Fireworks shops
-
Hyderabad: క్రాకర్స్ షాపులో అగ్ని ప్రమాదం
సుల్తాన్‌బజార్: బొగ్గులకుంటలోని పరస్ ఫైర్వర్క్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. గౌలిగూడ నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్రాకర్స్‌కు నిప్పు అంటుకుని భారీ శబ్దాలు రావడం, మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు. దట్టమైన పొగతో అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బొగ్గులకుంట చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటా? లేక మానవ తప్పిదమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. దు కాణం పక్కన ఉన్న బిల్డింగ్‌కు కూడా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న తాజా టిఫిన్ సెంటర్‌కు సైతం మంటలు వ్యాపించాయి. గౌలిగూడ ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని అగి్నమాపక బృందం మంటలను ఆరి్పంది. క్రాకర్స్ కొనుగులుదారుల వాహనాలు కూడా అగ్నికి ఆహుతి కావడం ఆందోళనకు కలిగిస్తోంది. -
టపాకాయలు కాల్చేందుకు.. రెండు గంటలే!
సాక్షి, చైన్నె: దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికితోడు ఉత్తరాది రాష్ట్రాలలో బాణసంచాలకు నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది శివకాశిలోని పరిశ్రమలకు రూ. 700 కోట్ల మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. వివరాలు.. వెలుగులు చిమ్మే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టం. బాణసంచా పేల్చడం అంటే, మరెంతో ఆనందం. దీపావళిని పురస్కరించుకుని రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో బాణసంచాలు మార్కెట్లోకి వస్తోంది. ఇక టపాకాయల తయారీకి పేరుగాంచిన విరుదునగర్ జిల్లాలోని శివకాశిలో ప్రస్తుతం నిరాశాజన వాతావరణ నెలకొంది. ఒకప్పుడు ఇక్కడ దీపావళికి రూ. 5 వేల కోట్ల మేరకు టపాకాయల ఉత్పత్తి జరిగేది. అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడి ఉత్పత్తి దారులకు షాక్‌ల మీద షాక్‌లు తప్పడం లేదు. ఇక కోర్టులు ఇచ్చిన కొత్త నిబంధనలు, పలు రాష్ట్రాల్లో బాణసంచాలకు నిషేధం వెరసి ఇక్కడి వ్యాపారులు ఏటా నష్టాలను ఎదుర్కొకుంటున్నారు. గత ఏడాది వెయ్యి కోట్ల స్టాక్ శివకాశికే పరిమితమైంది. ఈ ఏడాది 50 శాతం మేరకు ఉత్పత్తిని తగ్గించినా, రూ.700 కోట్ల వరకు నష్టాన్ని తాము ఎదుర్కొక తప్పదని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా పర్యావరణానికి ఆటంకం కలిగించకుండా ఉండే బాణసంచాలను పేల్చాలని, ఉదయం 6 నుంచి 7 వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకే రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానా విధిస్తామన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక పండుగకు పది రోజులు సమయం ఉండడంతో ఆయా ప్రాంతాలలో బాణా సంచాల విక్రయాల దుకాణాల ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. -
టపాసుల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
హోసూరు (తమిళనాడు): హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై తమిళనాడు సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలతో సహా పలు వాహనాలు బూడిదయ్యాయి. 12 మంది కార్మికులు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాక్‌ను 20 మందికి పైగా సిబ్బంది అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్క పక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచాతో పాటుగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండులారీలతో పాలు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
Rajasthan: బాణాసంచాపై సీఎం అశోక్ గెహ్లాత్ కీలక నిర్ణయం
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచాను నిషేదిస్తూ గురువారం ఉత్తర్వులను జారీచేశారు. అక్టోబరు 1 నుంచి 2022 జనవరి31 వరకు రాజస్థాన్‌లో బాణాసంచా అమ్మడం, కాల్చడం,నిల్వచేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు తెలిపారు. బాణా నుంచి వెలువడే కాలుష్యం వలన ఊపిరితిత్తుల పనితీరు తీవ్ర ప్రభావానికి గురౌతుందని తెలిపారు. కరోనాతో ఇప్పటికే ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిందని అన్నారు. అందుకే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గెహ్లత్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2022 జవవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచాను నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. చదవండి: బాణాసంచాలో విషపూరిత రసాయనాలు! -
ఢిల్లీలో బాణాసంచాకు నో ఛాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాను నిషేధించాలని నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని బాణాసంచా వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గత మూడు సంవత్సరాల మాదిరిగానే, ఈ ఏడాది సైతం దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకం, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం కొనసాగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం వ్యాపారులు బాణాసంచాను నిల్వ చేసిన తర్వాత కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పూర్తి నిషేధం ఆలస్యంగా విధించామని, ఇది వ్యాపారులకు నష్టాన్ని కలిగించిందని కేజ్రీవాల్ తన ట్వీట్లో వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ముందుగానే ప్రకటించినందున వ్యాపారులందరూ ఎలాంటి బాణాసంచాను నిల్వ చేయరాదని ఆయన కోరారు. రూ.1,500 కోట్ల బాణాసంచా వ్యాపారం మరోవైపు దీపావళి రోజున దేశ రాజధానిలో సుమారు రూ.1,500 కోట్లకు పైగా బాణాసంచా వ్యాపారానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దెబ్బ తగిలినటైంది. ఢిల్లీలో 150 కి పైగా హోల్‌సేల్ బాణాసంచా విక్రేతలు ఉన్నారు. వీరేగాక దీపావళికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఢిల్లీలో బాణాసంచా విక్రేతలు తాత్కాలిక ప్రాతిపదికన వ్యాపారం చేస్తారు. -
బాణసంచాపై నిషేధం..
సాక్షి, హైదరాబాద్ : పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదే శించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నవంబర్ 10–30 మధ్య బాణసంచా కాల్చకుండా నిషేధం విధించేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాశ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. బాణసంచా కాలిస్తే వాయుకాలుష్యం ఏర్పడుతుందని, శ్వాసకోశ సమస్యలు వచ్చి ప్రజల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని ఇంద్రప్రకాశ్ వాదించారు. ఈ నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలన్నారు. బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయని తెలిపారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిచంగా ఆ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. బాణసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. రాత్రి 3 గంటల వరకు కూడా బాణసంచా కాలుస్తూ ధ్వని, వాయు కాలుష్యానికి పాల్పడుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని చెబుతానని, విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేయాలని ఏజీ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించడంతో విచారణను వాయిదా వేసింది. అనంతరం బాణాసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏజీ ప్రసాద్ నివేదించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు. వాయుకాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కరోనాతో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. వాయుకాలుష్యం ఏర్పడితే కరోనా రోగులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బాణసంచా కాల్చకుండా నిషేధం విధించింది. ఇతర హైకోర్టులు సైతం బాణసంచా కాల్చకుండా నిషేధం విధించాయి. బాణసంచా కాల్చి వాయు కాలుష్యానికి పాల్పడకుండా ప్రజలను చైతన్యం చేయండి. ఈ మేరకు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించండి’’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభంవించింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్ వర్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. బాధితులను ఆదుకుంటాం : మంత్రి కన్నబాబు పేలుడు ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. ప్రమాద విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. -
ఢాం కేర్
దీపావళిలో ఆనందం ఉంది.కాని ఆ పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంది.దీపావళి పండుగ నూనెతో, దీపాలతో, మంటతో, భాస్వరంతో ముడిపడి ఉంది. ఇవి కాంతులతో పాటు ఏమరుపాటుగా ఉండే కన్నీళ్లను కూడా మిగులుస్తాయి.ఎన్నేళ్లు గడిచినా కొన్నింటి పట్ల కొందరు నిర్లక్ష్యంగా వుంటారు.పిల్లలకు టపాకాయలు ఇచ్చి బయట వాళ్లు కాలుస్తూ ఉంటే లోపల ఉంటారు. తీరా ప్రమాదం జరిగాక వేదన అనుభవిస్తారు.దీపావళిలో వినోదంతో పాటు జాగురూకత కూడా అవసరం. నివారణ ఇంకా అవసరం.మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు చెప్పారు. పాటించండి. సేఫ్‌గా దీపావళి జరుపుకోండి. చర్మం దీపావళి పిల్లలకు ఇష్టమైన పండుగ. ఆ వెలుగులు ఉత్సవం కాస్తా ఒక్కోసారి జీవితంలో చీకట్లు నిండేలా చేయవచ్చు. మనకు ఇష్టమైన బాణాసంచా చర్మాన్ని కాల్చేయవచ్చు. అలా జరగకుండా మేనిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చదవండి. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదంలో చర్మం కాలినా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్సల గురించి తెలుసుకోండి. ప్రమాదాలకు గురికాకుండా నివారణ ఇలా: ∙సాధారణంగా బాణాసంచా కాల్చడానికి మనం కొన్ని పెద్ద దీపాలను లేదా కొవ్వొత్తులు ఉపయోగిస్తాం. ఈ కొవ్వొత్తి లేదా దీపాలను వెలిగించే ముందు కాటన్ దుస్తులు ధరించండి. దీపం మీదికి ఒంగే సమయంలో వేలాడేవి కాకుండా కాస్త ఒంటికి అంటిపెట్టుకొని ఉండేలాంటి దుస్తులు మంచిది. చున్నీ లాంటివి సైతం ముందుకు వంగినప్పుడు వేలాడకుండా కాస్త బిగించి కట్టుకోవాలి. పైటను నడుములో దోపుకోవాలి. ∙బాణాసంచా కాల్చే సమయంలో మహిళలు తమ జుట్టును క్లిప్ చేసుకోవాలి. వదులుగా వదిలేయకూడదు. ∙ఎప్పుడూ ఆరుబయటే బాణాసంచా కాల్చండి. ∙టపాసులు కాల్చే సమయంలో ఒక బకెట్ నీళ్లను పక్కనే ఉంచుకోండి. ∙పెద్ద శబ్దం వచ్చే బాంబులకు, తారాజువ్వలకు పిల్లలను దూరంగా ఉంచండి. ∙కాళ్లు మొత్తం కవరయ్యే లాంటి పాదరక్షలు ధరించండి. ∙మీ ఫస్ట్‌ఎయిడ్ కిట్ దగ్గర ఉంచుకోండి. ∙విపరీతమైన పొగవచ్చే పాంబిళ్లల్లాంటివి కాల్చకండి. ఈ పొగ మీ చర్మానికీ హాని చేస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙మీ గాయాన్ని చల్లటినీళ్లతో కడగాలి. ఈ నీళ్లు నల్లా/కొళాయి నుంచి పడుతుండేలా జాగ్రత్త తీసుకోవాలి. కాలిన గాయంపై నుంచి నీళ్లు జారుతుండేలా మగ్ను ఒంపాలి. (కాలిన చోట నీళ్లతో కడిగే సమయంలో ఆ నీరు కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీటిని పారేలా చేసి, మళ్లీ చల్లని నీరు గాయం మీద ఎప్పటికప్పుడు చేరుతుండాలి. అందుకే గాయాన్ని నల్లా / కొళాయి కింద గానీ లేదా మగ్ సహాయంతో గాని కడగాలన్నమాట)జ ఇలా అక్కడి బాణాసంచాలోని పౌడర్ అంతా కడుక్కుపోయేంతవరకు గాయాన్ని కడగాలి. ∙కాలిన గాయాల మీద సిల్వర్ సల్ఫాడయజైన్ క్రీమ్ రాయాలి. కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్రమాదానికి లోనైన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. ∙కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్లాస్టిక్ సర్జన్ కూడా అవసరం కావచ్చు. కళ్లు టపాసుల కారణంగా కంటికి స్వల్పమైన ఇరిటేషన్ నుంచి కార్నియా రాపిడికి గురవ్వడం, రెటీనా ఇబ్బందులు అంధత్వం దాకా దారి తీయవచ్చు. క్రాకర్లోని రసాయనాల సాంద్రత, కళ్లకు ఎంత బలంగా తాకింది అనే దానిపై గాయం ఆధారపడి ఉంటుంది. కంటి గోడకు అయ్యే గాయం వల్ల కలిగే వాపు (ఓపెన్ గ్లోబ్ ఇంజ్యూరీ) కార్నియల్ గాయంతో పాక్షికంగా ఉబ్బడం (క్లోజ్డ్ గ్లోబల్ ఇంజ్యూరీ) కంటి చుట్టూ నలిగిపోవడం,(కంట్యూషన్ ) కనుగుడ్డు వాపు (లామెల్లర్ లాకెరేషన్) వగైరా సమస్యలతో దీపావళి వేడుక అనంతరం కంటి వైద్యులను సంప్రదించేవాళ్లు ఎక్కువే. దీర్ఘకాలం అలుముకుని ఉండే పొగలో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ స్థాయిలు బాగా పెరగి కంటి దురదలకు, నీరు స్రవించడానికి దోహదం చేస్తుంది. జాగ్రత్తలు... టపాసుల్ని మూసి ఉంచిన బాక్స్‌లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు ధరించవద్దు. ఖాళీ ప్రదేశాల్లో గాగుల్స్ ధరించాలి. ముఖానికి, జుట్టుకి, దుస్తులకు కనీసం ఒక చేయంత దూరం లేదా అడుగు దూరంలో, చూసేటప్పుడు కనీసం 5 మీటర్లు దూరంగా ఉండి చూడాలి. కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు. వేడికి నేరుగా ఎక్స్పోజ్ అయితే తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు కాబట్టి కాంటాక్ట్ లెన్స్‌లు దరించే వాళ్లు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్చేసిన టపాసులలో సగం కాలినవి కూడా ఉండొచ్చు. బకెట్ నీళ్లతో తడిపి పారేయడం మేలు. కంటికి సమస్య వస్తే... కాలుస్తున్నప్పుడు కంటి దురద అనిపిస్తే రుద్దడం గాని నలపడం కాని చేయకూడదు వెంటనే కన్రెప్పలు పైకి ఎత్తి శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. కంటిలో ఏదైనా పెద్ద పరిమాణంలో ఇరుక్కుపోతే తీసేందుకు హడావిడిగా ప్రయత్నించవద్దు. కళ్లు మూసి ఉంచి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. కంట్లో ఏదైనా రసాయనం లాంటిది పడినట్లయితే కంటి దిగువ భాగాల్ని 30 నిమిషాల పాటు తడిపి వైద్యుల్ని సంప్రదించాలి. కంటి మీద ఏదైనా పడినా ఇరిటేషన్ అనిపిస్తే పిల్లలు గబుక్కున కంటిని నలిపేయడం గాయాన్ని పెద్దది చేస్తుంది. ఫోమ్ క్యాప్ వంటి మెత్తని వస్త్రాన్ని కంటి మీద కప్పి వైద్యులను సంప్రదించాలి. నొప్పి నివారణ మందులు సహా ఒటిసి మెడిసిన్స్ ఉపయోగించవద్దు.. ఆయింట్మెంట్ అప్లయ్ చేస్తే కంటి పరీక్ష చేసేందుకు అది అడ్డంకిగా మారుతుంది. ఈఎన్టీ పెద్ద శబ్దంతో పేలే టపాసుల వల్ల కేవలం చెవులకు మాత్రమేగాక మాత్రమే గాక అన్ని రకాలుగా నష్టం జరగవచ్చు. ఉదాహరణకు పెద్ద పెద్ద శబ్దాలు ప్రెగ్నెంట్స్‌లో గర్భస్రావం కలిగించవచ్చు. వయోవృద్ధుల్లో గుండెపోటుకూ దారితీయవచ్చు. ∙ఒక్కోసారి దూరం నుంచి వినిపించే పెద్ద పేలుడు శబ్దం కంటే దగ్గర నుంచి వినిపించే చిన్న చప్పుడే చెవికి ఎక్కువ నష్టం చేయవచ్చు. అదే అంతకంటే తక్కువ శబ్దమే చెవికి మరింత దగ్గరగా అయితే దానివల్ల నష్టం ఎక్కువ ఉండవచ్చు. ∙మానవులకు హాని చేసే శబ్దాలను రెండురకాలుగా ఉంటాయి. మొదటిది ఇంపల్స్ సౌండ్, రెండోది రెండోది... నిత్యం శబ్దాలు వింటూ ఉండటం. దీని వల్ల కలిగే నష్టాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. దీపావళి సమయంలో వినిపించే శబ్దం ఇంపల్స్ సౌండ్. దీని వల్ల కింద పేర్కొన్న ఏవైనా సమస్యలు రావచ్చు. అవి... ∙అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. ∙చెవిలో నొప్పి, గుయ్య్బరనే శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు. ∙చెవిలోపలి ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం. ∙నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి శాశ్వత నష్టమూ జరగవచ్చు. టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్: ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్’గా పేర్కొనవచ్చు. అప్పటికీ చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది. పెద్ద శబ్దం తర్వాత చెవులు వినిపించకపోతే అప్పుడు ఆ చెవిలో ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె ఎట్టిపరిస్థితుల్లో వెయ్యకండి. తప్పక ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. ఆయన మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు. ముక్కుకు, గొంతుకు హాని – టపాసుల పొగతోనూ ముక్కు, గొంతు, స్వరపేటికలో మంటగా రావచ్చు. అందుకే పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. ∙బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం చేయకూడదు. రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని వైద్య పరిభాషలో ఎపిస్టాసిస్ అంటారు. ఇలా బాణాసంచాలోని రసాయానాలు చేతులకు అంటినప్పుడు వాటిని ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచాలి. అదే చేతులతో ముఖాన్ని, కళ్లనూ రుద్దుకోవద్దు. జంతువుల సంరక్షణకు సూచనలు... పటాసుల నుంచి జంతువులను రక్షించడానికి పెటా లాంటి పెట్ కేర్ పీపుల్ మాత్రమే కాకుండా, మన లాంటి మామూలు మనుషులూ ముందుకు రావాలి. మన వినోదం కోసం కాల్చే బాణాసంచా వాటికీ చేటు తెచ్పిడుతుంది. అవి బెదరడం వల్ల మనకే ముప్పు ముంచుకురావచ్చు. ఉదాహరణకు ఒక ఆవు గోడపై పోస్టర్‌ను తింటూ ఉందనుకుందాం. లేదా రోడ్డు పక్కన కూర్చొని తిన్నదాన్ని ప్రశాంతంగా నెమరేసుకుంటుందని అనుకుందాం. పటాసు పేలిన శబ్దంతో అది బెదిరిపోయి రోడ్డు మీదకు అకస్మాత్తుగా వచ్చేస్తుంది. దాంతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురికావచ్చు. ప్రమోదం ప్రమాదం కాకుండా ఉండటానికి పశువైద్య నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివి... ∙పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరిపోయే ప్రమాదం ఎక్కువ. ఇది ఎంతగా ఉంటుందంటే... దీపావళి నాడు మాత్రమేగాక దీర్ఘకాలం పాటు వాటికి ఆ బెదురు తగ్గదు. చిన్న చిన్న శబ్దాలకే వణికిపోతుంటాయి. లేగదూడలూ, బర్రెకుర్రలూ ఇదే ప్రమాదానికి గురవుతాయి. వీధుల్లో తిరిగే పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ∙ఒక ఒక్కోసారి థౌజెండ్‌వాలా లాంటివి చాలా సేపు అదేపనిగా చిటపటలాడుతూ మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. ఒక్కోసారి వాటి గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు. ∙పెద్దగా పేలే శబ్దాలతో కక్కులకు సౌండ్ ఫోబియా వచ్చి అన్నం తినడం కూడా మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు కుక్కలాంటి జంతువులను, పేలుళ్లు తినిపించే ప్రాంతం నుంచి కాస్త శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి. వాటికి ఇష్టమైన బొమ్మలతో వాటిని ఆడిస్తూ, శబ్దాల నుంచి దృష్టి మళ్లించేలా చేయాలి. ఇక వాటికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. ∙చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్‌ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీస్తే పిల్లపిట్టల ఉసురూ మనం పోసుకున్నట్లే! అందుకే గట్టిగా పేలిపోయే శబ్దాలు వచ్చే టపాసులు కాకుండా వెలుగులు చిమ్మే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. – డాక్టర్ ఎం.వంశీధర్, రీజనల్ మెడికల్ డైరెక్టర్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
దీపం చెప్పిన కథ
అమావాస్య నాటి కారుచీకటి రాత్రిని ధగధగలాడే వెలుగులతో మిరుమిట్లు గొలిపించే పండుగ దీపావళి. దీపాల వరుసనే దీపావళి అంటారు. ఇంటింటా వీధి గుమ్మాల్లో వరుసగా దీపాలను వెలిగిస్తారు. ఉదయం పండుగ పిండివంటలను ఆరగించి, రాత్రి బాణసంచా కాల్పులతో సంబరం చేసుకుంటారు. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ప్రతీకగా జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. లోకానికి నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ జరుపుకొంటారు. ఇది హిందువులకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు కూడా ఇది ముఖ్యమైన పండుగ. దీపావళికి సంబంధించిన పురాణేతిహాసాలు, చరిత్ర సంగతి అటుంచితే, చిన్నారులకు మాత్రం దీపావళి అంటే పిండివంటలతో పాటు గుర్తొచ్చేది బాణసంచానే. బాణసంచా కాల్పుల వల్ల కాలుష్యం పెరుగుతోందంటూ కొంతకాలంగా పర్యావరణవేత్తల గగ్గోలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా బాణసంచా కాల్పులపై ఆంక్షలు విధించింది. దీపావళి రోజున రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు కేవలం రెండు గంటల సేపు మాత్రమే బాణసంచా కాల్పులు జరుపుకోవాలని ఆదేశించింది. బాణసంచా అభిమానులకు ఇది కొంత నిరుత్సాహం కలిగించే విషయమే అయినా, సుప్రీంకోర్టు ఆదేశం పర్యావరణానికి జరిగే చేటును కొంత మేరకైనా కట్టడి చేయగలదని సంతృప్తి చెందాలి. స్త్రీశక్తిని చాటే పండుగ లోక కంటకుడైన నరకాసురుడిని సత్యభామ సాయంతో చతుర్దశి రోజున సంహరించాడు. నరకాసురుడు మరణించిన మర్నాడు జనాలందరూ అతడి పీడ విరగడైనందుకు సంబరాలు చేసుకున్నారు. ఊరూ వాడా ఇంటింటా దీపాలు వెలిగించుకున్నారు. అప్పటి నుంచి నరక చతుర్దశి మర్నాడు అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణాల కథనం. క్రూరుడైన నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించేవాడు. కంటికి నచ్చిన స్త్రీనల్లా చెరపట్టేవాడు. అతడి భయానికి స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. రాత్రివేళల్లో ఇళ్లలో దీపాలను వెలిగించుకోవడానికి కూడా భయపడేవారు. మహా బలవంతుడైన నరకుడిని దేవ దానవ మానవులలో ఎవరూ ఎదిరించలేకపోయేవారు. తనకు ఎదురే లేకపోవడంతో నరకాసురుడు యథేచ్ఛగా ముల్లోకాలనూ పీడించేవాడు. అతడి బాధలను తాళలేని దేవతలు, మునులు మహావిష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. కృష్ణావతారంలో తాను అతడిని అంతమొందిస్తానని విష్ణువు వారికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే కృష్ణావతారంలో నరకుడిపై యుద్ధానికి దిగుతాడు. నరకునితో జరిగిన యుద్ధానికి కృష్ణుడితో పాటు సత్యభామ కూడా వెళుతుంది. నరకుడి సేనాని మురాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో హతమవుతాడు. నరకుడు క్రోధావేశంతో కృష్ణుడితో తలపడతాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు కాసేపు సొమ్మసిల్లిపోతాడు. అప్పుడు సత్యభామ స్వయంగా ధనుర్బాణాలు ధరించి నరకుడితో యుద్ధం కొనసాగిస్తుంది. సత్యభామ పోరు సాగిస్తుండగా మెలకువలోకి వచ్చిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకుడిని అంతమొందిస్తాడు. లోకాలను వణికించే నరకుడిపై సత్యభామ ధైర్యంగా పోరు సాగించిన కారణంగా దీపావళిని స్త్రీశక్తికి ప్రతీకగా భావిస్తారు. ఐదు రోజుల వేడుకలు దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు కొనసాగుతాయి. ఆశ్వీయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’గా జరుపుకొంటారు. ఉత్తరాదిలో దీనినే ‘ధన్ తెరాస్’ అంటారు. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఇదే రోజు ధన్వంతరి, లక్ష్మీదేవి ఉద్భవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరికి, ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి పుట్టిన రోజు ధనత్రయోదశి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుతూ ఈ రోజు ధన్వంతరికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధనత్రయోదశి మర్నాడు వచ్చే నరక చతుర్దశి నాడు అభ్యంగన స్నానాలు ఆచరించి, ఇళ్లకు అలంకరణలు చేస్తారు. దీపావళి వేడుకలకు సన్నాహాలు ప్రారంభిస్తారు. దీపావళి రోజున ప్రధానంగా లక్ష్మీపూజ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవితో పాటు గణపతికి, సరస్వతికి, కుబేరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. మార్వాడీలకు, గుజరాతీలకు దీపావళి నాటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. వారు నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటారు. బంధు మిత్రులకు మిఠాయిలు పంచుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సాయంత్రం చీకటి పడగానే ఇళ్ల ముందు వరుసగా దీపాలను వెలిగించి, బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చడం వల్ల దుష్టశక్తులు పారిపోతాయని విశ్వసిస్తారు. రావణ వధ తర్వాత సీతా రామలక్ష్మణులు దీపావళి రోజునే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని పురాణాలు చెబుతాయి. దీపావళి మర్నాడు వచ్చే కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా పాటిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమి రోజునే ‘పడ్వ’ అని అంటారు. దంపతుల మధ్య పరస్పర అనురాగం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి ప్రీతి కోసం గోవర్ధన పూజ చేస్తారు. కార్తీక శుద్ధ విదియ రోజున కొన్ని ప్రాంతాల్లో ‘భాయీ దూజ్’గా పాటిస్తారు. రక్షాబంధనం తరహాలోనే సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి చిహ్నంగా ఈ పండుగ జరుపుకొంటారు. అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. సోదరులను ఇంటికి పిలిచి పిండివంటలతో భోజనం పెడతారు. యముడికి అతడి సోదరి యమున ఇదేరోజు ఆతిథ్యం ఇచ్చిందని పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఈ పండుగను ‘యమ ద్వితీయ’ అని కూడా అంటారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. కాళీమాతను ఆరాధిస్తారు. దీప ప్రశస్తి దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మిపూజ జరుపుకోవడం వెనుక ఒక పురాణగాథ ఉంది. దుర్వాస మహర్షి ఒకసారి ఇంద్రసభకు వచ్చాడు. దేవేంద్రుడు ఆయనకు చక్కని ఆతిథ్యమిచ్చాడు. దేవేంద్రుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు అతనికి ఒక మహిమాన్వితమైన హారాన్ని ఇస్తాడు. స్వర్గాధిపతి అయిన తాను ఒక మునిపుంగవుడు ఇచ్చిన హారాన్ని ధరించడమా అనే అహంకార భావంతో ఇంద్రుడు ఆ హారాన్ని తన పట్టపుటేనుగైన ఐరావతం మెడలో వేస్తాడు. ఐరావతం దానిని తొండంతో తీసి, నేల పడవేసి తొక్కి చిందరవందర చేసింది. అసలే ముక్కోపి అయిన దుర్వాసుడు ఇదంతా చూసి పట్టరాని ఆగ్రహంతో ఇంద్రుడిని శపిస్తాడు. శాప ఫలితంగా ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని, సంపదలను పోగొట్టుకుని దైన్యస్థితిలో పడతాడు. దిక్కుతోచని స్థితిలో విష్ణువును ఆశ్రయిస్తాడు. మట్టి ప్రమిదలో ఒక దీపాన్ని వెలిగించి, దానిని మహాలక్ష్మిగా తలచి పూజించమని విష్ణువు అతడికి సూచిస్తాడు. విష్ణువు సూచన మేరకు దీపాన్ని పూజించిన ఇంద్రుడు తాను పొగొట్టుకున్న సిరిసంపదలను, స్వర్గాధిపత్యాన్ని తిరిగి పొందుతాడు. విష్ణువును దర్శించుకున్న సమయంలో ఇంద్రుడు లక్ష్మీదేవిని ‘అమ్మా! ఎల్లవేళలా నీవు శ్రీహరి వద్దనే ఉండిపోతావా? నీ భక్తులను కరుణించవా?’ అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ‘నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా తప్పక కరుణిస్తాను. మోక్షగాములైన మహర్షులకు మోక్షలక్ష్మిగాను, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగాను, విద్యార్థులకు విద్యాలక్ష్మిగాను, ఐశ్వర్యాన్ని కోరేవారికి ధనలక్ష్మిగాను, భక్తుల సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మిగాను అనుగ్రహిస్తూనే ఉంటాను’ అని బదులిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించేవారికి సిరిసంపదలకు లోటుండదని భక్తులు విశ్వసిస్తారు. దీపావళి వేడుకలను భారత్‌తో పాటు పలు దేశాల్లో ఘనంగా జరుపుకొంటారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మియాన్మార్, మారిషస్, మలేసియా, సింగపూర్, ఫిజి, సురినేమ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, పాకిస్థాన్‌లోని సిం«ద్ రాష్ట్రంలో దీపావళి అధికారిక సెలవుదినం కావడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఇండోనేసియా, కరీబియన్ దీవులు, అమెరికాలలోనూ దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలోను కూడా దీపావళి వేడుకలను ఏటా నిర్వహిస్తుండటం విశేషం. బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో దీపావళి వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. భారత్‌లోని నగరాల తర్వాత లీసెస్టర్ నగరంలోనే అంత ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతాయి. సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో కూడా దీపావళిని దేదీప్యమానంగా జరుపుకొంటారు. నేపాల్‌లో దీపావళిని ‘తీహార్’ అని, ‘స్వాంతి’ అని అంటారు. భారత్‌లో మాదిరిగానే నేపాల్లోనూ దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు చేసుకుంటారు. మొదటిరోజును ‘కాగ్ తీహార్’ అంటారు. ఆ రోజు కాకులకు ఆహారం పెడతారు. రెండో రోజు ‘కుకుర్ తీహార్’ అంటారు. ఆ రోజు శునకాలను అలంకరించి, వాటికి ఆహారం పెడతారు. మూడో రోజు ‘గాయి తీహార్’ సందర్భంగా గోవులను పూజిస్తారు. అదేరోజు లక్ష్మీపూజ చేస్తారు. సాయంత్రం ఇళ్ల ముంగిట దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తారు. దీపావళి మర్నాడు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ తర్వాతి రోజు భారత్‌లో ‘భాయి దూజ్’ జరుపుకొన్నట్లే నేపాలీలు ‘భాయి టీకా’ వేడుకలు జరుపుకొంటారు. మహిళలు తమ సోదరులను ఇళ్లకు ఆహ్వానించి, వారి నుదట తిలకం దిద్ది, విందు భోజనాలు పెడతారు. నేపాల్‌లోని నేవార్ బౌద్ధులు వజ్రయాన సంప్రదాయం ప్రకారం దీపావళి సందర్భంగా ‘మహాపూజ’ నిర్వహిస్తారు. ఇండోనేసియాలోని బాలి దీవిలో దీపావళిని ‘గలుంగాన్’ అంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ తమిళులు సుమత్రా దీవిలోని మరియమ్మన్ ఆలయంలో దీపావళికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్‌లోను అక్కడి భారతీయులతో పాటు స్థానికులు కూడా దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బాణసంచా జాగ్రత్తలు దీపావళి రోజున బాణసంచా కాల్చడానికి పిల్లలు ఎక్కువగా ఉత్సాహపడతారు. బాణసంచా కాల్చే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బాణసంచా విషయంలో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే... ►తగిన అనుమతి కలిగిన దుకాణాల్లోనే నాణ్యమైన బ్రాండ్ల బాణ సంచా సామగ్రిని కొనుగోలు చేయండి. ►బాణసంచా కాల్చేటప్పుడు నూలు దుస్తులు ధరించండి. కాళ్లకు తప్పనిసరిగా షూస్ లేదా కనీసం చెప్పులు వేసుకోండి. ►సీమటపాకాయలు, లక్ష్మీబాంబులు, తాటాకు టపాకాయలు వంటి పేలే బాణసంచాను కాల్చేటప్పుడు వాటికి సురక్షితమైన దూరంలో ఉండి కాల్చండి. ►బాణసంచా కాల్చేటప్పుడు జనసంచారాన్ని కాస్త గమనించండి. వీధుల్లో జనాలు నడుస్తున్నప్పుడు బాణసంచా కాల్పులను విరమించుకోవడమే క్షేమం. ►బాణసంచా కాల్చేటప్పుడు నిప్పురవ్వలు కళ్లలోకి పడకుండా ఉండేలా గాగుల్స్ ధరించడం మంచిది. విపరీతమైన పేలుడు శబ్దాల నుంచి చెవులను కాపాడుకోవడానికి చెవుల్లో దూది పెట్టుకోవడం కూడా మంచిది. ►ఇంటి వద్ద తగిన ఖాళీ స్థలంలో మాత్రమే బాణసంచా కాల్చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలో కాల్చవద్దు. ►ఇళ్లలో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే అవి బాణసంచా చప్పుళ్లకు బెదిరిపోయే అవకాశం ఉంది. వాటిని ఒకచోట కట్టేసి, వాటి మానాన వాటిని విడిచిపెట్టకుండా ఎవరో ఒకరు వాటి దగ్గర ఉంటూ వాటిని సముదాయించడం మంచిది. ►మితిమీరిన పొగ వెలువరించే సామగ్రిని, భయంకరమైన చప్పుళ్లు చేసే పేలుడు సామగ్రిని కాల్చకుండా ఉంటేనే మంచిది. ►బాణసంచా పొగ, చప్పుళ్ల కారణంగా కళ్లకు, చర్మానికి, చెవులకు, ఊపిరితిత్తులకు హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు, ఉబ్బసం ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు మరింతగా పెరిగే ►అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న చోట బాణసంచా కాల్పులను కనీస స్థాయికి పరిమితం చేసుకోవడం క్షేమం. దీపావళి గురించి అవీ ఇవీ... ►దీపావళి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలు వివిధ పద్ధతుల్లో జరుపుకొంటారు. ►వర్ధమాన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినందున జైనులు ఈ రోజును అత్యంత పవిత్రదినంగా భావిస్తారు. మహావీరుడిని తలచుకుంటూ జైనులు తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగిస్తారు. ►మొఘల్ చక్రవర్తి షాజహాన్ చెర నుంచి సిక్కుల మతగురువు గురు హరగోవింద్ సింగ్ విడుదలైన రోజు కావడంతో సిక్కులు కూడా దీపావళి రోజున వేడుకలు చేసుకుంటారు. క్రీస్తుశకం 1577 ►సంవత్సరంలో దీపావళి రోజునే అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన జరగడం విశేషం. ►దీపావళి రోజున దేశవ్యాప్తంగా కాల్చే బాణసంచా విలువ వందలాది కోట్ల రూపాయల మేరకు ఉంటుంది. తమిళనాడులోని శివకాశీలో బాణసంచా తయారీ పరిశ్రమ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ తయారైన బాణసంచా దేశ విదేశాలకు సరఫరా అవుతుంది. ►క్రీస్తుశకం ఆరోశతాబ్ది కాలంలో చైనావారు బాణసంచా తయారీలో కీలకమైన పొటాషియం నైట్రేట్‌ను కనుగొన్నారు. బాణసంచా కనుగొనడానికి ముందు దీపావళి వేడుకల్లో కేవలం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. ►మందుగుండు కనుగొన్న తర్వాత చిత్రవిచిత్రమైన బాణసంచా సామగ్రిని తయారు చేసేవారు. దీపావళి రోజున బాణసంచా కాల్చడం మన దేశంలో క్రమంగా వాడుకలోకి వచ్చింది. ఇతర దేశాల్లోనూ వివిధ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం మొదలైంది. ►అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు జూలై 4న అక్కడి జనాలు భారీస్థాయిలో బాణసంచా కాలుస్తారు. ►ప్రపంచంలోనే అత్యధికంగా బాణసంచా వినియోగించే సంస్థగా ‘వాల్డ్ డిస్నీ’ రికార్డులకెక్కింది. ►బ్రిటిష్ పాలకులకు బాణసంచా కాల్పులంటే చాలా ఇష్టం ఉండేది. బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ వైవిధ్యభరితమైన బాణసంచా సామగ్రి తయారు చేసే వ్యక్తి కోసం ఏకంగా ‘ఫైర్ మాస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్’ అనే ఆస్థాన పదవిని కల్పించింది. ►బ్రిటిష్ రాజు రెండవ జేమ్స్‌కు కూడా బాణసంచాపై విపరీతమైన మోజు ఉండేది. తన పట్టాభిషేక వేడుకల్లో వింతవింత బాణసంచా కాల్పులను ప్రదర్శించిన వ్యక్తిని ‘నైట్‌హుడ్’తో సత్కరించాడు. -
నిబంధనలు తుస్
ఆదిలాబాద్‌టౌన్: టపాసుల దుకాణాల ఏర్పాటులో నిబంధనలు తస్సుమంటున్నాయి. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం వల్లే జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు అవుతున్నాయన్న ఆరోపణలు బాంబుల్లా పేలుతున్నాయి. ఫలితంగా వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఏ వైపు నుంచి బాంబు రూపంలో ప్రమాదం దూసుకొస్తుందోని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఊరి బయట దుకాణాలను నెలకొల్పాల్సి ఉండగా, జిల్లాకేంద్రంలోని నడిబొడ్డులో గల రాంలీలా మైదానంలో వీటిని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య.. ప్రజలకు ఎలాంటి హానీ చేకూరకుండా ఊరి బయట టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు పాటించడంలేదు. పట్టణంలో జనావాసాల మధ్యనే పదుల సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలుస్తున్నాయి. అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగితే పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, ఆస్తులు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశాలు లేకపోలేదు. గతంలో హైదరాబాద్, వరంగల్, తదితర ప్రాంతాల్లో పేలుళ్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. దీపావళి పండుగ సమీపిస్తుండడంతో టన్నులకొద్ది టపాసులను దిగుమతి చేసుకుంటుండగా అడ్డుకునే అధికారులే కరువయ్యారు. టపాసుల వ్యాపారమంతా జీరో దందాగానే కొనసాగుతోంది. కొంతమంది వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటుండగా, వీరిని నివారించేవారు కరువయ్యారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంతోపాటు డైట్ కళాశాల పక్కనగల మరోచోట కూడా ఈ దుకాణాలు వెలుస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడే వెలుస్తుండడంతో వ్యాపారులు ఈ దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లు.. టపాసుల వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయించడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ విషయాన్ని ఆయా శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉండడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో మిన్నకుండిపోతున్నారు. రూ.4 విలువ చేసే వస్తువులను దాదాపు రూ.40 వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టపాసులను తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన లక్షల రూపాయల పన్నును అక్రమ మార్గంలో ఎగ్గొడుతున్నారు. ఒకే వేబిల్పై ఎక్కువ టపాసులు దిగుమతి చేసుకుంటున్నారు. వారు తెచ్చే సరుకులపై 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, కొంతమంది మాత్రమే నామమాత్రంగా పన్ను చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్, తూనికలు, కొలతలు, ఫైర్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు వినియోగదారులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 77 దుకాణాలకు అనుమతి.. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఆన్లైన్లో 77 దుకాణాల వారు దరఖాస్తులు చేసుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో రాంలీలా మైదానంతోపాటు డైట్ కళాశాల మైదానానికి ఎదురుగా మొత్తం కలిపి 63 షాపులు, ఇంద్రవెల్లిలో 5, ఇచ్చోడలో 10, బోథ్‌లో 2 దుకాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల టపాసుల విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ విషయమై ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ నర్సింహారెడ్డిలను సంప్రదించగా.. జనావాసాల్లో ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో ఇళ్లకు దగ్గరగా ఉన్నవాటిని ఏర్పాటు చేయకుండా నిలిపివేశామని తెలిపారు. నిబంధనలివీ.. టపాసుల దుకాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. హోల్‌సేల్ దుకాణానికి రూ.2500, నామమాత్రపు దుకాణానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫైర్ శాఖతోపాటు పోలీసు, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి. ఈ లైసెన్సులు 15 రోజుల కోసం మాత్రమే వర్తిస్తాయి. పండుగ తర్వాత రెండు రోజులు మాత్రమే దుకాణాలు ఉంచాలి. ప్రతీ దుకాణం వద్ద ఫైర్ ఎక్స్‌టెన్షనల్ (అగ్నిమాపక పరికరాలు) తప్పనిసరిగా ఉంచాలి 200 లీటర్ల వాటర్ బ్యారల్ ఉంచాలి. నాలుగు ఇసుక బకెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలి. దుకాణం రేకుల ద్వారా ఏర్పాటు చేయాలి. పాత కరెంట్ తీగలు ఉంచరాదు. జాయింట్ కేబుల్స్ వాడవద్దు. ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్‌లు దుకాణాల వద్ద ఉంచరాదు. జనరేటర్ 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి. దుకాణంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలి. గోదాం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదు. టపాసుల గోదాముల వద్ద 1620 ఎల్పీఎం మోటార్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.గోదాములో పెద్ద పెద్ద గదులు, మధ్యలో అంతరాయం ఉండాలి. తదితర నిబంధనలు ఉన్నప్పటికీ ఆదిలాబాద్‌లో మాత్రం ఇవేమీ పాటించకుండా వ్యాపారులు ఇష్టారీతిన దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి టపాసుల యజమానులు నిబంధనలు పాటించాలి. అనుమతులు ఉన్నవారే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు 77 మంది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. 15 రోజులపాటు మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని నివారించేందుకు నీరు, ఇసుక, డీసీపీ అందుబాటులో ఉంచుకోవాలి. సిల్క్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించాలి. – కేశవులు, డివిజనల్ ఫైర్ అధికారి -
నిర్లక్ష్యమా..? నిఘా వైఫల్యమా..?
విజయనగరం, బొబ్బిలి రూరల్: గతంలో బొబ్బిలి నియోజకవర్గంలో బాణసంచా పేలుళ్లు అనేకం జరిగాయి. ఒకానొక సమయంలో జిలెటిన్ స్టిక్స్, పేలుడు సామగ్రి కూడా లభ్యమైంది. కేవలం మందుగుండు సామగ్రి తయారీలో సాధారణ ప్రజలు, సంబంధం లేని కొందరు ప్రాణాలు కోల్పోతే, తీవ్ర గాయాలపాలై అంగవైకల్యం పొందినవారు మరికొందరు ఉన్నారు. లైసెన్స్ లేని అమ్మకాలు, నాసిరకం సామగ్రి పేలుళ్లకు ఒక కారణమైతే, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకర పేలుడు పదార్థాలు పట్టణం నడిబొడ్డున అమ్మకాలు జరుపుతుండడం ఇంకో కారణం. గతంలో ఇలాంటి డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కూడా. మళ్లీ ఇప్పుడు అదే తరహా ప్రమాదం జరిగింది. అంటే ఇది నిర్లక్ష్యమా..? నిఘా, పోలీసు వర్గాల వైఫల్యమా అని పలువురు అనుకుంటున్నారు. సరదాగా చేసుకోవాల్సిన సంబరాలు విషాదంగా ముగుస్తుండడంతో నిర్లక్ష్యం అన్న వాదనకు మరింత బలం చేకూరుతుంది. 2012 నుంచి మొదలుపెడితే.. 2012 సెప్టెంబర్ 18న బొబ్బిలి మండలం పారాది గ్రామంలో బాణసంచా పేలుళ్లు జరిగాయి. అప్పట్లో గ్రామంలో ఓ ఇంట్లో తయారు చేస్తున్న గోడ బాంబులు తరలిస్తున్న సమయంలో పేలుడు జరగడంతో ముగ్గురు మరణించారు. 12 మంది గాయపడ్డారు. దీంతో జిల్లా దృష్టి అంతా బొబ్బిలివైపు మళ్లింది. పోలీసులు కూడా అప్పటి నుంచే అప్రమత్తమయ్యారు. మళ్లీ 2013 ఫిబ్రవరి 14న కలువరాయిలో బాంబు పేలి ముగ్గురు విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారు. పేలని బాంబు తీసుకుని విద్యార్థులు వెలిగించడానికి యత్నించారని చెప్పారు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత మరో 6 నెలలకు గోపాలరాయుడిపేట వద్ద బాంబు పేలి ఒకరు చనిపోగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల క్రితం బాడంగి మండలం ఎరుకుల పాకల వద్ద బాణసంచా పేలి ఇద్దరు మరణించారు. ఇలా వరుస పెట్టి ఘటనలు జరుగుతున్న సమయంలోనే బొబ్బిలిలో జిలెటిన్ స్టిక్స్, భారీ పేలుడు సామగ్రి లభ్యమైంది. అప్పట్లో విజయనగరం నుంచి పోలీసులు వచ్చి వీటిని స్వాధీనం చేసుకుని పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరులను అరెస్టు చేశారు. 2016 జనవరి 29న బొబ్బిలిలో చిన్నబజారు వీధిలో నిత్యం జనం రద్దీగా ఉండే ప్రాంతంలో 7 వేలకు పైగా జిలెటిన్ స్టిక్స్, 7,118 ఎలక్ట్రానిక్, 12,400 నాన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి. బస్తాలకు బస్తాలు లభ్యం కావడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇవికాక దీపావళి సమయంలో అమ్మకాలు జరిపే మందుగుండు సామగ్రి కో కొల్లలు. అనుమతులు లేకుండా అమ్మకాలు జరిపే వ్యాపారుల నుంచి వేలాది రూపాయల సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం సరుకు వల్లే.. బాణసంచా అమ్మకాలు ఒక ఎత్తు అయితే, నాసిరకం సరుకులు తెచ్చి అమ్మకాలు చేయడం, లైసెన్స్ ఒకరి పేరిట ఒక షాపుకు పెట్టి అనేక ప్రాంతాలలో అమ్మకాలు చేపట్టడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు బాధ్యతతో వ్యవహరించకపోవడం, అమ్యామ్యాలకే పరిమితం కావడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కఠినంగా వ్యవహరిస్తామని ఎలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే 104 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని, ముడి సరుకు అమ్మే వ్యాపారులను కూడా హెచ్చరించామని ఏఎస్పీ గౌతమిశాలి తెలిపారు. పదేళ్లలో ఇలాంటి సంఘటనలు, దీనికి బాధ్యులను గుర్తించామని, రోజూ గ్రామాల్లో, పలు ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా సమాచారం సేకరించి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఏఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బాణసంచా తయారీ, అమ్మకాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం జరిగాక ఎవరినో నిందించే బదులు మనం కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలి. సంబరాల మాట అటుంచితే ప్రమాదం జరిగితే అందరం విషాదంలో గడపాల్సి వస్తుంది. చీకటి బతుకులు అయి పోతాయి. – ఆకుల దామోదరరావు, లోక్‌సత్తా నాయకుడు, బొబ్బిలి. చర్యలు చేపడుతున్నాం.. ఇప్పటికే అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం. నిఘా మరింత పెంచుతున్నాం. బాణసంచా తయారీదారులు బాడంగి, బలిజిపేటలో ఇద్దరు ఉన్నారు. వారిని పిలిపించి అనధికారికంగా ఎలాంటి తయారీ వద్దని హెచ్చరించాం. ముడి సరుకు అమ్మకందారులను గుర్తించి వారిని హెచ్చరించాం. ప్రజలు ఎవరైనా 08944–254333 నంబర్‌కు తమ వివరాలు చెప్పకుండా ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయొచ్చు. నిరంతర నిఘా పెట్టి చర్యలు తీçసుకుంటాం. – గౌతమిశాలి, ఏఎస్పీ, బొబ్బిలి. -
టపాసుల..జీరో దందా!
దీపావళి పండగ వచ్చిందంటే కనీసం నాలుగైదు శాఖల పంటపండినట్టే. టపాసుల దుకాణాలకు అనుమతులు ఇవ్వడం మొదలుకుని.. పన్నులు వసూలు చేయడం వరకు సాయం చేసినందుకు వీరి జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఆదాయం రాకుండా పోతోంది. జిల్లా కేంద్రంలోని ఓ ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారుల గుప్పిట్లో టపాసుల వ్యాపారం అంతా ‘జీరో’లో కొనసాగుతోంది..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లావ్యాప్తంగా ప్రతిఏటా కనీసం రూ.20కోట్ల టపాసుల వ్యాపారం జరుగుతోంది. ఇది అనధికారిక లెక్క. ఇదంతా ‘జీరో’దందా. జిల్లా వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకోవడంతో దీపావళి టపాసుల వ్యాపారుల పంట పండుతోంది. అలా అని చిన్నా చితక వ్యాపారులూ లాభపడుతుంది ఏమీలేదు. జిల్లా కేంద్రానికి చెందిన ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు తమ కుటుంబ సభ్యుల పేరున సుమారు 20దాకా లెసైన్సులు సంపాదించి గుప్పిట పెట్టుకున్నారు. వీరికి రెవెన్యూ, పోలీసు, ఫైర్, మున్సిపల్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సహకరిస్తున్నారు. 50 దుకాణాలకు అనుమతి ఈసారి జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో యాభై దుకాణాలకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి పట్టణం విస్తరించినందున మరో మూడు నాలుగు పాయింట్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. దేవరకొండ రోడ్, మిర్యాలగూడ రోడ్, హైదరాబాద్ రోడ్డు ప్రాంతాల్లో కూడా టపాసుల దుకాణాలకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ, ఈ ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు ఇవి ఏర్పాటుకాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఒక్కో దుకాణం నుంచి కనీసం రూ.20వేల చొప్పున వసూ లు చేసి కొందరు అవినీతి అధికారుల జేబులు నింపినట్లు సమాచారం. టపాసుల దుకాణాలకు లెసైన్సు లు జారీచేయడంలోనూ ఎలాంటి నిబంధనలు పాటిం చిలేదన్న విమర్శలు ఉన్నాయి. యాభై ఏళ్ల వయసు పైబడిన మహిళల పేరున, 18ఏళ్లు కూడా దాటని యు వకుల పేరున లెసైన్సులు ఇచ్చినట్లు చెబుతున్నారు. లక్షలు దాటని ఆదాయం ప్రతిఏటా జిల్లా వ్యాప్తంగా కనీసం రూ.20కోట్ల పైనే వ్యాపారం జరుగుతోంది. ఈ లెక్కన హీన పక్షం వాణిజ్య పన్నుల శాఖకు రూ.3కోట్ల ఆదాయం రావా ల్సి ఉంది. కానీ, ఇది రూ.లక్షలు కూడా దాటడం లేదు. అసలు టపాసుల వ్యాపారులకు విధించిన ట్యాక్సు ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో వివరాలు చెప్పడానికి కూడా ఆ శాఖ అధికారులు సిద్దంగా లేరు. ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఒక్క జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన యాభై స్టాల్స్‌లో ఒక్కో స్టాల్లో కనీసం రూ.2లక్షల విలువైన సరుకు ఉంటుంది. అంటే కోటి రూపాయలు. ఇవి కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే వ్యాపారం ఉండనే ఉంది. ఇలా మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి వంటి ప్రధాన కేంద్రాలతో పాటు దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోంది. గడిచిన రెండేళ్లుగా టపాసుల విక్రయాలు మరింత జోరందుకున్నాయని వ్యాపార వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం మాత్రం పెరగడం లేదు. నామ మాత్రంగా పన్నులు వేసి, జీరో దందాను ప్రోత్సహిస్తున్నారు. దీంతో శాఖకు చెందిన కొందరు అధికారులు, సిబ్బంది జేబులు మాత్రం నిండుతున్నాయి. ఒక్క నల్లగొండలో జరిగే వ్యాపారం ద్వారానే కనీసం రూ.30లక్షలు, జిల్లా వ్యాప్తంగా జరిగే వ్యాపారంపై పన్నుల రూపంలో సుమారు రూ.3కోట్ల ఆదాయం రావాల్సి ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కానీ, సొంతలాభం కొంత చూసుకుంటున్న కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. టపాసుల దుకాణాలకు లెసైన్సులు ఇవ్వడంతో సంబంధం ఉన్న ఆయా శాఖలతోపాటు, కలెక్టరేట్లోనే సంబంధిత సెక్షన్లో ఓ ఉద్యోగి చేతివాటంతో నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారం లెసైన్సులు జారీ చేశారని చెబుతున్నారు. ఒకేచోట దుకాణాలు ఏర్పా టు చేయడంలోనూ భారీ మొత్తంలో డబ్బులు చేతు లు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఈ లెసైన్సుల జారీ వ్యవహారంపై దృష్టి పెడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇక, జీరో దం దాను ప్రోత్సహిస్తూ నామమాత్రంగా మాత్రమే పన్నులు వసూలు చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారంపైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంది. అనుమతుల్లేకుండా జనావాసాల మధ్య పెద్దమొత్తంలో టపాసులను నిల్వ చేశారని సమాచారం. జిల్లా కేం ద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని రెండు గోదాముల్లోనూ వీటిని అక్రమంగా నిల్వ చేశారని తెలుస్తోంది.