పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణలో స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు, గృహహింస, లైంగిక వేధింపుల నిరోధంపై స్వయం సహాయక బృందాల మహిళలకు చైతన్యం, అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లు కలసి పనిచేయనున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకుడు సత్యనారాయణ, పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జూమ్ ద్వారా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, దేశంలో తొలిసారిగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని గుర్తుచేశారు. పోలీసులు ప్రతిచోటా భౌతికంగా ఉండలేరని, ఈ నేపథ్యంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా సమాజ భద్రతలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
89 శాతం మంది సంతృప్తి..
షీ టీమ్‌లకు 2020లో 5 వేల ఫిర్యాదులు అందాయని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా చెప్పారు. షీ టీమ్‌ల పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్ ద్వారా సర్వే నిర్వహించగా 89 శాతం మంది షీ టీమ్‌ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో 1.70 లక్షల మహిళా బృందాల్లో 17 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరికి గృహహింస, పని ప్రాంతాల్లో వేధింపులు, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడం హర్షణీయమని మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. పలు స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు. అనంతరం యూజర్ ఫ్రెండ్లీ సాంకేతిక విధానం క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే పోస్టర్, కౌమార బాలికలపై జరిగే సైబర్ క్రైమ్స్ నిరోధం తదితరాలపై ప్రచురించిన పుస్తకాలను డీజీపీ ఆవిష్కరించారు.
వేధింపులపై క్యూఆర్ కోడ్‌తో ఫిర్యాదు..
ఇటు మహిళల భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా క్యూఆర్ కోడ్ (కాప్స్ యాప్)తో ఫిర్యాదు చేసే విధానాన్ని పోలీస్ మహిళా భద్రతా విభాగం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా క్యూఆర్ కోడ్ సాయంతో మహిళలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, పని ప్రాంతాల్లో వేధింపులు తదితర సమస్యలపై మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదు చేసే విధానాన్ని సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. తమ మొబైల్ ఫోన్‌లో ఈ లింక్‌ను సేవ్ చేసుకొని, లింక్ ఓపెన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫిర్యాదుల పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు షీ టీమ్ సెంట్రల్ సర్వర్‌కు వెళ్తుంది. క్యూఆర్ కోడ్ ద్వారా అందే ఫిర్యాదులపై తీసుకునే చర్యలు, అధికారుల ప్రవర్తన తదితరాలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment