
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను కఠినతరం చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆదివారం పోలీసులు వెనక్కి తగ్గారు. విద్యుత్ శాఖ ఉద్యోగులపై లాఠీచార్జి విషయమై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డీజీపీతో మాట్లాడగా.. తలసేమియా రుగ్మతకు సంబంధించిన వారిని అడ్డుకోవడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా స్పందించడంతో పోలీసులు దిగివచ్చారు. శనివారం అర్ధరాత్రి డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో సమీక్ష నిర్వహించి ఫుడ్ డెలివరీ సేవలకు అంతరాయం కలగించరాదని ఆదేశించారు.
అదే విధంగా తలసేమియా రుగ్మత గలవారిని, విద్యుత్ ఉద్యోగులను అడ్డుకోరాదని సూచించారు. దీంతో ఆదివారం పోలీసులు వారికి ఇబ్బందులు కలిగించలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేశారు. జాతీయ రహదారులు మినహా రాష్ట్ర రహదారులను మూసివేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాలనీ రోడ్ల నుంచి రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు లాఠీలు ఝుళిపించడం, తనిఖీలు ముమ్మరం చేయడంతో రోడ్ల మీద జనసంచారం పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీనికితోడు సరుకు రవాణా వాహనాలను నగరాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే అనుమతించడంతో రోడ్లపై వాహనాలు తగ్గిపోయాయి.
అత్యవసర విభాగాలు, మెడికల్, ఫార్మా, విద్యుత్, వ్యవసాయ తదితర అనుమతి ఉన్న రంగాల ఉద్యోగులను పోలీసులు ఐడీలు చూసి అనుమతించారు. ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు దగ్గరుండి పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అన్ని నగరాల్లో డ్రోన్ల ద్వారా గల్లీలు, కాలనీలను పర్యవేక్షించారు.కాగా, పాసులు కావాల్సిన వారు https://policeportal.tspolice. gov.in దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు.
మార్కెట్లలో రద్దీ
లాక్‌డౌన్ మినహాయింపు సమయమైన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జనాల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదివారం కావడంతో మటన్, చికెట్, చేపల మార్కెట్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు. అయితే, పోలీసుల ఆదేశాల మేరకు కూరగాయలు, ఇతర విక్రయదారులు ఉదయం 10 గంటలకన్నా ముందే వ్యాపార సముదాయాలు మూసివేసి ఇళ్లకు కదిలారు. అయితే, కొందరు ఆకతాయిలు మాత్రం 10 గంటల వరకు ఏదో కారణంతో కరోనా నిబంధనలు తుంగలోతొక్కి రోడ్లపై సంచరించారు.