టురహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. 2020లో లాక్డౌన్ నేపథ్యంలో నేరాలు తక్కువగా నమోదయ్యాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఏడాదితో పోలిస్తే 2021లో నేరాల నమోదు 4.6 శాతం పెరిగిందని వివరించారు. 2021లో జరిగిన హత్యలు, కిడ్నాప్‌లు సహా వివిధ నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మొత్తం 1,32,906 కేసులు... వివిధ నేరాలకు సంబంధించి 2020లో మొ త్తం 1,35,537 నమోదవగా 2021లో మొత్తం కేసుల సంఖ్య 1,32,906గా నమోదైంది. 2021లో 838 హత్య కేసులు, 1,218 కిడ్నాప్, 2,382 రేప్ కేసులు నమోదయ్యాయి. 98 మంది మావోయిస్టుల అరెస్ట్.. ♦2021లో 98 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మరో 133 మంది లొంగిపోయారు. స్టేట్ కమిటీలో ఇంకా 100 ఉండగా వారిలో కేవలం 30 మందే తెలంగాణకు చెందిన వారు. మిగతా 70 మంది ఛత్తీస్‌గఢ్‌వాసులు. ఆ రాష్ట్రంతో కలసి మావోయిస్టులను కట్టడి చేస్తున్నాం. 38,812 మంది నేర నిర్ధారణ ♦2021లో మొత్తం 38,812 మంది నిందితు లు దోషులుగా నిరూపితం కాగా.. 80 కేసుల్లో 126 మందికి జీవితఖైదు పడింది. శిక్షల శాతం 48.5 నుంచి 50.3 శాతానికి చేరింది. పదేపదే నేరాలు చేస్తున్న 664 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. 5 నిమిషాల్లోనే స్పాట్‌కు... ♦డయల్ 100 నంబర్‌కు వచ్చే కాల్స్‌కు పోలీసులు సత్వరం స్పందించాలనే లక్ష్యంతో రెస్పాన్స్ టైమ్‌ను గణిస్తున్నాం. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 7 నిమిషాల్లో పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకుంటున్నారు. రూ. 53 కోట్ల విలువైన సొత్తు రికవరీ... ♦2021లో మొత్తం 17,429 దొంగతనాలు నమోదవగా రూ. 113 కోట్ల విలువైన సొ త్తు దొంగలపాలైంది. వాటిలో 7,682 కే సులను (44%) కొలిక్కి తెచ్చి రూ. 53 కో ట్ల (47%) విలువైన సొత్తు రికవరీ చేశాం. 838 జీరో ఎఫ్ఐఆర్లు... ♦నేరం జరిగినప్పుడు పరిధుల సమస్యతో బాధితుడు ఠాణాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడకుండా ఉండటానికి రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేపడుతున్నాం. 2020లో ఇలాంటి కేసులు 517 నమోదవగా 2021లో అవి 838కి పెరిగాయి. వాటిని ఆయా పరిధిల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నాం. 4 నెలల్లో ట్విన్ టవర్స్... ♦హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మి తమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 3–4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చు. రిటైరయ్యేలోగా ప్రతి పోలీసుకూ ఇల్లు ♦ప్రతి ఒక్కపోలీసుకు రిటైరయ్యే సమ యానికి సొంత ఇల్లు ఉండాలన్నదే మా లక్ష్యం. దీనికి ప్రభుత్వం సహకరిస్తోంది. ప్రతిజిల్లాకు ఓ పోలీసు కల్యాణ మం డపం, అనువైన ప్రతిచోటా పెట్రోల్ బం కుల ఏర్పాటుతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. సిబ్బందికి నామమాత్రపు వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం.