stipulates
-
కరోనా నిబంధనలు గాలికి..జరిమానాలు 30 కోట్లపైనే..!
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనా వైరస్ చలనం లేనిది, అది ఎక్కడికీ ప్రయాణించలేదు. కానీ, మనుషులే వాహకాలుగా దాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ముక్కు నోరు ద్వారా వ్యాపించే ఈ వైరస్ కట్టడికి మాస్కు, భౌతికదూరం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కానీ, కొందరు పౌరులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అయినా, కొందరు ఈ విషయాన్ని పట్టించుకోవ డం లేదు. ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 4,38,123 మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. అందులో లాక్డౌన్లో 12 నుంచి 15 వ తేదీ వరకు 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరుగుతు న్నాయో అర్థమవుతుంది. వీరందరిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.30.66 కోట్ల జరిమానా వసూలు చేశారు’’అని సోమవారం హైకోర్టుకు స్వయంగా సమర్పించిన నివేదికలో డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రోజూ దాదాపు పదివేల కేసులు ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 45 రోజుల్లో 4.3 లక్షల కేసులు నమోదయ్యాయి. రోజుకు 9,736 కేసులు. భారీగా గుమిగూడటం, బహిరంగంగా మద్యం తాగడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం తదితరాలన్నీ కలిపి 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. వీరిలో కొందరు రాజకీయ నేతలు కూడా తమ పుట్టినరోజు పేరుతో కరోనా నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. బాధ్యతగా ప్రవర్తించని వారెవరినీ తాము ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ స్పష్టం చేసింది. -
క్వారంటైన్ నిబంధనలు: టీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇకపై హైదరాబాద్‌కు వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పేర్కొన్న నిబంధనలకు లోబడి ఇప్పుడు సరాసరి తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులకు పలు సడలింపులు ఇచ్చారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇచ్చిన సడలింపులు 4 రోజుల్లోపు రిటర్న్ టిక్కెట్లతో వ్యాపానిమిత్తం తెలంగాణకు వచ్చే ప్రయాణీకులు, వారు బయలుదేరడానికి ముందు 96 గంటలలోపు నిర్వహించిన నెగటివ్ RT-PCR పరీక్ష నివేదికను చూపిస్తే వారికి ఎలాంటి క్వారంటైన్ ఉండదు. బయలుదేరడానికి 96 గంటల ముందు నిర్వహించిన నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టుతో ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉండాలి. నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తూ, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులలోని కొన్ని విభాగాలకు సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వీరు కేవలం 14 రోజుల హోం క్వారంటైన్లో ఉండాలి. వీరిలో గర్భిణులు, 10 లేదా అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణిస్తున్న వాళ్లు లేదా వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు ఉన్నారు. అయితే నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) మిగతా ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా 7 రోజుల సంస్థాగత క్వారంటైన్, దాని తర్వాత హోం క్వారంటైన్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఎయిర్ బబుల్ ఒప్పందాల’ ద్వారా యూకే, యూఏఈ దేశాలతో కనెక్ట్ అయి ఉంది. బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్, లండన్ల మధ్య వారానికి నాలుగు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్- యూఏఈల మధ్య నడిచే ఇతర ఎయిర్‌లైన్స్– ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్‌లు కూడా త్వరలో తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి ‘వందే భారత్ మిషన్’ కింద ఛార్టర్ విమానాలు (వీటిలో ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి), ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా (నిబంధనలకు లోబడి) వస్తున్నాయి. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన 55,000 మందికి పైగా భారతీయులు నగరానికి రాగా, 10,000 మందికి పైగా వివిధ దేశాలకు చెందిన వారు హైదరాబాద్ నుంచి తమ దేశాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌ను పూర్తిగా శానిటైజ్ చేసి, అక్కడ థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారు. విమానం దిగే ప్రయాణికులు, వైమానిక సిబ్బందిని విమానం నుంచి 20-25 మందిని ఒక బృందంగా తీసుకువస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తి చేయడానికి ముందు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం, ప్రతి ప్రయాణికుడు/వైమానిక సిబ్బందిని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎయిరోబ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ చేస్తున్నారు. ప్రతి ఇమిగ్రేషన్ కౌంటరు వద్ద ప్రయాణికులు, ఇమిగ్రేషన్ అధికారులు ఒకరినొకరు తాకకుండా ఉండేందుకు గాజు అద్దాలను బిగిందారు. ప్రతి బ్యాగేజీని బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానం చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. పూర్తిగా శానిటైజ్ చేసిన ట్రాలీలను ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంచారు. -
యాభై వేలు దాటితే... రశీదు ఉండాల్సిందే
నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు రూ.50 వేలకు మించి నగదు ఉండ కూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.50 వేలకంటే నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సమయం కావడంతో రహదారులపై పోలీసులు ప్రతీ వాహనం తనిఖీ చేస్తారు. ఆ సమయంలో ఒక వ్యక్తి వద్ద రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారు అనే రశీదులతో పాటు ఎప్పడు డ్రా చేశారనే పూర్తి వివరాలు కచ్చితంగా ఉండాలి. సరైన రశీదులు లేకుంటే సంబంధించిన నగదును సీజ్ చేసే అధికారం తనిఖీ చేసే అధికారులకు ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించి మళ్లీ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే రశీదులు వెంట పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బంగారు నగల వ్యాపారులు, ఇతర వ్యాపారుల నుంచి ఎవరైనా నగదురూపంలో కాకుండా బ్యాంక్ డీడీ, చెక్‌ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తే మంచిదని ఎన్నికల కమిషన్ సూచిస్తుంది. -
ఊదరగొడితే కేసుల మోత
సాక్షి,సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎన్నికల సందడి మొదలైందంటే చాలు.. గ్రామాల్లో మైకులు హోరెత్తుతుంటాయి. మీ ఓటు మాకే అంటూ పాటల రూపంలో, అనుకరణల మధ్య పార్టీల పేరుతో ఊదరగొట్టడం సర్వసాధారణం. ప్రచార సాధనాల మోత చెవుల్లో మార్మోగుతుంది. హద్దులు మీరిన శబ్ధాలతో తలబొప్పి కడుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా డీజే శబ్ధాలతో విపరీత ధోరణికి పోవడంతో కొంత సమస్యగా మారుతుంది. చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. శబ్ధం పెరిగిందా.. కేసులు నమోదు కావాల్సిందే. ఈసారి ఎన్నికల్లో అతి శబ్ధంతో ఊదరగొడితే కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు, ఆయన తరపున ప్రచారం చేసే వారు జాగ్రత్త పడాల్సిందే మరి. ఏ ప్రాంతంలో ఎంత శబ్ధం వినియోగించాలో.. ఎన్ని డెసిబుల్స్ ఉండాలో పర్యావరణ చట్టానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. నివాస ప్రాంతాల్లో 45-55 డెసిబుల్స్ మాత్రమే వినియోగించాలి. వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల సమీపంలో 40-50 డెసిబుల్స్ . వ్యాపార ప్రాంతాల్లో 55-65 డెసిబుల్స్ . పారిశ్రామిక ప్రాంతాల్లో 70-75 డెసిబుల్స్ లోపు వినియోగించవచ్చు. -
నిబంధనలు తుస్
ఆదిలాబాద్‌టౌన్: టపాసుల దుకాణాల ఏర్పాటులో నిబంధనలు తస్సుమంటున్నాయి. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం వల్లే జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు అవుతున్నాయన్న ఆరోపణలు బాంబుల్లా పేలుతున్నాయి. ఫలితంగా వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఏ వైపు నుంచి బాంబు రూపంలో ప్రమాదం దూసుకొస్తుందోని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఊరి బయట దుకాణాలను నెలకొల్పాల్సి ఉండగా, జిల్లాకేంద్రంలోని నడిబొడ్డులో గల రాంలీలా మైదానంలో వీటిని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య.. ప్రజలకు ఎలాంటి హానీ చేకూరకుండా ఊరి బయట టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు పాటించడంలేదు. పట్టణంలో జనావాసాల మధ్యనే పదుల సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలుస్తున్నాయి. అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగితే పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, ఆస్తులు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశాలు లేకపోలేదు. గతంలో హైదరాబాద్, వరంగల్, తదితర ప్రాంతాల్లో పేలుళ్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. దీపావళి పండుగ సమీపిస్తుండడంతో టన్నులకొద్ది టపాసులను దిగుమతి చేసుకుంటుండగా అడ్డుకునే అధికారులే కరువయ్యారు. టపాసుల వ్యాపారమంతా జీరో దందాగానే కొనసాగుతోంది. కొంతమంది వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటుండగా, వీరిని నివారించేవారు కరువయ్యారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంతోపాటు డైట్ కళాశాల పక్కనగల మరోచోట కూడా ఈ దుకాణాలు వెలుస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడే వెలుస్తుండడంతో వ్యాపారులు ఈ దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లు.. టపాసుల వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయించడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ విషయాన్ని ఆయా శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉండడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో మిన్నకుండిపోతున్నారు. రూ.4 విలువ చేసే వస్తువులను దాదాపు రూ.40 వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టపాసులను తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన లక్షల రూపాయల పన్నును అక్రమ మార్గంలో ఎగ్గొడుతున్నారు. ఒకే వేబిల్పై ఎక్కువ టపాసులు దిగుమతి చేసుకుంటున్నారు. వారు తెచ్చే సరుకులపై 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, కొంతమంది మాత్రమే నామమాత్రంగా పన్ను చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్, తూనికలు, కొలతలు, ఫైర్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు వినియోగదారులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 77 దుకాణాలకు అనుమతి.. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఆన్లైన్లో 77 దుకాణాల వారు దరఖాస్తులు చేసుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో రాంలీలా మైదానంతోపాటు డైట్ కళాశాల మైదానానికి ఎదురుగా మొత్తం కలిపి 63 షాపులు, ఇంద్రవెల్లిలో 5, ఇచ్చోడలో 10, బోథ్‌లో 2 దుకాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల టపాసుల విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ విషయమై ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ నర్సింహారెడ్డిలను సంప్రదించగా.. జనావాసాల్లో ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో ఇళ్లకు దగ్గరగా ఉన్నవాటిని ఏర్పాటు చేయకుండా నిలిపివేశామని తెలిపారు. నిబంధనలివీ.. టపాసుల దుకాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. హోల్‌సేల్ దుకాణానికి రూ.2500, నామమాత్రపు దుకాణానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫైర్ శాఖతోపాటు పోలీసు, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి. ఈ లైసెన్సులు 15 రోజుల కోసం మాత్రమే వర్తిస్తాయి. పండుగ తర్వాత రెండు రోజులు మాత్రమే దుకాణాలు ఉంచాలి. ప్రతీ దుకాణం వద్ద ఫైర్ ఎక్స్‌టెన్షనల్ (అగ్నిమాపక పరికరాలు) తప్పనిసరిగా ఉంచాలి 200 లీటర్ల వాటర్ బ్యారల్ ఉంచాలి. నాలుగు ఇసుక బకెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలి. దుకాణం రేకుల ద్వారా ఏర్పాటు చేయాలి. పాత కరెంట్ తీగలు ఉంచరాదు. జాయింట్ కేబుల్స్ వాడవద్దు. ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్‌లు దుకాణాల వద్ద ఉంచరాదు. జనరేటర్ 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి. దుకాణంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలి. గోదాం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదు. టపాసుల గోదాముల వద్ద 1620 ఎల్పీఎం మోటార్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.గోదాములో పెద్ద పెద్ద గదులు, మధ్యలో అంతరాయం ఉండాలి. తదితర నిబంధనలు ఉన్నప్పటికీ ఆదిలాబాద్‌లో మాత్రం ఇవేమీ పాటించకుండా వ్యాపారులు ఇష్టారీతిన దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి టపాసుల యజమానులు నిబంధనలు పాటించాలి. అనుమతులు ఉన్నవారే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు 77 మంది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. 15 రోజులపాటు మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని నివారించేందుకు నీరు, ఇసుక, డీసీపీ అందుబాటులో ఉంచుకోవాలి. సిల్క్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించాలి. – కేశవులు, డివిజనల్ ఫైర్ అధికారి -
అడుగడుగునా ఆంక్షలు
కాలినడకనే కిలోమీటర్ల నడక ఇబ్రహీంపట్నం: కృష్ణానది పుష్కరాలు 12వ రోజు ముగింపు వేడుకల అట్టహాసాలు యాత్రికులు, ప్రజల సహనానికి తీవ్ర పరీక్ష పెట్టాయి. ఈ వేడుకలను మహా ఆడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ సంగమం ఘాట్ వరకు పోలీసు ఆంక్షలు మరింతగా విధించారు. ప్రతిరోజు సాయంత్రం జరిగే నదీమతల్లి నవహారతులకు భారీఎత్తున భక్తులు హాజరవుతుండడం తెలిసిందే. ముగింపు ఉత్సవాల్లో హారతి ఇచ్చే సమయంలో వెయ్యిమంది కళాకారులతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నందును పుష్కర ఘాట్లలో కూడా బారికేడ్ల ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్లు, పిండప్రదానాల షెడ్లు, డ్వాక్రా స్టాల్స్‌ను మధ్యాహ్నానికే పీకిపడేశారు. క్రీడాకారిణి పీవీ సిధూ, ఇతర ముఖ్య అతిథులు ముగింపు వేడుకులక హాజరవుతున్నందున ఇబ్రహీంపట్నం రింగ్‌సెంటర్ నుంచి ఆర్టీసీ ఉచిత బస్సులను కూడా సాయంత్రానికి బంద్ చేశారు. ప్రైవేట్ కార్లు, ఇతర వాహనాలూ ఇంతే. దీంతో చివరిరోజు వేడుకలు తిలకించాలని ఆశపడిన వేలాదిమంది భక్తులు రింగ్‌సెంటర్ నుంచి 1.7 కిలోమీటర్ల దూరంలోని పవిత్రసంగమం ఘాట్ వద్దకు కాళ్లీడ్చుకుంటూ వెళ్లారు. రక్షణ లేని బాణాసంచా ప్రదర్శన భారీ బాణాసంచా ప్రదర్శనకు సినీదర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో పెద్దసంఖ్యలో పడవల్లో టపాసుల సామగ్రి సిద్ధం చేశారు. ప్రారంభోత్సవ వేడుకల్లో కాల్చిన బాణాసంచా భక్తులను ఆకట్టుకున్నప్పటికీ ఆ చెత్తతో ఘాట్ నిండిపోయింది. ప్రస్తుతం అంతకంటె ఎక్కవ సంఖ్యలో భాణాసంచా తీసుకొచ్చారు.lసంగమం వద్ద నవహారతుల వెనుక బాగంలో అతిథులు కూర్చునే ఘాట్‌కు సమీపంలో బాణాసంచా కాల్చే ఏర్పాట్లు చేశారు. భక్తులు, అతిథులకు అతిసమీపంగా బాణాసంచా కాల్చటం వలన జరగరాని సంఘటన చోటుచేసుకుంటే కనీసం భక్తులు బయటకు వెల్లేందుకు కూడా ఖాళీ లేకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రశాంత పుష్కరాల్లో అట్టహాసాల పేరుతో నానా ఇబ్బందులు పెట్టారని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు.