ఉన్నతాధికారులకు లాక్‌డౌన్‌పై సూచనలు అందిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి. చిత్రంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దుకాణదారులు, వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు.. రోజూ ఉదయం 9.30కే కార్యకలాపాలు ఆపేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ఎవరూ కూడా చిన్నచిన్న కారణాలతో బయటికి రావొద్దని, అవసరమైన వస్తువులన్నీ సమీపంలోనే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. శనివారం డీజీపీ గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్వయంగా తిరుగుతూ లాక్‌డౌన్ పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘అనవసరంగా వాహనాలు రోడ్డు మీదికివస్తే సీజ్ చేస్తాం. లాక్‌డౌన్ తరువాతే వాటి విడుదల ఉంటుంది.
అది కూడా కోర్టు ద్వారా తీసుకోవాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల ఇచ్చిన మినహాయింపును సద్వినియోగం చేసుకోవాలి. లాక్ డౌన్‌లో అనుమతి ఉన్న పరిశ్రమలు కూడా ఈ సమయానికి అనుగుణంగానే షిప్టులు ఉండేలా చూసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు తప్ప మిగిలిన రోడ్లన్నీ మూసివేస్తాం. టౌన్లు, సిటీల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను మూసివేస్తున్నాం. మినహాయింపు సమయంలో మాత్రమే వాటిని తెరుస్తాం. దీనివల్ల రోడ్ల మీద అనవసర సంచారాన్ని నియంత్రించవచ్చు’’అని డీజీపీ చెప్పారు.
ప్రజలంతా లాక్‌డౌన్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత మందుల చీటీలు పట్టుకుని రోడ్ల మీదికి వచ్చినా.. వాహనాలు సీజ్ చేసి, కేసులు పెడతామని హెచ్చరించారు. కూరగాయల మార్కెట్లలో రద్దీ నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్లు, స్థానిక మున్సిపల్, మార్కెటింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment