
‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొనకుండా రోడ్లపైకి వచ్చిన యువకులతో ఖైరతాబాద్‌లో కోవిడ్ ప్రచారం చేయిస్తున్న ట్రాఫిక్ పోలీస్
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ అమలుకు పోలీసులు తమదైన వ్యూహంతో ముందుకు సాగారు. ఓవైపు కేంద్రం పధ్నాలుగు గంటలు, రాష్ట్రం 24 గంటల పరిధిలో కర్ఫ్యూ విధించడంతో రెండింటిని ఒకేసారి విజయవంతంగా అమలు చేశారు. శనివారం రాత్రి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ల నుంచి ఎలాంటి వాహనాలను రానీయకుండా చెక్‌పోస్టుల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వ్యవహరించి విజయవంతమయ్యారు. పట్టణాల్లో, జిల్లాల్లో జనతా కర్ఫ్యూకు పెద్దఎత్తున ఆదరణ లభించింది. పోలీసుల పనితీరుపట్ల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.