సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండవచ్చని, కానీ కరోనా వ్యాప్తికి ఈ కేంద్రాలు అడ్డాగా మారుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలు పాటించని బార్లు, మద్యం దుకాణాలు, పబ్బులు, క్లబ్బులు, ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సులు, అనుమతులు రద్దు చేయాలని తేల్చిచెప్పింది. ఆయా సంస్థల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖలను ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
పరీక్షలు ఇంతేనా?
ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని తాము ఆదేశించినా ప్రభుత్వం వాటి సంఖ్యను ఆశించిన స్థాయిలో పెంచలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం పరీక్షల్లో 20 శాతంలోపే ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా గ్రామీణ జిల్లాల్లో వాటి సంఖ్య 5 శాతానికి మించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలను 70 శాతానికి పెంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించారు.
కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మాస్క్ ధరించని 1,16,467 మందికి జరిమానా విధించినట్లు డీజీపీ నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితితో పోలిస్తే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, పాతబస్తీకి వెళ్తే 2 రోజుల్లో లక్షల మంది మాస్క్ లేకుండా దొరుకుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. బార్లు, వైన్స్, పబ్బులు, క్లబ్బులు, మాల్స్, థియేటర్ల దగ్గర ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ఆదేశించింది.
వైద్య నిపుణులతో కమిటీ...
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని తాము చెప్పట్లేదని, అయితే కరోనా కేసుల ఆధారంగా మైక్రో, కంటైన్‌మెంట్ జోన్లను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యేలా చూడాలని, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్–17 కింద వెంటనే వైద్య నిపుణులతో అడ్వయిజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉంటే వారికి కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
సీరో సర్వేలెన్స్ నివేదికతోపాటు కంటైన్‌మెంట్ జోన్ల వివరాలను తదుపరి విచారణలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక్క డోసు టీకా కూడా వృథా కాకుండా చూడాలని సూచించింది. రాష్ట్రానికి అందిన టీకా డోసుల సంఖ్య, వృథా అయిన వ్యాక్సిన్ల సంఖ్య, టీకా అందుకున్న లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తే...
పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 14లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
వైన్స్, బార్ల వల్ల కరోనా వ్యాప్తి!
Published Fri, Apr 9 2021 5:08 AM | Last Updated on Fri, Apr 9 2021 5:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment