
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనా వైరస్ చలనం లేనిది, అది ఎక్కడికీ ప్రయాణించలేదు. కానీ, మనుషులే వాహకాలుగా దాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ముక్కు నోరు ద్వారా వ్యాపించే ఈ వైరస్ కట్టడికి మాస్కు, భౌతికదూరం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కానీ, కొందరు పౌరులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అయినా, కొందరు ఈ విషయాన్ని పట్టించుకోవ డం లేదు. ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 4,38,123 మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు.
అందులో లాక్‌డౌన్‌లో 12 నుంచి 15 వ తేదీ వరకు 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరుగుతు న్నాయో అర్థమవుతుంది. వీరందరిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, ఐపీసీ ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.30.66 కోట్ల జరిమానా వసూలు చేశారు’’అని సోమవారం హైకోర్టుకు స్వయంగా సమర్పించిన నివేదికలో డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
రోజూ దాదాపు పదివేల కేసులు
ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 45 రోజుల్లో 4.3 లక్షల కేసులు నమోదయ్యాయి. రోజుకు 9,736 కేసులు. భారీగా గుమిగూడటం, బహిరంగంగా మద్యం తాగడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం తదితరాలన్నీ కలిపి 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. వీరిలో కొందరు రాజకీయ నేతలు కూడా తమ పుట్టినరోజు పేరుతో కరోనా నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. బాధ్యతగా ప్రవర్తించని వారెవరినీ తాము ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ స్పష్టం చేసింది.