నిబంధనలు తుస్‌ | Fireworks Business Mans Rules Not Followed Adilabad | Sakshi
Sakshi News home page

నిబంధనలు తుస్‌

Published Thu, Nov 1 2018 8:22 AM | Last Updated on Thu, Nov 1 2018 8:22 AM

Fireworks Business Mans Rules Not Followed Adilabad - Sakshi

దుకాణంలో ఏర్పాటు చేసిన టపాసులు

ఆదిలాబాద్‌టౌన్‌: టపాసుల దుకాణాల ఏర్పాటులో నిబంధనలు తస్సుమంటున్నాయి. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం వల్లే జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు అవుతున్నాయన్న ఆరోపణలు బాంబుల్లా పేలుతున్నాయి. ఫలితంగా వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఏ వైపు నుంచి బాంబు రూపంలో ప్రమాదం దూసుకొస్తుందోని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఊరి బయట దుకాణాలను నెలకొల్పాల్సి ఉండగా, జిల్లాకేంద్రంలోని నడిబొడ్డులో గల రాంలీలా మైదానంలో వీటిని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

జనావాసాల మధ్య..
ప్రజలకు ఎలాంటి హానీ చేకూరకుండా ఊరి బయట టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు పాటించడంలేదు. పట్టణంలో జనావాసాల మధ్యనే పదుల సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలుస్తున్నాయి. అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగితే పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, ఆస్తులు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశాలు లేకపోలేదు. గతంలో హైదరాబాద్, వరంగల్, తదితర ప్రాంతాల్లో పేలుళ్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు.

దీపావళి పండుగ సమీపిస్తుండడంతో టన్నులకొద్ది టపాసులను దిగుమతి చేసుకుంటుండగా అడ్డుకునే అధికారులే కరువయ్యారు. టపాసుల వ్యాపారమంతా జీరో దందాగానే కొనసాగుతోంది. కొంతమంది వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటుండగా, వీరిని నివారించేవారు కరువయ్యారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంతోపాటు డైట్‌ కళాశాల పక్కనగల మరోచోట కూడా ఈ దుకాణాలు వెలుస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడే వెలుస్తుండడంతో వ్యాపారులు ఈ దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు.

వినియోగదారుల జేబులకు చిల్లు..
టపాసుల వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయించడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ విషయాన్ని ఆయా శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉండడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో మిన్నకుండిపోతున్నారు. రూ.4 విలువ చేసే వస్తువులను దాదాపు రూ.40 వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టపాసులను తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన లక్షల రూపాయల పన్నును అక్రమ మార్గంలో ఎగ్గొడుతున్నారు.

ఒకే వేబిల్‌పై ఎక్కువ టపాసులు దిగుమతి చేసుకుంటున్నారు. వారు తెచ్చే సరుకులపై 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, కొంతమంది మాత్రమే నామమాత్రంగా పన్ను చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్, తూనికలు, కొలతలు, ఫైర్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు వినియోగదారులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

జిల్లాలో 77 దుకాణాలకు అనుమతి..

ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 77 దుకాణాల వారు దరఖాస్తులు చేసుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ పట్టణంలో రాంలీలా మైదానంతోపాటు డైట్‌ కళాశాల మైదానానికి ఎదురుగా మొత్తం కలిపి 63 షాపులు, ఇంద్రవెల్లిలో 5, ఇచ్చోడలో 10, బోథ్‌లో 2 దుకాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల టపాసుల విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ విషయమై ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ నర్సింహారెడ్డిలను సంప్రదించగా.. జనావాసాల్లో ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో ఇళ్లకు దగ్గరగా ఉన్నవాటిని ఏర్పాటు చేయకుండా నిలిపివేశామని తెలిపారు.

నిబంధనలివీ..

  •      టపాసుల దుకాణానికి ఆన్‌లైన్‌లో         దరఖాస్తు చేసుకోవాలి.
  •      హోల్‌సేల్‌ దుకాణానికి రూ.2500,     నామమాత్రపు దుకాణానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫైర్‌ శాఖతోపాటు పోలీసు, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి.
  •      ఈ లైసెన్సులు 15 రోజుల కోసం మాత్రమే వర్తిస్తాయి.
  •      పండుగ తర్వాత రెండు రోజులు మాత్రమే దుకాణాలు ఉంచాలి.
  •      ప్రతీ దుకాణం వద్ద ఫైర్‌ ఎక్స్‌టెన్షనల్‌ (అగ్నిమాపక పరికరాలు) తప్పనిసరిగా ఉంచాలి
  •      200 లీటర్ల వాటర్‌ బ్యారల్‌ ఉంచాలి. నాలుగు ఇసుక బకెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలి.
  •      దుకాణం రేకుల ద్వారా ఏర్పాటు చేయాలి. పాత కరెంట్‌ తీగలు ఉంచరాదు. జాయింట్‌ కేబుల్స్‌ వాడవద్దు. 
  •      ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్‌లు దుకాణాల వద్ద ఉంచరాదు. జనరేటర్‌ 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి.
  •      దుకాణంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలి.
  •      గోదాం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి
  •      దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదు.

టపాసుల గోదాముల వద్ద 1620   ఎల్‌పీఎం మోటార్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.గోదాములో పెద్ద పెద్ద గదులు, మధ్యలో అంతరాయం ఉండాలి. తదితర నిబంధనలు ఉన్నప్పటికీ ఆదిలాబాద్‌లో మాత్రం ఇవేమీ పాటించకుండా వ్యాపారులు ఇష్టారీతిన దుకాణాలను ఏర్పాటు  చేస్తున్నారు. 

నిబంధనలు పాటించాలి
టపాసుల యజమానులు నిబంధనలు పాటించాలి. అనుమతులు ఉన్నవారే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు 77 మంది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. 15 రోజులపాటు మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని నివారించేందుకు నీరు, ఇసుక, డీసీపీ అందుబాటులో ఉంచుకోవాలి. సిల్క్‌ దుస్తులు కాకుండా కాటన్‌ దుస్తులు ధరించాలి. – కేశవులు, డివిజనల్‌ ఫైర్‌ అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement