నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నల్లగొండ: జిల్లా కేంద్రంలో మహిళలు, యువతులు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ చాకచక్యంగా తప్పించుకుంటున్న సైకోను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తి వికృత ప్రవర్తనపై ‘నీలగిరిలో సైకో వీరంగం’ శీర్షికన ఈనెల 26న సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో టూటౌన్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు పాతబస్తీ హిందూపూర్‌కు చెందిన కుమిరిల సతీష్‌గా గుర్తించారు. ఎన్జీ కళాశాల సమీపంలో తచ్చాడుతుండగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను సోమవారం టౌటూన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. హిందూపూర్ ప్రాంతానికి చెందిన సతీష్ 2007లో బీఎస్పీ, బీఈడీ పూర్తి చేశాడు. అనంతరం మునుగోడు రోడ్డులోని పీఎల్‌ఎన్ మెమోరియల్ స్కూల్లో 2009–2011వరకు, శివాజీనగర్‌లోని ఏకలవ్య పాఠశాలలో 2011–2012 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
మహిళలపై ద్వేషం పెంచుకుని..
సతీష్‌కు 2012 ఏప్రిల్ 25న వేములపల్లి మండలంలోని వేములపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో ఎనిమిది మాసాలకే భార్య సతీష్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఒంటరి జీవితం గడుపుతున్న సతీష్ మహిళలపై ద్వేషం పెంచుకుని అకృత్యాలకు పాల్పడుతున్నాడని డీఎస్పీ వివరించారు. సతీష్ చిన్నతనం నుంచే అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. 1999లో సమీప బంధువుతోనే వికృతంగా ప్రవర్తించి జైలుకు వెళ్లాడని తెలిపారు.
అధ్యాపకురాలి ఫిర్యాదుతో..
ఒంటరిగా వెళ్తున్న మహిళలు, ఇళ్ల ముందు ముగ్గురులు వేస్తుండగా, వాకింగ్ వెళ్తుండగా, పాఠశాలలు, కళాశాలకు వెళ్తున్న విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని సతీష్ కొద్ది రోజులుగా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. పరువు పోతుందన్న కారణంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు.
అయితే ఈ నెల 24న మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఓ అధ్యాపకురాలితో కూడా సతీష్ అసభ్యంగా ప్రవర్తించడంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది శంశుద్దీన్, శంకర్, బాలకోటి, గోపయ్యలను డీఎస్పీ అభినందించారు.
వేధిస్తే కఠిన చర్యలు : ఎస్పీ
మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆకతాయిల ఆగడాలను కట్టడి చేసి మహిళలకు భరోసా, స్వేచ్ఛ ఇచ్చేందుకు పోలీసు శాఖ , షీ టీం బృందాలు అండగా ఉంటాయన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే డయల్ 100, షీ టీం పోలీసుల నంబర్ 9963393970 సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment