
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైదరాబాద్‌లోని అన్ని రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరి చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళల భద్రతపై డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులతోపాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ (ఎల్ అండ్ వో) స్వాతి లక్రా, రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రత గురించి తీసుకోవాల్సిన అంశాలే కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అనుమతి ఉన్న కార్లు, ఆటోలు తదితర రవాణా వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఉండాలని రవాణా అధికారులు సూచించారు. నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని, పలు ప్రజా రవాణా వాహనాల్లోనూ సీసీ కెమెరాలను అమర్చాలని సమావేశం అభిప్రాయపడింది.