నేరాలపై సీసీటీవీ కన్ను | CCTV Focus On Crimes | Sakshi
Sakshi News home page

నేరాలపై సీసీటీవీ కన్ను

Published Mon, Dec 31 2018 2:22 AM | Last Updated on Mon, Dec 31 2018 2:22 AM

CCTV Focus On Crimes - Sakshi

డీజీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌ రెడ్డి. చిత్రంలో సీపీ అంజనీకుమార్, పోలీసు ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని, గతేడాది కంటే క్రైమ్‌ రేటు పరంగా 5% తగ్గిందని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రభు త్వం ఇస్తున్న తోడ్పాటు, ప్రజలందిస్తున్న సహకారం తో 2018 పోలీస్‌ శాఖకు కలిసొచ్చిందని.. ఇదే పద్ధ తిలో భవిష్యత్‌లో అనేక విజయాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణలో కీలక ఆధారాలుగా మారుతున్న సీసీ కెమెరాల ఏర్పాటును వచ్చే మూడేళ్లలో జిల్లాల్లోనూ విస్తృతం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో ని రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో ఈ ఏడాది పోలీసు శాఖ సాధించిన ఫలితాలు, 2019లో సాధించాల్సిన అంశాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.  

విజిబుల్‌ పోలీసింగ్‌లో విజయవంతం: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శాఖకు అందుబాటులోకి వచ్చిన నూతన పెట్రోలింగ్‌ వాహనాలు, బ్లూకోట్స్‌ బైక్‌ల ద్వారా ప్రజల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ కార్యక్రమం సక్సెస్‌ అయ్యిందన్నారు. ప్రతీ మారుమూల ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌కు సైతం ఒక అత్యాధుని క పెట్రోలింగ్‌ వాహనం, రెండు బ్లూకోట్స్‌ వాహనా లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అర్బన్‌ పోలీస్‌స్టేషన్లలో రెండు పెట్రోలింగ్‌ వాహనాలు, 4–6 బ్లూకోట్స్‌ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చి గల్లీల్లో గస్తీని విస్తృతపరిచామన్నారు. అదే విధంగా పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకున్నవారి విచారణ కోసం 4లక్షల అప్లికేషన్లు వచ్చాయని.. వాటిని కేవలం 4 రోజుల్లో విచారించి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి పంపించామన్నారు. ఇందుకుగానూ.. వరుసగా 4సార్లు ‘పాస్‌పోర్టు సేవా పురస్కార్‌’అవార్డు రాష్ట్ర పోలీస్‌ శాఖకు దక్కిందన్నారు. 

డయల్‌ 100కి కాల్‌ చేస్తే 8 నిమిషాల్లోనే.. 
పోలీస్‌ శాఖలో తీసుకొచ్చిన సాంకేతికత మార్పుల కారణంగా.. ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నామని డీజీపీ స్పష్టంచేశారు. ఈ ఏడాది డయల్‌ 100 ద్వారా 8.5 లక్షల మంది వివిధ ఘటనలపై సమాచారం, ఫిర్యాదులిచ్చారన్నారు. ఇలా ఫిర్యాదులొచ్చిన ప్రాంతాలకు (పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో) సరాసరి 8 నిమిషాల్లో చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 3–4నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర పోలీస్‌ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో టెక్నాలజీ యాప్స్‌ను వినియోగించినట్లు డీజీపీ తెలిపారు. 

టార్గెట్‌ 15లక్షల కెమెరాలు 
15లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పోలీస్‌ శాఖ పనిచేస్తోందన్నారు. 5లక్షల కెమెరాలను జిల్లాలు, ఇతర కమిషనరేట్లలో ఏర్పాటుచేయడంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలోనూ మిగిలిన 10లక్షల సీసీకెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ సీసీటీవీలు అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులకు అందుబాటులో ఉండేలా ఎక్కడికక్కడ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లతో అనుసంధానం చేస్తున్నామన్నారు. వీటి పర్యవేక్షణకు 4వేల మందికిపైగా శిక్షణ ఇచ్చినట్టు డీజీపీ తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు 3.91లక్షల కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

ప్రధాన నేరాల్లో తగ్గుదల 
రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల్లో 5% తగ్గుదల కనిపించిందన్నారు. హత్యలు 4% తగ్గగా, ఆస్తులకోసం నేరాలు 8%, చైన్‌ స్నాచింగులు 43%, మహిళలపై నేరాలు 7%, సైబర్‌ నేరాలు 3%, ఆర్థిక నేరాలు 2% తగ్గాయన్నారు. చార్జిషీట్‌ నమోదైన కేసుల్లో శిక్ష శాతం సైతం పెరిగిందని మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. జీవితఖైదు కేసుల్లో 11%, ప్రధాన నేరాల్లో 5%, ఇతర ఐపీసీ సెక్షన్ల కేసుల్లో 2% పెరుగుదల సాధించామన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్, స్మైల్‌ కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది 6,019మంది చిన్నారులను కాపాడామని.. అందులో 3,390 మందిని తల్లిదండ్రులకు అప్పగించామని, 2,629 మందిని పునరావాస కేంద్రాలకు పంపించామన్నారు. సొత్తు చోరీ కేసుల్లో 69% రికవరీ చేశామన్నారు. 2018లో రూ. 149.56 కోట్ల సొత్తు చోరీ కాగా, రూ.102.69 కోట్ల సొత్తు రికవరీ చేశామని డీజీపీ తెలిపారు.

కొత్త ఏడాది తొలి 15రోజులు ప్రజల్లోనే..
కొత్త సంవత్సరంలో పీపుల్స్‌ ఫ్రెండ్లీ సేవలను మరింత విస్తృతం చేస్తామని డీజీపీ తెలి పారు. గ్రామాలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు, బస్తీలు, ఇలా అన్ని ప్రాంతాల్లో పోలీస్‌ అధికారులు, సిబ్బంది పర్యటిస్తారని, ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి పోలీస్‌ శాఖా పరంగా కావాల్సిన సేవలేంటని తెలుసుకుంటా మని మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఇలా మొదటి పదిహేను రోజుల్లో గుర్తించిన అవసరాలను సంవత్సరకాలంలో పరిష్కరిస్తామన్నారు. కొత్త సమస్యలు వస్తే వాటిని పరిష్కరించి ప్రజల్లో పోలీస్‌ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగేలా చేసేందుకు ఈ కార్యాచరణ ఉపకరిస్తుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement