సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు.
మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్‌శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్‌నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్‌శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్‌లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్‌ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్‌టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు.
నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం..
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్‌శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్‌తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్‌శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్‌తో సీసీటీవీల బిగింపు మొదలు..
రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్‌లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.
కాగా, దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్‌శాండిల్య, సంజయ్‌జైన్, ఐజీ కమలాసన్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అందరికీ థ్యాంక్స్
ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment